• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఖాళీల పూరింపే నా కృషి: జయధీర్‌

By Staff
|

అస్తిత్వ (ఐడెంటిటీ) ఉద్యమాలను, సాహిత్యాన్ని మీరు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారా అని ప్రశ్నిస్తే- ''సాహిత్యంలో ఐడెంటిటీ ఉద్యమాలను రెండు రకాలుగా చూస్తున్నాం. ఒకటి- పూర్తి నెగెటివ్‌, రెండు- పూర్తి పాజిటివ్‌. ఇది సరైన పద్ధతి కాదు. ఈ ఉద్యమాలు ఒక దశలో రాక తప్పని పరిస్థితి. తప్పు కాదు. కుల చైతన్యం వరకు మాత్రమే వాటిని పరిమితం చేయడం పరిశీలకుల తప్పు అవుతుంది. ఆ మేరకే సమూహాల చైతన్యాన్ని పరిమితం చేయడం ఉద్యమ నాయకత్వం తప్పు అవుతుంది. భారతదేశంలోని ప్రజల్లో చైతన్యం రావడానికి రకరకాల సెగ్మెంట్స్‌లో సాధ్యమవుతుంది. ఏ దశా లేకుండా డైరెక్ట్‌గా కేవలం వర్గ చైతన్యం ఒక్కటే వెలువడాలని భావించడం అత్యాశ అవుతుందేమో! నిజానికి గత వందేళ్ల సామాజిక, రాజకీయ ఉద్యమాలు ఒక పెద్ద వర్గ చైతన్యాన్ని తీసుకురావాల్సి వుండింది. కానీ అది జరగలేదు. అందుకే ఎక్కడ, ఎందుకు, ఎప్పుడు తప్పటడుగు వేశామో తేలాల్సి వుంది. ప్రజలలోని అనవగాహనో, నాయకత్వ అనవగాహనో, లేక సైద్ధాంతిక అన్వయలోపమో తేల్చాల్సి వుంది'' అని ఆయన చెప్పారు.

సాహిత్యంలో అస్తిత్వ ఉద్యమాలను చూడాల్సిన విధానం గురించి- ''అస్తిత్వ పోరాటాలకు అనుబంధించి వచ్చిన సాహిత్యంలోని కొత్త వస్తువు, భావన, ప్రజల ఆకాంక్షలు, వ్యక్తీకరణలు, నుడికారం ప్రధానమైనవి. ఇంతకు ముందు ఎక్కడా ఈ రూపంలో వచ్చిన దాఖలాలు లేవు. ఈ రకంగా ఇది కొత్త జవజీవాలతో కూడుకున్న సాహిత్యం. ఈ సాహిత్యాన్ని దూరం కొట్టలేం. దీన్ని మానవ జాతి పరిణామ క్రమంలోంచి వచ్చిన సాహిత్యంగానే గుర్తించాలి. సాహిత్య చరిత్రలో ఈ సాహిత్య పాయలకి స్థానం ఇవ్వక తప్పదు. కేవలం బ్రాహ్మణీయ ఆధిపత్య దృక్పథం మాత్రమే ఈ సాహిత్యాలను నిరాకరిస్తుంది. ప్రజాస్వామ్య భావాలు కలిగిన వారు దీన్ని ఆహ్వానించకతప్పదు. భవిష్యత్తులో దీర్ఘ కాలిక ఉద్యమాలు ఈ సాహిత్యాన్ని లేదా దీని స్వరూప స్వభావాలను ఆధారం చేసుకుని ముందుకు పోవచ్చు'' అని చెప్పారు జయధీర్‌ తిరుమలరావు. అస్తిత్వ సాహిత్యం స్వభావం ఏమిటని ప్రశ్నిస్తే- ''సమాజం అన్ని రంగాల్లోనూ విపరీతమైన అంగలతో స్వభావంతో మార్పు చెందుతున్న ఈ దశలో ఐదేళ్లలోనే యాభై ఏళ్ల మార్పు సంభావిస్తోంది. ఇది కాలం యొక్క వేగం, సమాజం పాతబడడం అనే అంశాలను దృష్టిలోకి పెట్టుకుని చూడాలి. అందువల్ల గత సిద్ధాంతాలు/ సాహిత్యాల మీద మాత్రమే ఆధారపడే వాళ్లు కాలానుగుణంగా మారలేకపోవడం వల్ల అత్యంత మితవాదానికి గానీ, అతివాదానికి గానీ లోనవుతారు. ఉద్యమ సాహిత్యం దీన్నే ప్రతిబింబిస్తోంది. ఉద్యమ సాహిత్యం ముందుకు సాగని సందర్భంలోనే మిగతా సాహిత్యం వ్యక్తిగత అభివ్యక్తులతో, భావనలతో, కథా వస్తువుతో, శిల్పపరంగా చెప్పుకోదగిన రీతిలో వస్తుంది. దీన్ని, ఈ సాహత్య స్వభావాన్ని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే అది ప్రజావ్యతిరేక స్వభావాన్నే కలిగి వుంటుంది'' అని చెప్పారాయన.

