• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వర్తమాన సాహిత్య ధోరణులు

By Pratap
|

N Gopi
వర్తమాన సాహిత్యమన్నప్పుడు 1980 నుండి ఇవాళటి వరకు వచ్చిన సాహిత్యాన్ని పరిశీలించవలసి వుంది. దానికి ముందు పదేళ్ల పాటు (1970 -80) విప్లవ సాహిత్య ప్రాబల్యం కొనసాగింది. విప్లవ సాహిత్యం ఈనాడు ఒక ప్రధానమైన స్రవంతిగా లేదు. 1925 ప్రాంతాల్లో భావకవిత్వం ముమ్మరంగా ప్రచారంలోకి వచ్చింది. బ్రిటిషు ఆంధ్రాలో 1952 వరకు జనరల్‌ ఎలెక్షన్ల వరకు అభ్యుదయ కవిత్వం ఒక ఉద్యమంగా కొనసాగింది. కాని 1995 నాటి మధ్యంతర ఎన్నికల్లో కమ్యూనిస్టులు ఓడిపోయాక ఉద్యమ సాహిత్యం ఉధృతి తగ్గిపోయింది. అభ్యుదయ, దిగంబర కవిత్వోద్యమాల మధ్య అంటే 1964 - 70ల మధ్య కాలం ఒక రకమైన సంధి థ. ఈ థలో వచ్చిన సాహిత్యంలో అన్ని రకాల ప్రక్రియలూ, ధోరణులూ ఉన్నాయి. అలా ఉండటానికి చారిత్రక కారణాలున్నాయి. ఆధునిక సాహిత్య పరిణామ వికాసాలకు సంబంధించి తెలంగాణేతర తెలుగు ప్రాంతాల్లో ఒక క్రమం కనిపిస్తుంది. ఆధునిక కవిత్వం, నవ్యకవిత్వం, భావకవిత్వం, అభ్యుదయ కవిత్వం, దిగంబర, పైగంబర, విప్లవ అంటూ ఇలాగ. తెలంగాణాలో ఇటువంటి క్రమం లేదు. లేకపోవడానికి పైన చెప్పినట్టు స్పష్టమైన చారిత్రక కారణాలున్నాయి.

తెలంగాణాపై చారిత్రక భారం

బ్రిటిషు ఆంధ్రా జిల్లాల్లోని వైవిధ్యభరితమైన, విస్తృతమైన, సాంద్రతరమైన సాహిత్య క్రమాన్ని అతి తక్కువ కాలంలో అందుకోవటమనే అత్యంత భారాన్ని తెలంగాణా కవులు, రచయితలు మోయవలసి వచ్చింది. అగ్గిపెట్టెలో అలవిమాలిన సరుకును కుక్కినట్టయ్యింది. ఒక చిన్న కాలశకలం పైన చరిత్ర చాలా బరువును మోపిన సన్నివేశమది. రాచరిక వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా తెలంగాణాలో అప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ అతి తక్కువ కాలంలో పాదు చేసుకోవలసి వచ్చిన సన్నివేశమది.

అప్పటికి తెలంగాణాలో సంప్రదాయ సాహిత్య వాతావరణం వుంది. ప్రబంధ ధోరణిలో కావ్యాలు వెలువడుతున్నాయి. అచ్చ తెనుగు కావ్యాలు, శ్లేష కసరత్తులతో రచనలు పుడుతున్నాయి.

మరోవైపు ఆధునికతా వీచికలు వీస్తున్నాయి. సరిగ్గా అట్లాంటి కాలంలో దాశరథి, సి. నారాయణ రెడ్డి వంటి కవులు మహా ప్రతిభావంతంగా రూపు దిద్దుకుంటున్నారు. వీరు సంప్రదాయ పద్ధతితో పాటు ఆధునిక ధోరణులను కూడా పుణికి పుచ్చుకున్నారు. గేయ ఛందస్సులు, సాంఘిక సమస్యలు, సంఘ సంస్కరణ భావాలు, దేశభక్తి లాంటి భావనలు వగయిరా. దాశరథి, సినారె వంటి కవులు ఏకకాలంలో అనేక ధోరణులలో కవిత్వం రాయడానికి కారణం ఇదే.

