వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా 'ఆట'పై దుమారం

By Staff
|
Google Oneindia TeluguNews

అమెరికా భారతి ఎడిటర్‌ మురళీ చందూరితో హైదరాబాద్‌లో జరిగిన ఇష్టాగోష్ఠిపై పడగాల నాగేందర్‌ రాసిన రిపోర్ట్‌పై పలు ప్రతిస్పందనలు వచ్చాయి.

1. ఇటు మీ సైట్‌ మీద, అటు రచ్చబండ మీద చాలా చర్చ జరిగిపోతోంది. ఈ చర్చంతా నా వ్యాఖ్యలుగా చెప్పబడుతున్న వాటి మీద జరుగుతోంది గనుక ఈ వివరణ ఇవ్వడం నా బాధ్యత. మార్చి 11న మురళీ చండూరితో జరిగిన సమావేశంలో నేను అన్న మాటల్లో కొన్నిటిని వాటి సందర్భం నుంచి విడదీసి, కొంచెం సంచలనాత్మకత వచ్చేట్టు రాయడం జరిగింది. అట్లాగే 'క్షమాపణ' అనే విషయం మొదట ప్రస్తావించింది నేను కాదు. మరొకరు ప్రస్తావించి దాని మీద చర్చ జరిగేటప్పుడు ''ఇప్పుడెట్లా సవరించుకోగలం?'' అని మురళి ప్రశ్నిస్తే నేను చరిత్రలో అటువంటి ఉదాహరణలు చూపి, క్షమాపణలు చెప్పగల మార్గాలు సూచించాను.

అమెరికాలోని తెలుగువారు ఇక్కడి సాహిత్యాన్ని ప్రోత్సహించడమో, ఆదరించడమో చేస్తే అభ్యంతరం లేదని, ఒక కొత్త తెలుగు సాహిత్య అభిమానుల బృందం వచ్చిందని అనుకోవచ్చునని, కానీ ఈ సంబంధం అసమానంగా వుందని, 1997 నుంచి ఇప్పటి వరకు కొన్ని పాజిటివ్‌ సిగ్నల్స్‌తో పాటు, చాలా ఎక్కువ నెగెటివ్‌ సిగ్నల్స్‌ ఉన్నాయని నేను అన్నాను. ఆ నెగెటివ్‌ సిగ్నల్స్‌ ఏమిటో చెప్పే ప్రయత్నంలోనే రేగడివిత్తులు ప్రస్తావన వచ్చింది. ఆ అసమానత డాలరు విలువ వల్ల 48 గుణితంగా వున్నదని నేను అన్నాను. ఈ నెగెటివ్‌ సిగ్నల్స్‌ వదుల్చుకుని, సమాన స్థాయిలో ఇక్కడి సాహిత్యంతో సంబంధం ఏర్పరుచుకుంటే మంచిదని నేను అన్నాను. నిజానికి నేను ప్రకటించిన అభిప్రాయాన్నే నేను ఇప్పటికీ రేగడివిత్తులు సమీక్ష (1999)లోను, సాహిత్య పోషణ మీద వ్యాసం (2001)లోను, కాగితపు పులి కళ్లలో భయం చర్చలోను చెప్పి ఉన్నవే.
-ఎన్‌. వేణుగోపాల్‌

2. మురళీ చందూరితో హైదరాబాద్‌ సాహితీ మిత్రుల సమావేశం స్నేహ పూర్వకంగానే జరిగింది. ఏకీభావం లేని అభిప్రాయాల బదలాయింపు కూడా స్నేహంగానే జరిగింది. కానీ నాగేందర్‌ తన రిపోర్టులో కొంత దూకుడు చూపించాడు. నిజానికి నిలదీయడం వంటి సందర్భాలేవీ అక్కడ ఎదురు కాలేదు. ఇక పోతే నేను అవార్డులు ఇవ్వకండి అని 'మరింత ముందుకు వెళ్లి' అన్నట్టుగా రిపోర్టు అయింది. ఒక దుర్మార్గానికి అనుకూలంగా, వ్యతిరేకంగా ఎలా రాసినా సరే అవార్డు ఇష్టం అని చూండూరీ అన్నప్పుడు ''మీరు ఏ విలువల పక్కన నిలబడుతారో స్పష్టంగా తేల్చుకోండి'' అని మాత్రమే నేనన్నాను. రేగడి విత్తులును మీరు ఉత్తమ రచనగా ఎంపిక చేసినప్పుడు దాని సారాంశాన్ని కచ్చితంగా తూచగలిగే పనిముట్లు మీ దగ్గర లేవు, ఆ తర్వాత ఇక్కడి సాహిత్య లోకం ఆ పనిముట్లను మీకు అందించింది, ఇప్పుడైనా వాస్తవం తెలుసుకుని తప్పు అంగీకరించండి... అని కూడా నేనన్నాను.

అన్ని రకాల వలసలనూ చండూరి ఒకే గాటన కట్టేయడాన్ని కూడా నేను అంగీకరించలేదు. కూటికి లేక నిష్క్రమించే వలసలకూ, ధనార్జన కోసం స్వదేశాన్ని నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్లే వలసలకూ పోలిక వుండదు అన్నాను. ఇవేవీ ప్రస్తావించకుండా అవార్డులు ఇవ్వకండి అని అన్నానని రాయడం సమంజసం కాదు. అవార్డులు ఇవ్వకండి అని అనడానికి నేనేవర్ని? ఈ చర్చంతా ఆత్మీయంగానే జరిగింది. ఎక్కడా ఘర్షణ లేదు. నాగేందర్‌ రిపోర్టు చదివితే అక్కడేదో అసెంబ్లీయో, పార్లమెంటో జరిగిన జరిగిన భ్రమ కలుగుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X