'తెలంగాణా రైతాంగ పోరాటం- ప్రజా సాహిత్యం' అనే అంశంపై పిహెచ్‌డి పట్టా కోసం పరిశోధన చేసిన జయధీర్‌ తిరుమల రావు అంతటితో ఆగిపోలేదు. ప్రజాకళారూపాలపై డాక్యుమెంటరీ సినిమా తీశారు. సుద్దాల హనుమంతు పాటలను సేకరించి సంకలనంగా వేశారు. తెలంగాణా పోరాట పాటలను/ జానపద గేయ గాధలను సేకరించి పుస్తకాలు వేశారు. దళిత గీతాలను సంకలనంగా తెచ్చారు. బ్రిటిష్‌ పాలనాకాలంలో నిషేధానికి గురైన తెలుగు పాటలు వెలికి తీసి వాటి చరిత్రను అందించారు. ఈ సాహిత్య సేకరణ గురించి అడిగినప్పుడు ఆయన సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. ''ఈ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మహత్తర ఉద్యమాల్లో తెలంగాణా రైతాంగ పోరాటం ఒక్కటి. అది ఈ నేల మీద జరగడం, ఈ కళాసాహిత్యాలకు మనం వారసులం కావడం గర్వించదగిన విషయం. కానీ విచిత్రమేమిటంటే- ఆ తర్వాత జరుగుతున్న పోరాటాలు సైద్ధాంతికంగా అబివృద్ధి చెందినా ప్రజా రాశుల నిరంతర సమీకరణలో, భాగస్వాములను చేయడంలో శ్రద్ధ చూపలేకపోతున్నాయి. అందువల్ల ఆనాటి ప్రజా సాహిత్యం లాంటిది ఈనాడు అధిక పాళ్లలో రాలేకపోతోంది. గద్దర్‌, వంగపండు లాంటి వాళ్ల రాశి కలిగిన సాహిత్యాన్ని ముందస్తుగా చెప్పుకోవాల్సిందే.అయితే, ఈ సాహిత్యం ప్రజా సాహిత్య వారసత్వంగా వుందా అనేది ఆలోచించాల్సే వుంటుంది. అంత మహత్తరంగా వచ్చిన సజీవ సాహిత్యాన్ని పండితులు, పరిశోధకులు ఎక్కువగా పట్టించుకోలేదు. లిఖిత సాహిత్య గౌరవం దృష్ట్యా మాత్రమే కొద్ది పాటి సాహిత్యాన్ని కథ, నవలలాంటి ప్రక్రియలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. నిజంగా అనామకులుగా, ఆజ్ఞాతంగా వున్న ఎంతో మంది కవులు, కళాకారులు పోరాటం కోసమే సృష్టించిన ఎంతో గొప్ప సాహిత్యం వుంది. ఆనాడు పోరాటం నడిపిన నాయకత్వం, ఆ తర్వాత 30, 40 ఏళ్ల తర్వాత కూడా వెలికి తీసి ప్రజలను గౌరవించలేకపోయింది. ఆ పోరాటాన్ని వారసత్వంగా భావిస్తున్న స్థానిక/ ప్రాంతేతర నాయకత్వం ఆధిపత్యం వహించడం వల్ల దాన్ని గుర్తించలేదు. అందువల్ల ఈ అసమానతకు తావు ఏర్పడింది. ప్రజల ఆసమాన త్యాగాలకు వలెనే వారి సాహిత్యం కూడా గౌరవం, ప్రాధాన్యం పొందలేదు. ఆ తర్వాత వచ్చిన పోరాటాల దృక్పథం లోంచి ఈ సాహిత్య అనుశీలన కొంత జరిగింది. కాదనలేం. కానీ ఈనాటి వరకు ఆ సజీవ సాహిత్య సంస్కృతులను, మూలాలను ఇంకా మనం సేకరించుకోలేదు. ఆ రకంగా ఒక గొప్ప సాహిత్య చరిత్ర రాసుకోవాల్సిన ఆవశ్యకతపై స్పోరాడిక్‌గా మాత్రమే కృషి జరిగింది'' అని వివరించారు. తెలంగాణా రైతాంగ పోరాట సాహిత్య సేకరణ సందర్భంలోని తన అనుభూతులను, అనుభవాలను వివరించాల్సిందిగా అడిగినప్పుడు ఆయన గతంలోకి వెళ్లారు. ''రైతాంగ పోరాటంలో వచ్చిన గేయ సాహిత్యంలో, కళారూపాలలో దాగిన సుదీర్ఘ గేయకథలు, ప్రదర్శనలు రికార్డు కాకపోవడాన్ని గమనించి సంచి భుజాన వేసుకుని బయలుదేరక తప్పలేదు. కృష్ణానదికి ఆవల, ఈవల గల మొత్తం దక్కన్‌ పీఠభూమి నాలుగు చెరగులా ప్రతిధ్వనించే పాటలను వింటుంటే సాధారణ సాహిత్యకారులకు, పండితులకు ఒళ్లు జలదరిస్తుంది. ప్రజలతో మమేకమై కొన్ని రాత్రులన్నీ వాళ్లతో గడిపినప్పుడు మాత్రమే వాళ్లు మళ్లీ నాలుగు దశాబ్దాల తర్వాత గొంతులు విప్పారు. అన్నేళ్లుగా కండరాల్లో దాగిన తూటాలే కాదు, హృదయాలలో దాగిన ఆవేదనంతా బయటకొచ్చాక గేయాలు బయట పడేవి. ప్రతి గేయానికీ ఉన్న సుదీర్ఘ చరిత్ర ప్రజా ఉద్యమాల కాలనాళిక. నిజానికి ఈ పాటల్లో వాటి వెనుక గాధలు, ఆ గాధల్లో దాగిన త్యాగాలు- ఈ దృక్పథంలోంచి సాహిత్యాన్ని చూస్తే ఉద్యమ సాహిత్యం ఎంత గొప్పదో అర్థం అవుతుంది. ఉయ్యాల బల్ల మీద రాసే ఉద్యమ సాహిత్యానికి చెలకల్లో రక్తమోడ్చి అడుగులు వేస్తూ పాడే నుడుగులకి గల తేడాని మనమింకా విడమర్చి చెప్పలేకపోయినందుకు సిగ్గిల్లవలసిందే'' అని చెప్పారు జయధీర్‌ తిరుమల రావు.