తెలంగాణా ఉద్యమం దాశరథి కళ్లు తెరిచేటప్పటికే ఉంది. ఆయన 40లలో పదునైన ఉద్యమ కవిత్వం రాశాడు. అయితే ఆయన ఉద్యమ కవిత్వం కూడా పద్యాల్లోనే రాయడం గమనార్హం. ఉద్యమం తర్వాత దాశరథి ఉద్యమేతర కవిత్వం రాశాడు.

నారాయణరెడ్డి కవిగా ఆవిర్భవించేనాటికి ప్రజా ఉద్యమం లేదు. కాని ఆధునిక భావవీచికలు వీస్తున్నాయి. కాబట్టి తన కవితా ప్రారంభాల కోసం ఆయన మథనపడాల్సి వచ్చింది. అందుకే ఆయన పద్యాలూ, పద్యగంథిలమైన గేయాలు, వచన కవితా రాశాడు. మాత్రాఛందస్సుల్లో ప్రయోగాలు చేశాడు. అప్పట్లో తెలంగాణాలో గేయం రాయడం ఆధునిక లక్షణమన్న మాట.

అఖిలాంధ్ర సన్నివేశంలో కూడా ఇదొక మిశ్రమ సన్నివేశం. కోస్తాంధ్రాలో కూడా సోమసుందర్‌, తిలక్‌ వంటి కవులు పలు ధోరణుల్తో రాశారు. నెహ్రూ మార్క్‌ సోషలిజం తెర మీదికొచ్చింది. ప్రపంచ యుద్ధానంతర సన్నివేశం కనుక ప్రపంచశాంతి, అహింసా వాదాలు కవులను ఆకర్షించాయి. కాబట్టి 1964 - 70ల మధ్య కాలాన్ని ఆధునిక సాహిత్యంలో మొదటి సంధి థ లేదా సమ్మిశ్రిత థ అని పిలవవచ్చు. ఒక రకంగా ఇది కుంఫిణీ యుగంలాంటిది. 1980ల నుండి రెండో సమ్మిశ్రిత థ ఆరంభమైంది. దాని కథాకమామీషు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

అస్తిత్వ శతాబ్దాలు

80ల తర్వాత రెండున్నర శతాబ్దాలను అస్తిత్వవాద శతాబ్దాలనవచ్చు. ప్రతి వారూ తమ అస్తిత్వాలను వెతుక్కునే క్రమంలో పడ్డారు. విప్లవోద్యమంపై సందేహాలు, తత్కారణంగా విప్లవసాహిత్యం పట్ల విముఖత దీనికి దోహదపడి వుంటాయి. కొత్తగా కులాల ప్రస్తావన రావటం వల్ల విరసం ఆత్మరక్షణలో పడింది. ఈ కాలంలోని సాహిత్యకారులు ప్రధానంగా తమ సమస్యలను తామే చిత్రించి వాటి పరిష్కారానికి తామే ప్రయత్నించడం, తన కుటుంబంలో తన అస్తిత్వం, తన కాలంలో తన అస్తిత్వం, ఇతర కులాల మధ్య తన కులం అస్తిత్వం, తన ప్రాంతంలో తన అస్తిత్వం, ఇతర ప్రాంతాల మధ్య తన ప్రాంతం అస్తిత్వం - ఇలా ఆయా సందర్భాల్లో ఆయా సామాజిక శ్రేణుల్లో, సమూహాల్లో తానేమిటి అని అన్వేషించుకోవడం ఈ కాలం ప్రధాన లక్షణం. ఈ క్రమంలోనే స్త్రీవాదం, పరాయీకరణ, దళితవాదం, బిసి వాదం, తెలంగాణ ప్రాంతీయ వాదం, మైనారిటీ వాదం ఆవిర్భవించాయి.

