ఒక స్వాప్నికుడి సంభాషణ

ఒక స్వాప్నికుడి సంభాషణలో ఏమున్నాయో ఎలా చెప్పడం? కాలంలో కరిగిపోతున్న మనిషిని పట్టుకోవడానికి ఒక భావుకుడూ విమర్శకుడూ కలిసి తీస్తున్న పరుగు నుంచి ఎన్ని పదచిత్రాలని ఒడిసి పట్టుకోగలం?
కలల దారులు... నిజాలు నమ్మకాలు. ... ఆశలు అద్భుతాలు... నిరసన ధిక్కారాలు... ఈ రచనల టాగ్ వర్డ్స్. వాటి చుట్టూ కట్టిన ఈ సంభాషణా సౌధంలో కావల్సినన్ని కవిత్వ పాదాలు, గొంతు చించుకోగలిగినన్ని నినాదాలు, రంఠతా పెట్టగలిగినన్ని సుభాషితాలు, కళ్లు చూడగలిగినన్ని కాంతి స్తంభాలు కనపడతాయి. అందుకే ఆగి ఆగి వెళ్లండి. వీలైనన్ని మజిలీలు చేయండి. పైనున్న నగిషీలతో పాటు కాళ్ల కింద నేలను కూడా చూస్తూ సాగండి. సన్నటి దారేదో కనిపిస్తుంది. కనిపించకపోతే కనిపించేదాకా వెతకండి. అది తప్పకుండా మిమ్మల్ని మనిషి దగ్గరకు తీసుకుని వెళుతుంది. అద మరిచిన క్షణాలలో మీరు పోగొట్టుకున్న మీ లోపలి మనిషి దగ్గరికి తీసుకెళుతుంది.
మనిషి అంతరంగానికి మించిన రణస్థలి ఏదీ లేదు ఇవాళ. అక్కడ నిలబడి ఇరుపక్షాలతోనూ మాట్లాడడమే సంభాషణకు కొత్త అర్థం. ఈ సాహసం చేసినందు వల్లే ఈ అక్షరాలు, ఆలోచనల వల్ల మనకు ఇంత మోహం.












Click it and Unblock the Notifications