''అజ్ఞాతంగా వున్న పోరాట సాహిత్యాన్ని పూర్తిగా సేకరించలేకపోయినందుకు మీరు బాధపడుతున్నారా?'' అని ప్రశ్నిస్తే- ''మన సాహిత్య విమర్శ, చరిత్ర- రెండూ అసంపూర్ణాలే. అయితే ఈ లోటును భర్తీ చేయవలసిన సమయం, సౌలభ్యం, సాహిత్య అధ్యయన విధానాలు రాజకీయ నాయకులకు లేవు. రాజకీయ సంస్థలకు వుండే హంగులు, నిర్మాణం, వ్యక్తులకు లేవు. ఆ రెండు కలగలిసే ఒక పేగు సంబంధం తెలుగు నేల మీద మొదటి నుంచీ అభివృద్ధి కాకపోడం శోచనీయం'' అంటూ ''అప్పుడు 30 ఏళ్ల కింద ప్రారంభమైన క్షేత్ర పర్యటన ప్రాథమిక అంచులు దాటి లోతుకు పోనందుకు బాధేస్తూ వుంటుంది. కొన్ని వేల కళా రూపాలు తమని స్పృశించడానికి అర్రులు చాస్తుంటే ఏమీ చేయలేనితనం పట్టి పీడిస్తూనే వుంది. వందలాది సాంస్కృతిక ఉపకులాలు సజీవంగా వున్న ఈ నేల మీద వాటి గురించి మాట్లాడుకోవడానికి, చర్చించడానికి శక్తులూ వ్యక్తులూ సంస్థలూ లేనందుకు మనం విచారించాల్సిందే'' అని తన బాధను వ్యక్తం చేశారు.