స్త్రీవాదం

స్త్రీవాదం ముక్కోణాలుగా స్త్రీ దృక్కోణంతో స్త్రీల సమస్యలను ముందుంచింది. పితృస్వామ్య సమాజం స్త్రీకి విధించిన మూడు విధులను ప్రశ్నించింది. 1. ఇల్లాలు 2. మాతృమూర్తి 3. వేశ్య. కన్యాశుల్కంలో గిరీశం వెంకటేశంతో ''ఆడవాళ్లను భగవంతుడు ఎందుకు సృష్టించాడు?'' అని అడుగుతాడు. అందుకు వెంకటేశం టక్కున 'వంట చెయ్యటానికి' అని అంటాడు. దానికి గిరీశం 'నాన్సెన్స్‌! పెండ్లాడడమునకూ, పిల్లలను కనడమునకునూ' అంటాడు. ఈ సంభాషణలో భార్యా, పిల్లల తల్లీ, ఉమ్మడి కుటుంబంలోని చాకిరీ ఉన్నాయి. స్త్రీవాదులు స్త్రీల శరీరం - అనుభవాలు, అణచివేత, స్త్రీపురుష సంబంధాలు, స్త్రీల శ్రమదోపిడీ, లైంగిక దోపిడీ, మాతృత్వం వంటి అంశాలను బలంగా వినిపించారు. స్త్రీలు విద్యావంతులు కావటం వల్ల ఇప్పుడు పాత నమూనాలు భగ్నమవుతున్నాయి. నగరీకరణలో కొత్త తరం భార్యల అవసరం పెరుగుతున్నది. అయితే కొత్త తరంలో కూడా పాత తరం కర్తవ్యాలను నిర్వహించవలసి రావటంతో ప్రతిఘటన ప్రారంభమవుతున్నది. ముఖ్యంగా ఉద్యోగినులు పాత తరం కర్తవ్యాలతో ఒత్తిడికి గురవుతున్నారు. అభ్యుదయ కవిత్వంలో స్త్రీని వర్గపరంగానే అర్థం చేసుకున్నారు. శ్రీశ్రీ వర్ణించిన బికక్షువర్షీయసి గానీ, సమ్మె కట్టిన కూలీల భార్యాబిడ్డలు గానీ, శివసాగర్‌ 'చెల్లీ చంద్రమ్మ' గానీ సామాజిక వర్గ స్త్రీలే గాని మానవ స్త్రీలు కాదు. ఒక థాబ్దం పాటు కదను తొక్కిన స్త్రీవాదం విజృంభణం ఇప్పుడు కాస్త తగ్గినట్టు కనిపిస్తున్నది. స్త్రీవాదం లాంటి ఉద్యమాలు మధ్యతరగతి బలంగా వున్న ప్రాంతాల నుంచే రావడం సహజం. తెలంగాణాలో మధ్యతరగతి పూర్తిగా ఏర్పడలేదు. కాబట్టి స్త్రీవాద సాహిత్య సృష్టి అంతంత మాత్రమే.

పరాయీకరణ

ఈ రెండున్నర థాబ్దాల్లో పరాయీకరణ భావనలతో వెలువడిన సాహిత్యం రాశిలో గాని, వాసిలో గాని ఎక్కువ. ఒక రకమైన నిరాశ, మృత్యుకాంక్ష, బాల్యస్మరణ, ఏకాకితనం, నిర్లిప్తత, నగర విముఖత, అమ్మ వంటి అంశాలు ఈ కవిత్వంలో ప్రధానమైనవి. పరాయీకరణ ఒక తాత్త్విక భావన. శ్రామిక సంబంధాలు, డబ్బు, సామాజిక సంబంధాలు దీనిలోకి వస్తాయి. మానవ సంబంధాల వక్రీకరణ కూడా దీనిలోకి వస్తుంది. ఒక శ్రామికుడు తన జీవితాన్ని ఒక వస్తువులో ప్రవేశపెడతాడు. ఆ జీవితం తనకు చెందకుండా వస్తువుకే చెందుతుంది. వస్తువు యొక్క వాస్తవీకరణ (ష్ట్రలిబిజిరిరీబిశిరిళిదీ) ఎక్కువై శ్రామికుడి వాస్తవీకరణ పోతుంది. అప్పుడా ఉత్పత్తి తనకు పరాయిదవుతుంది. అతడు తన ఉనికిని కోల్పోతాడు.

