Tamil nadu:ఎడప్పాడికి షాక్..30 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు-బిగ్ టర్న్..!!
చెన్నై:తమిళనాడు రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడని ఒక మహా మలుపు చోటుచేసుకుంటోంది. దశాబ్దాల కాలంగా రాష్ట్ర రాజకీయాలను శాసించిన ఏఐఏడీఎంకే (AIADMK) ఇప్పుడు నిలువునా చీలిపోయే స్థితికి చేరుకుంది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) అధికార పీఠాన్ని అధిరోహించేందుకు అవసరమైన మెజారిటీని సొంతం చేసుకునే క్రమంలో.. ఏకంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీలోనే సైలెంట్ ఆపరేషన్ పూర్తయినట్లు సమాచారం.
సీవీ షణ్ముగం సెక్రెట్ ఆపరేషన్:ఏం జరిగింది?
మాజీ మంత్రి సీవీ షణ్ముగం నేతృత్వంలో దాదాపు 30 మందికి పైగా ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం కావడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామి (EPS) నాయకత్వాన్ని పక్కనపెట్టి,విజయ్ సర్కార్‌కు మద్దతు ప్రకటించేలా ఈ తిరుగుబాటు వర్గం వ్యూహరచన చేస్తోంది.106 స్థానాలతో మేజిక్ ఫిగర్‌కు కొంచెం దూరంలో ఉన్న విజయ్‌కు,ఈ 30 మంది ఎమ్మెల్యేల మద్దతు లభిస్తే కోలీవుడ్ 'దళపతి' కోటపై జెండా ఎగురవేయడం ఖాయం.

షణ్ముగం సర్జికల్ స్ట్రాటజీ.. యాంటీ డిఫెక్షన్ భయం లేదా?
కొత్త పార్టీ పెట్టడం కంటే,ఏఐఏడీఎంకే శాసనసభా పక్ష నేతగా సీవీ షణ్ముగంను ఎన్నుకోవడం ద్వారా ఫిరాయింపు నిరోధక చట్టం నుంచి తప్పించుకోవచ్చని ఈ వర్గం భావిస్తోంది.ఇందుకు రెండు వ్యూహాలను రచించింది.47 మంది ఎమ్మెల్యేల్లో మెజారిటీ సంఖ్యను చూపిస్తూ తామే 'అసలైన ఏఐఏడీఎంకే' అని క్లెయిమ్ చేయడం మొదటి స్ట్రాటజీ అయితే.. రెండవది డీఎంకేను అధికారానికి దూరంగా ఉంచడమే తమ లక్ష్యమని, ప్రజల తీర్పును గౌరవిస్తూ టీవీకే (TVK) కి మద్దతు ఇస్తున్నామని ప్రకటించడం.
షాక్‌లో ఈపీఎస్..తెరవెనుక వెలుమణి,సెంగోట్టయన్?
ఒకప్పుడు ఎడప్పాడికి అత్యంత సన్నిహితులుగా ఉన్న ఎస్.పి. వెలుమణి,సీనియర్ నేత సెంగోట్టయన్ ఈ తిరుగుబాటుకు సహకరించినట్లు ప్రచారం జరుగుతోంది.తనకు పరిమితమైన బలమే ఉందని, అదే షణ్ముగం దగ్గర సంఖ్యాబలం ఎక్కువగా ఉండటంతో...ఆయనతోనే మాట్లాడితే సహకరిస్తానని వెలుమణి టీవీకే రాయబారులతో అన్నట్లు సమాచారం.ఈ పరిణామాలతో పళనిస్వామి నివాసం వద్ద ఒక్కసారిగా గంభీర వాతావరణం నెలకొంది.జయలలిత మరణం తర్వాత ఎంతో కష్టపడి పార్టీని ఏకం చేసిన ఈపీఎస్,ఇప్పుడు తన కళ్లముందే పార్టీ ముక్కలవుతుంటే నిస్సహాయంగా ఉండిపోయారనే టాక్ వినిపిస్తోంది.
ఒకవైపు డీఎంకే వ్యూహాలు, మరోవైపు సొంత పార్టీ నేతల వెన్నుపోటు..ఈ రెండింటి మధ్య ఎడప్పాడి పళనిస్వామి రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడింది.మరోవైపు,ఏ గండం లేకుండా విజయ్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతారా? లేక ఈ రాజకీయ చదరంగంలో మరిన్ని మలుపులు రానున్నాయా?అన్నది వేచి చూడాలి. ప్రస్తుతానికి తమిళనాడు రాజకీయాలు మాత్రం క్లైమాక్స్ దిశగా దూసుకుపోతున్నాయి.














Click it and Unblock the Notifications