• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పార్ట్-17

By Staff
|

మల్‌రెడ్డిని చనిపోయాడని సమాచారం అందుకున్న రాంరెడ్డి హుటాహుటిన ఊరికి బయలుదేరి వెళ్లాడు. సొంత ఊరిలో తన భూమంతా అప్పులకు ఊడ్చిపెట్టుకుపోయింది. దీంతో సొంత ఊరును వదిలేసి పక్కనే ఉన్న అత్తగారి వూరిలో వేరే ఇల్లు తీసుకుని భార్యతో కాపురం పెట్టాడు మల్‌రెడ్డి. ముక్కుపచ్చలారని కొడుకు. అక్కడుండి మాత్రం ఏం చేస్తాడు? ఏం చేయలేడు.

అప్పుడప్పుడు హైదరాబాద్‌ వెళ్లి కూలో నాలో చేసేవాడు. దాంతో విసిగి వేసారి తిరిగి ఊరికి వచ్చేవాడు. సంపాదించింది లేదు. పొట్ట గడవడం, కుటుంబాన్ని పోషించడమే తలకు మించిన భారమైంది మల్‌రెడ్డికి. ఈ స్థితిలో నక్సలైట్లతో పరిచయమైంది. అలా అలా లోపలికి.. లోలోపలికి వెళ్లిపోయాడు. ఏం చేశాడో, ఎన్ని హత్యలు చేశాడో తెలియదు. కానీ అదే అతన్ని కాటేసింది.

ఇంటికి అర్థరాత్రి అపరాత్రి అనకుండా పోలీసులు వచ్చేవారు. భార్యను, పిల్లాడిని బెదిరించేవారు. బయటకు వచ్చాడో, లోపలున్నాడో తెలియని స్థితి. ఎటు వైపున్నాడో సందేహం. దీంతో ఇటు పోలీసుల నుంచి, అటు నక్సలైట్ల నుంచి సతాయింపులు, బెదిరింపులు ప్రారంభమయ్యాయి. ఇదో అంతులేని నిరంతర యాతనా ప్రవాహంలా అనిపించింది మల్రెడ్డికి. ఏదో ఒక ఆవేశంలో తీసుకున్న నిర్ణయం, ఆ నిర్ణయం తర్వాత పెంచుకోలేని సైద్ధాంతిక అవగాహన, ఆ అవగాహనా బలం లేమితో ఆశయానికి కట్టుబడలేని చిత్తం. ఎంత మంది ఇలా- బాధా సర్పదష్టులు, దగాపడిన తమ్ములు-

ఒకానొక అర్థరాత్రి కలత నిద్రలో తలుపు బాదుతున్న చప్పుడు. మెల్లగా లుంగీని నడుం చుట్టూ బిగించుకుంటూ వచ్చి తలుపు తీసిన మల్‌రెడ్డికి ఎదురుగా సాయుధులు- తనకు పరిచయం ఉన్నవాళ్లే.

''రండ్రన్నా'' లోపలికి ఆహ్వానం.

''నువ్వే బయటకు రా!'' మృదువుగానే పలుకుతున్నట్లున్నా ఆ గొంతులో ఆదేశం.

ఈ చప్పుడుకు లేచి వచ్చిన మల్‌రెడ్డి భార్య, కొడుకు.

మల్‌రెడ్డి భార్య శకుంతల పొద్దుటి నుంచీ పోరుతూనే ఉంది- ''పట్నం పోవయ్యా, నాకేందో మంచిగ లేదు'' అని.

ఎప్పటి లాగే మల్‌రెడ్డి నిర్లక్ష్యం. వాళ్లను చూడగానే ఏదో కీడు శంకించాడు. భార్య చెప్పినమాట వినాల్సి వుండిందనుకున్నాడు మల్‌రెడ్డి. భయమంటే ఎరుగని మల్‌రెడ్డి కాళ్లల్లో వణుకు. భార్య వైపు చూశాడు- కత్తి వేటుకు నెత్తురు చుక్క లేని భార్య మొహం. ఒకతను రెక్క పట్టుకున్నాడు.

కాస్తా ధైర్యం తెచ్చుకుని- ''ఇక్కడే మాట్లాడండన్నా'' అంది మల్‌రెడ్డి భార్య.

''వెంటనే పంపిస్తాం'' అని చెప్పాడొకతను.

వారి వెంట నడిచాడు మల్‌రెడ్డి. ఆమె తలుపులు వేసుకోలేదు. అలాగే కూలబడిపోయింది.

ఆ అమావాస్య చీకటిలో నాలుగు సార్లు తుపాకి పేలుళ్లు. ఆమె కడుపులో ఏదో దేవినట్లయింది. ఒళ్లు ఒళ్లంతా చెమటలు పట్టింది. కొడుకును తీసుకొని ఆ చీకటిలో శబ్దం వినిపించి వైపు పరుగులు తీసింది. వెళ్లి చూసేసరికి రక్తం మడుగులో పడి విలవిలా తన్నుకుంటున్నాడు మల్‌రెడ్డి. ఆమె గుండె కన్నీటి చెరువయింది. ఆమె కళ్లల్లో ఆ చెరువు ఇంకిపోయి బొట్టు రాలిపాడితే ఒట్టు.

పోలీసు ఇన్‌ఫార్మర్‌గా మారినందుకు మల్‌రెడ్డిని హతమార్చామంటూ నక్సలైట్ల ప్రకటన.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X