అలాగే ఒక వ్యవస్థలో మనుష్యులుగా కాకుండా స్థాయీ వ్యక్తులుగా రూపొందినప్పుడు వాళ్లు పరాయితనం చెందినట్టు లెక్క. బాహ్య ప్రవర్తన మాత్రమే జీవితంగా గుర్తింపబడుతుంది. మానవీయత పోయి సామాజిక స్థాయి మిగులుతుంది.

'నువ్వెవరివి?' అని ప్రశ్నించినప్పుడు వృత్తికి సంబంధించిన జవాబు రావడం ఇటువంటిదే. కుహనా వ్యక్తిత్వం, సమూహంలో ఒంటరితనం, అర్థహీనత, అసంబద్ధత, అమానవీకరణ, మానవ దూరం, విలువల పట్ల అపనమ్మకం వంటివి పరాయీకరణలోనికి వస్తాయి.

ప్రాచీన కవిత్వంలో శతక కవుల కీర్తనల్లో జీర కొంత వినిపిస్తుంది.

'అంతా సంశయమే, శరీర ఘటనంబంతా విచారంబే

లోనంతా దుఃఖ పరంపరార్జితమె' అన్న ధూర్జటి గొంతులో ఈ ఛాయలున్నాయి. గత తరంలో బైరాగి, అజంతా, త్రిపురల్లో బీజప్రాయంగా పరాయీకరణ వుంది. వేగుంట మోహనప్రసాద్‌లో ఈ ధోరణి ఎక్కువ. ఈ తరంలో చాలామంది కవుల్లో పరాయీకరణ ప్రతిఫలనం కనిపిస్తుంది.

దళితవాదం

ఇక దళితవాదం గురించి. దళితులంటే ఎవరు? ఒకప్పుడు అస్పృశ్యులు. అస్పృశ్యులు, సాంఘిక దోపిడికి గురవుతున్నవారు, నీచవృత్తులుగా భావించబడే వృత్తులు చేస్తున్నవారు, శారీరక శ్రమపై ఆధారపడి జీవిక వెళ్లబుచ్చేవారు దళితులని స్థూలంగా చెప్పుకోవచ్చు. జ్యోతిబాఫూలె, అంబేడ్కర్‌, మార్క్స్‌, నీగ్రో సిద్ధాంతంలోని తిరుగుబాటుదారులు వీరందరూ దళితకవిత్వానికి భూమికగా పని చేశారు. దీనికి పునాదులు స్వాతంత్య్రోద్యమంలోను, అంతకు ముందే పడ్డాయి. 'అందారు పుట్టిరి హిందమ్మ తల్లికి' అనే మాలవాండ్ర పాట 1910లోనే వచ్చింది.

'మలిన దేహుల మాలలనుచును

మలిన చిత్తులకధిక కులముల

నెలవొసంగిన వర్ణధర్మమధర్మ ధర్మంబే' అన్నాడు గురజాడ. జాషువానాటికి దళితుల ప్రతిఘటనకు ఒక పూర్ణాకృతి ఏర్పడింది. జాషువాలో ఆర్ద్రత, కోపం ఉన్నాయి. ద్వేషం లేదు.