జానపద కళారూపాలపై సేకరణపై దృష్టి పెట్టిన జయధీర్‌ తిరుమలరావుపై ఓ ప్రశ్న సంధిస్తున్నారు. యథాదథంగా జానపద కళారూపాలను సేకరించి, కాపాడ్డం వల్ల ఒరిగేదేమీ లేదనేది ఆ విమర్శ. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తే- ''లోగడ మనం అనుకున్నట్లుగానే ఏ సాహిత్యమూ కళా దానికదే సామాజిక మార్పునకి ఉపయోగ పడదు. జానపద కళారూపాలూ అంతే. అయితే, ప్రజా ఉద్యమాల్లో జానపద కళలు, సంస్కృతి తప్ప మరొకటి ప్రచారానికి ఉపయోగపడవు. కొత్త కళలను సృష్టిస్తామని అనుకోవడం భ్రమ. అలా సృష్టించిన కళలు లేవు. నాజర్‌ గానీ, గద్దర్‌ గానీ ప్రజలలోంచి రెండు శాతం మాత్రమే తీసుకుని రూపకల్పన చేసిన కళలు విపరీతమైన ఆదరణ పొందాయి. వీళ్లు కేవలం దరుపు, భాష మాత్రమే తీసుకుని ఇంత సృష్టించారు కదా, జానపద కళల్లో దాగిన వేయి రెట్ల శక్తి టన్నుల కొద్దీ భాష, నుడికారాలు, భౌతిక వాద భావనలు, వాటిలో దాగిన స్వయం సిద్ధ పోరాట ధోరణి తీసుకుని ఉపయోగిస్తే లాంఛర్లెందుకు? మందుపాతరలు సెకండరీయే'' అని ఆయన అన్నారు.

ప్రజాసాహిత్య కళాకారులు తమ పోరాట లక్ష్యాన్ని బోధించడానికి జానపద కళారూపాలను చెడగొడుతున్నారనే విమర్శపై మీరేమంటారని అడిగితే- ''సినిమా తదితర మీడియాలో ఈ కళారూపాలను వాడుకుని చౌకబారు వినోదాన్ని ప్రజల మీద రుద్దుతున్నారు. అది ఒక రకంగా ప్రజలను అవమానించడమే. ప్రజల కళారూపాలను తీసుకుని రాజకీయ ప్రచారానికి ఉపయోగించడం అప్పుడప్పుడు వివాదస్పదమవుతున్నది. ఉదాహరణకు- ఒగ్గు కథ రూపాన్ని తక్కువ పరిమితిలో తీసుకుని దాన్ని మార్చి ప్రచారం చేయడం వల్ల ఒరిజినల్‌ ఒగ్గు కథ ఇలాగే వుంటుందా అనే భ్రమ కలుగుతున్నదని ఆయా కులాలవారు అనుకోవడం తప్పేమీ కాదు. అయితే ఇలాంటి సందర్భంలో పాత కళారూపం పేరును ఆ రాజకీయ కళారూపానికి పెట్టకపోతే ఏ పేచీ రాదు'' అని జయధీర్‌ తిరుమల రావు అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X