హంసల కోవలో ఆఖరివాడుః రా.రా.

మనకి సృజనశీల రచయితలు - క్రియేటివ్‌ రైటర్స్‌ - చాలామందే వున్నారు. కానీ క్రియాశీల రచయితలు - డైనమిక్‌ రైటర్స్‌ మాత్రం చాలా తక్కువ.అతి అరుదయిన ఈ హంసలకోవలోకి లెక్కకొచ్చే క్రియాశీల రచయిత రాచమల్లు రామచంద్రారెడ్డి. రా. రా విశేష సంచిక వెలువడిన సందర్భంగా ప్రత్యేక వ్యాసం.

మనకి సృజనశీల రచయితలు - క్రియేటివ్‌ రైటర్స్‌ - చాలామందే వున్నారు. కానీ క్రియాశీల రచయితలు - డైనమిక్‌ రైటర్స్‌ మాత్రం చాలా తక్కువ. బహుశా అది మన జాతి లక్షణమేమోనని సర్దుకుపోవడానికి వీల్లేని స్థాయిలో కొద్దిమంది -చాలా కొద్దిమందే అనుకోండి. చిచ్చరపిడుగుల్లా రెచ్చిపోయినవాళ్ళు కనిపిస్తారు. అతి అరుదయిన ఈ హంసలకోవలోకి లెక్కకొచ్చే క్రియాశీల రచయిత రాచమల్లు రామచంద్రారెడ్డి. సాహితీలోకం ఆయన్ను రా.రా.గా గుర్తించి గౌరవించి, అభిమానించి ఆరాధించింది.

మంచి కథకుడు, విస్తృతంగా అనువాదకుడూ అయిన రారా మౌలికంగా విమర్శకుడు. ఒకే కోణంలో చూపు ప్రసరించగల నిబ్బరమూ నిదానమూ ఉన్న దార్శనికుడు కనకనే సామాన్యుల దృష్టికీ, సామాన్య దృష్టికీ పొడసూపని అనేక విషయాలు చక్కగా చూడగలిగాడు. చక్కని, శక్తిమంతమయిన, భావస్ఫోరమయిన ఎక్స్‌ప్రెషన్‌ ఉన్న రచయిత కూడా కావడం చేత రారా చేతిలో విమర్శ దాదాపు సృజనాత్మక సాహిత్య ప్రక్రియగానే ఒరిగింది. ఎన్నిసార్లు చదివినా మళ్ళీ చదవాలనిపించే రీతిలో పుస్తక సమీక్షలు గ్రంథ పరిచయాలు చేసిన మరో రచయిత లేడంటే అతిశయోక్తి కాదు. పరిశీలనాంశం లోలోతుల్లోకి వెళ్ళి శోధించే తత్వమూ, చిలువలుపలువలు, అది ఎలా పైపైకి పోయిందో పరిశోధించే మనస్తత్వమూ రారా సొంతం. వృత్తిధర్మంగానో ఉద్యోగవిధుల్లో భాగంగానో ఆయన అలా చెయ్యలేదు. అలా చెయ్యడం రారా లక్షణం.

అందుకే ఆ క్రమంలో ఏదీ ఆయనకి అడ్డంకిగా కనిపించలేదు. మధ్యతరగతి మర్యాదలను ఆయన ఎప్పుడూ పాటించలేదు. తన పరిశీలన పరిధిలోకి వచ్చిన రచయిత, ఆ పరిధికి అవతల ఎంతటి వాడయినా రారా లెక్క చెయ్యలేదు. కత్తి విదరలాంటి తన చూపుకు అడ్డం వచ్చిన ఏ జలతారు పరదానీ ఆయన ఖాతరు చెయ్యలేదు. అందుకు అనేకులు రారాను 'అరసికుడు' అని నిందించారు గర్విష్టిగా పొరబడ్డారు. దురహంకారిగా భ్రమపడ్డారు. అయితే రారాతో విభేదించగల తమ హక్కును వినియోగించుకున్న మిత్రులూ ఉన్నారు. అందుచేత వాళ్ళకి రారాతో సంబంధాలేం చెడిపోకపోవడం గమనార్హం. అలాంటి ఉన్నత వ్యక్తిత్వం కనకనే ఇప్పటికీ - చనిపోయి పుష్కరం కావస్తున్నప్పటికీ సాహిత్యాభిమానులకు స్ఫూర్తిమంతంగానే నిలిచి వున్నారు రారా గారు.

రాచమల్లు రామచంద్రారెడ్డిది కడప జిల్లా. ఆయన సహచరులూ అనుచరులూ పెద్ద సంఖ్యలో అక్కడ ఉన్న విషయం చాలామందికి తెలుసు. వాళ్ళంతా కలిసి 'రారా స్ఫూర్తి'గా ఒకటై ఆయనకో స్మారక గ్రంధాలయ సన్నాహక సంఘంగా రూపొందారు. ఈ ఏడాది మొదట్లో 'రారా విశేష సంచిక' పేరిట ఒక సావనియర్‌ను కూడా ప్రచురించారు. ఇందులో రాచమల్లు రామచంద్రారెడ్డి బహుముఖ ప్రతిభను విధవిధాలుగా దర్శించి రాసిన వ్యాసాలు పాతికపైగా వున్నాయి. ఆయన రచనల మీద సమీక్షలు, ఆయన చనిపోయినప్పుడు రాసిన సంపాదకీయాలు కూడా చేర్చారు. అవేకాకుండా 'అభ్యుదయ' మాసపత్రికలో బిజె రామారావుగారు రారా 'సారస్వత వివేచన' పుస్తక సమీక్ష మీద డివివిఎస్‌ వర్మ రాసిన పునస్సమీక్షను కూడా ఇందులో చేర్చారు. ఇలాంటి స్పొరాడిక్‌, పోలెమికల్‌ రచనలు ఇందులో లేకపోతే నష్టమేమిటో అర్ధం కాదు.

రాచమల్లు రామచంద్రారెడ్డిగారికి మన సాహితీ జగత్తులో గొప్ప ఆదరణ, కొండొకచో మాస్‌ఫాలోయింగ్‌ కూడా ఉంది. బాధ్యత ఉన్న పెద్దలెందరో లౌక్యం పాటించి మౌనం వహించి ఉన్న ఒకానొక క్షణంలో నోరు తెరిచి, నిజాన్ని నిర్భయంగా ప్రకటించిన రా.రా. ఆ ఆదరణకు అన్ని విధాలా అర్హులే. నడిమి తరగతి ఇన్హిబిషన్స్‌కు లొంగి చేదు నిజాలకు తీపి పూతలు పూసేందుకు పెద్దలు తాపత్రయ పడుతున్న తరుణంలో - కొడవటిగంటి కవిరాట్టు కథలో విమర్శకుడిలాగా - గొంతు పెగల్దీసి కటువయిన సత్యాలను మింగించిన రా.రా.కు మాస్‌ ఫాలోయింగ్‌ ఉండడం సహజమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+