ఇక ఇప్పటి దళిత సాహిత్యం పోరాటశీలంగా ఎదిగింది. తమ ఉద్యమానికి ఒక ప్రత్యేక అస్తిత్వాన్ని వీరు కోరుతున్నారు. దళిత జీవితాలను గురించి దళితులే రాయాలనే వాదం ఉద్భవించింది. దళిత ఉద్యమాన్ని విప్లవం నుండి వేరు చెయ్యాలనే ప్రయత్నం వుంది. దళిత సాహిత్యం శిష్ట సాహిత్యంలోని అనేక అంశాల అడుగులను ఊడగొట్టింది. పలు అగ్రవర్ణ భావనలు ఆత్మరక్షణలో పడ్డాయి. దళిత సాహిత్యం అగ్రవర్ణ వ్యతిరేకతను దాచుకోలేదు. కొండొకచో ద్వేషభావాలను విసిరిన సందర్భాలున్నాయి. థాబ్దం పాటు ఉధృతంగా వెల్లువెత్తిన దళిత సాహిత్యం మాల, మాదిగల పోరాటం వల్ల కొత్త ఆవరణలోకి ప్రవేశించింది. అయితే దళితవాదం ఇతర కులాలకు మానసికంగా దూరం కానంతవరకు, ఆయా కులాల్లోని మానవీయమతుల అండను కోల్పోనంత వరకు సాగుతూనే వుంటుంది. దళిత కులాల సమరం కుల నిర్మూలనకే దారి తీయాలి గాని, కులాల మధ్య వైరుధ్యం మరింత పెరగడానికి కాదు.

మైనారిటీ వాదం

ఈ దేశంలో ముస్లిం 'పుట్టుమచ్చ'లాంటివాడు అనే ఆవేదనతో మొదలైంది మైనారిటీ వాదం. అందరూ ఉలిక్కిపడ్డారు నిజంగా భారతదేశంలో ఈ వివక్ష ఉందా అని. అయితే ఇది రామజన్మభూమి ఉద్యమ నేపథ్యంలో పుట్టినట్టు కనిపిస్తుంది. బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత ముస్లింలలో భావోద్రేకాలు రేగినట్లు కనిపిస్తుంది. భారతదేశంలో అత్యధిక శాతం ముస్లింలు దళిత కులాలకు చెందినవారు. వారు మతానికిచ్చే ప్రాధాన్యం కన్నా తామూ ఈ దేశంలో పౌరులమే అన్న స్పృహను తెరపైకి తెచ్చారు. ఈ వాదం వారు అంతర్గతంగా మత సంస్కరణలను కోరుతున్నారు. ముస్లిం వాదంతో పాటు ఇటీవల ఇస్లాం వాదం అని ఒకటి తలెత్తింది. చర్చలు జరుగుతున్నాయి. దీనికి మతసూత్రాలే ప్రాతిపదిక. అంతర్జాతీయ సన్నివేశంలో దీని ప్రతిపాదన జరుగుతున్నది. ఇది కూడా ప్రధాన స్రవంతికి దూరం కానంతవరకు ఆరోగ్యంగా వుంటుంది. బహుశా హిందూ అతివాదం వల్లనే ముస్లింవాదం ఇంత ఎక్కువగా వస్తున్నదేమో ఆలోచించవలసి వుంది. పాకిస్తాన్‌తో మనకున్న రాజకీయ శత్రుత్వం నేపథ్యం కూడా ముస్లింవాదానికి ఒక ప్రతికూలాంశం. దీని కారణంగానే ముస్లింలు గట్టిగా మాట్లాడితే ఐయస్‌ఐ ముద్రపడుతున్నది. తెలంగాణావాడు గట్టిగా మాట్లాడితే నక్సలైట్‌ ముద్ర పడ్డట్టు. సంక్లిష్టమైన వాతావరణంలో మైనారిటీవాదం సరైన దిశలో పయనిస్తే ముస్లింల శ్రేయస్సుకు దారులు పడతాయి.

