• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సాహిత్యంలో తెలంగాణ గాలి

By Staff
|

తెలంగాణ సాహిత్యానికి గిరాకీ పెరిగింది. తెలంగాణ పేరు మీద పుస్తకాలేం వచ్చినా హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. దీంతో బుక్‌ షాపుల వాళ్లు తెలంగాణ పుస్తకమేది వచ్చిన ఆనందంగా అందుకుంటున్నారు. కె. చంద్రశేఖర్‌ రావు తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన తర్వాత ఈ ధోరణి పెరిగింది. సమావేశాల వద్ద తెలంగాణ పుస్తకాలు పెడితే చాలు, వందల సంఖ్యలో అమ్ముడవుతున్నాయి.

ఇన్నయ్య ఎప్పుడో మూడేళ్ల క్రితం 'దగా పడిన తెలంగాణ' అనే పుస్తకం తెచ్చారు. ఇందులో తెలంగాణకు వివిధ రంగాల్లో జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ వ్యాసాలున్నాయి. ఆ పుస్తకం మొదటి ముద్రణ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం జలదృశ్యంలో పెడితే ఒక్క కాపీ లేకుండా అమ్ముడైందట. అది ఇప్పుడు రెండవ ముద్రణ వచ్చింది.

ఇటీవల తెలంగాణ జర్నలిస్టుల ఫోరం తెలంగాణ జర్నలిజంపై ఒక పుస్తకం తెచ్చారు. ఇందులో వివిధ జర్నలిస్టుల చేత వ్యాసాలు రాయించి అచ్చేశారు. అది కళ్లెదుటే అమ్ముడైపోయింది. బుక్‌షాపుల దాకా కూడా వెళ్లలేదు. మీటింగ్‌ల వద్ద, జర్నలిస్టుల ఫోరం నిర్వాహకుల చేతుల మీద మొత్తం కాపీలు అమ్ముడయిపోయాయి. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి రాసిన సుదీర్ఘ కవిత 'దాలి' వెలువడింది. ఈ పుస్తకాన్ని కూడా బుక్‌షాపు వాళ్లు ఇష్టంగా తీసుకుంటున్నారు.

పుస్తకాలకు గిరాకీ వున్నట్లే తెలంగాణ సాహిత్యం కూడా విరివిగానే వెలువడుతోంది. సాహిత్య రంగంలో ఇది తెలంగాణ కాలం. వ్యాసాలు, కథలు, కవితలు తెలంగాణ దృక్పథంతో విరివిగా వస్తున్నాయి. ఒక్క తెలుగు దిన పత్రిక తెలంగాణ ప్రత్యేకాన్ని అనుదినం ఇస్తుంది. ఈ ప్రత్యేక శీర్షికకు వచ్చిన కవితలను చూస్తూ దిమ్మ తిరుగుతుంది. కవితలు కుప్పలు తెప్పలుగా వచ్చాయట. ఇతివృత్తంలోనే కాకుండా భాషలో కూడా మార్పు వచ్చింది. ఇంతకు ముందు అల్లం రాజయ్య వంటి రచయితలు తమ కథల్లో, నవలల్లో తెలంగాణ మాండలికాన్ని వాడారు. గతంలో శిష్టవ్యవహారికంలో రాసిన రచయితలు, కవులు కూడా తెలంగాణ భాషను, యాసను వెనక్కి వెళ్లి తెచ్చుకుని రాస్తున్నారు.

చాలా మంది తెలంగాణ రచయితలు ఇప్పుడు తెలంగాణ యాసను అలవోకగా వాడుతున్నారు. ప్రస్తుత తెలంగాణ ఉద్యమాన్ని వీరు అస్తిత్వ పోరాటంగా చూస్తున్నారు. దీంతో గత కాలపు తెలంగాణ సంస్కృతిని, చరిత్రను తవ్వి తీస్తున్నారు. కె. శ్రీనివాస్‌ లాంటి వాళ్లు ఇటువంటి పనిని ఒక ఉద్యమంగా చేస్తున్నారు. మరి కొందరు ఇప్పుడు తెలంగాణ సాహిత్యకారులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారు. ఏటేటా వాసిరెడ్డి నవీన్‌, పాపినేని శివశంకర్‌లు వేస్తున్న కథా సంకలనాల్లో తెలంగాణ కథా రచయితలకు ఇచ్చిన ప్రాతినిధ్యాన్ని బి.యస్‌. రాములు ప్రశ్నించారు. పది కథా సంకలనాల్లో తెలంగాణ కథలు రెండు పదులు కూడా దాట లేదని ఆయన ఓ వ్యాసం రాశారు. అది కూడా ఐదుగురి కథలు మాత్రమే వేశారని ఆయన చెప్పారు.

ఇంతకు ముందు తెలుగు సాహిత్యాన్ని స్త్రీ, దళిత వాదాలు ఒక కదుపు కుదిపాయి. ఇప్పుడు తెలంగాణ సాహిత్యం ఆ కుదుపు ఇస్తుందా? వేచి చూడాల్సిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X