తెలంగాణావాదం

గత అయిదేళ్లుగా ఎన్నడూ లేనంతగా తెలంగాణా ప్రాంతం నుంచి అత్యధికంగా సాహిత్య సృష్టి జరుగుతున్నది. గత సంవత్సరం ఒక కరీంనగర్‌ జిల్లా నుంచే 50 గ్రంథాలు ప్రచురించబడ్డాయి. తెలంగాణా జిల్లాలన్నీ తెలంగాణా సోయితో అంటే స్పృహతో ఊగిపోతున్నాయి. ఆనాటి నిజాం వ్యతిరేక ఉద్యమం మొదటి పునరుజ్జీవన థ కాగా ఇవాళటి సోయి రెండో పునరుజ్జీవన థ. కవిత్వంతోపాటు విస్తృతంగా కథలు రావడం తెలంగాణాలో క్రమంగా మధ్యతరగతి వర్గం వేళ్లూనుకుంటున్న తరుణాన్ని తెలియజేస్తుంది. ఇవాళటి తెలంగాణా వాదం ఇతర ప్రాంతాల సామాన్య ప్రజలకు వ్యతిరేకమైంది కాదు. 1969 నాటి ఉద్యమానికి దీనికీ చాలా తేడా వుంది. రాజకీయ ప్రతిపత్తి కోసం జరిగే పోరాటాల్లో తెలంగాణా సమగ్ర స్వరూపాన్ని గురించి చర్చలు జరుగుతున్నాయి. ఇది అన్ని ప్రాంతాలకూ ఇది శుభపరిణామమే.

ప్రపంచీకరణ సందర్భం

విప్లవోద్యమానికి భూస్వామి శత్రువుగా వుండేవాడు. ఎదురెదురు పోరాటం ఉండేది. ఇప్పుడు శత్రువు కనిపించడు. ప్రపంచీకరణే శత్రువు. ప్రపంచవ్యాప్తంగా దేశీయ ఉద్యమాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి.

విలువలు ఎన్నడూ లేనంత వేగంగా మారిపోతున్నాయి. విద్యల ప్రాథమ్యాలు మారిపోతున్నాయి. ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తెచ్చే పాలకులు ప్రజలను 'మైండ్‌ సెట్‌' మార్చుకొమ్మంటున్నారు. ప్రపంచీకరణ వల్ల ధనవంతుడు మరింత ధనవంతుడైతే పేదవాడు మరింత పేదవాడవుతాడు. ఈ ప్రక్రియకు మానవకోణాన్ని ప్రసాదించేవాడు కరువయ్యాడు. వాణిజ్య దేశాల సంగతి అటుంచితే అభివృద్ధి చెందుతున్న మనలాంటి దేశాలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. ఇప్పుడిప్పుడే కోట్లాది మంది విద్యార్థులు విద్యలోకి వస్తున్న సన్నివేశంలో మనమున్నాం.

ఇప్పుడు ఎక్కువ మంది సాహిత్యకారులు ప్రపంచీకరణ దుష్ఫలితాలను ఎండగడుతున్నారు. రైతుల చేనేత కార్మికుల ఆత్మహత్యలను ఈ నేపథ్యంలో వర్ణిస్తున్నారు. ఈనాడు ప్రపంచీకరణను సమర్థించడమా వ్యతిరేకించడమా అనేది సాహితీ స్రష్టలకు ఎదురౌతున్న ప్రశ్న.

బి.సి.వాదం

మొన్నటి వరకు ఎస్‌.సి., ఎస్‌.టి., బి.సి., మైనార్టీలు రాసింది దళిత కవిత్వంగా భావించడం విశాల ప్రాతిపదికన జరిగింది. కాని వీరిలో ఒక్కొక్కరికి ఉన్న సమస్యలు భిన్నంగా ఉన్నాయని అనుభవంతో తెలుసుకున్నారు. ఎస్‌.సి.ల సమస్యలను తమగొంతుల్లో కూడా పలికించిన బి.సీ.లు తమకు కూడా సమస్యలున్నాయని గుర్తించి తమ సమస్యలను తామే గానం చెయ్యాలని భావిస్తున్నారు. దీనిపై సతీష్‌ చందర్‌ ఆలోచనాత్మకమైన చర్చను లేవనెత్తాడు. బి.సి.లు ఆకలితో చనిపోతే ఎస్‌.సి.లు అవమానాలతో చనిపోయారని చెప్తూ తమ అనుభవాల్ని రాయవలసిన బి.సి.కవులు ఎస్‌.సి.ల అనుభవాల్ని రాసి, తమ అనుభవాల్ని దాచి పెట్టారని అన్నాడు. అభ్యుదయ కవిత్వంలో బి.సి. వృత్తుల ప్రసక్తి ఉంది. కాని అది వర్గ దృక్పథంతో సాగింది. శ్రీశ్రీ కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరిపగ్గం, శరీర కష్టం స్ఫురింపచేసే గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి, సహస్రవృత్తుల సమస్త చిహ్నాలు తను వినిపించే నవీనగీతికి భావం, భాగ్యం, ప్రాణం, ప్రణవంగా చెప్పుకున్నాడు. ఎస్‌.సి. కవులలాగ బి.సి.కవులు కూడా తమ పేర్లను అన్వేషించుకుంటూ తమ నేపథ్యాలను కవిత్వీకరిస్తున్నారు. జూలూరి గౌరీశంకర్‌ సంపాదకత్వంలో 'వెంటాడే కలాలు' పేరుతో వెనుకబడిన కులాల ఇరవై మూడు మంది కవుల గళాలతో ఓ సంకలనం వచ్చింది. కొంపెల్లి వెంకట్‌ అనే కవి -

రకం కట్టేది మేమైతే

చెట్టు మీది జులుంవాడిది

కల్లు గీసేది మేమైతే

ముంత మీద ధర ముద్రించేదివాడు

పైగా ఆబ్కారోడి నిఘా!

మరోకవి సీతారాం

మేమెవరం

చాకళ్లం మంగళ్లం

చౌడుసున్నాలం సన్నాసులం

గాడిద బరువులం ముట్టు మూటలం ఇస్త్రీ పెట్టెలం

ఆదరణ అంతగాలేని పౌరులం

అస్తిత్వ వేదనతో విభిన్న పార్శ్వాలను ముందుకు తెస్తూ బి.సి. కవిత్వం ముందుకు సాగుతున్నది.

ప్రగతిశీల మానవత

అస్తిత్వ ఉద్యమాలు వాంఛనీయమే అయినా విశాల ప్రాతిపదికన మానవ సమాజాన్నంతా అవి ప్రతిఫలించవు. యావత్‌ సమాజానికి వర్తించే గుణాన్ని సంతరించుకోవడం తత్కాలంగా వీటి లక్షణం కాదు. మొత్తం సమాజానికి నాయకత్వం వహించి ఉన్నతమైన సమాజానికి అవసరమైన సైద్ధాంతిక ప్రాతిపదికను అందించడంలో ఇవి సఫలం కావు. అయితే సమాజంలో తమ ముద్రను స్థాపించడంలో, అందరి దృష్టిని ఆకర్షించడంలో మాత్రం ఇవి విజయవంతమవుతాయి. ఏడ్చే పిల్లవాడిని అమ్మ అక్కున చేర్చుకున్నట్టు వీటి ప్రయోజనాన్ని తక్కువగా అంచనా వేయలేం. ప్రభుత్వ పాలనలోని పాలసీని ప్రభావితం చేసే శక్తి వీటికి ఉంది. మరీ ముఖ్యంగా తమ అస్తిత్వం తాలూకు సంవేదనను, ఆర్తినీ బాధానుభూతితో, ధర్మాగ్రహంతో చెప్పడం వల్ల ఇవి అన్ని వర్గాల హృదయాలను తట్టే వీలుంది. అందుకే అన్ని నదులూ సముద్రంలోకే దారి తీసినట్టు వీటి సారాంశమంతా ప్రగతిశీలమైన మానవతా వాదంలో లీనం కాక తప్పదు. సమాజం సంక్లిష్టమైనది. అది దారపు కండెలాంటిది. కండెలో ఏ ఒక్క పోగును లాగినా మరో చోట బిగుసుకుంటుంది. దాన్ని రాట్నానికి చుట్టి పొట్టెగా మార్చితేనే అది వస్త్రంగా రూపుదిద్దుకుంటుంది. ఈనాటి పరిస్థితులకూ ఇది వర్తిస్తుంది.

ఈ శతాబ్ది చిన్న కవితారూపాలు

మినీ కవిత

80ల్లో మినీకవిత పత్రికల్లో స్థలాభావ కారణంగా ఆవిర్భవించింది. క్రమంగా కొన్ని లక్షణాలను సంతరించుకొని ప్రధానంగా కొసమెరుపును ధరించింది. అక్కడక్కడ కొన్ని గొప్ప కవితలు వచ్చాయి. అలిశెట్టి ప్రభాకర్‌ ఉత్తమ మినీలు రాశాడు. జె.పి. గురించి కాళోజీ కవిత నోళ్లకెక్కింది. అలాగే చంద్రసేన్‌ కవిత. కేవలం సైజు క్రైటీరియా కావటం వల్ల నాలుగేళ్ల పాటు వీరవిహారం చేసిన మినీ కవిత క్రమంగా కనుమరుగయ్యింది. దానిని పునరుద్ధరించడానికి మళ్లీ ప్రయత్నాలు జరుగుతున్నాయి.

హైకూ

జపనీస్‌ భాషలో హైకూ 600 ఏళ్లుగా వున్న గొప్ప ప్రక్రియ. జెన్‌ బౌద్ధం దాని తాత్వికత. ఆ భాషలో 3 పాదాలతో 17 అక్షరాలతో రూపొందిన కవితారూపం హైకూ. దీనిని మొదట గాలి నాసరరెడ్డి తెలుగులోకి తెచ్చాడు. లక్షణాలు పాటించి హైకూలు రాశాడు. తర్వాత చాలామంది హైకూలు రాశారు. అయితే వారిలో ఎక్కువ మంది లక్షణాలు పాటించకుండా హైకూలు రాశారు సీనియర్‌ కవి ఇస్మాయిల్‌ గారితో సహా. నిజానికి 17 అక్షరాల్లో తెలుగులో ఒక భావాన్ని కుదించడం కష్టం. కుదించినా అది స్టిల్‌ ఫొటోగ్రఫీగా రూపొందుతుంది గాని కదలదు. జపనీస్‌ అక్షరాల స్వభావం వేరు. ఇప్పుడు హైకూల ఉధృతి తగ్గింది. ఒక హైకూ పేరుకు ఉన్న ఆకర్షణతో కలకాలం నెట్టుకు రావడం కుదరదు. మూడు పాదాలు తెలుగు సంప్రదాయం కాదు. రెండు లేక నాలుగు పాదాలు తెలుగు సంప్రదాయం.

నానీలు

వర్తమాన కవిత్వంలో 'నానీలు' ప్రవేశించి థాబ్ద కాలం కావొస్తున్నది. 1997లో గోపి వీటిని ప్రారంభించాడు. వందలాది మంది వీటిని అనుసరించి నానీలు రాశారు. రాస్తున్నారు. ఇప్పటికే 70 నానీ గ్రంథాలు వెలువడ్డాయి. కొద్ది రోజుల్లో నూటిని దాటినా ఆశ్చర్యం లేదు. నానీలు థమ వార్షికోత్సవం వైపు ఉరకలు వేస్తున్నాయి. గురజాడ 'ముత్యాలసరం' తర్వాత నిలబడిన కవితా రూప ప్రక్రియ నానీ.

ఇంతకు నానీలు అంటే ఏమిటి? నానీలు అంటే చిన్న పిల్లలు. చమత్కారంగా 'నావీ, నీవీ - వెరసి మనవి అంటే అందరివి అని చెప్పుకోవచ్చు. నానీకి లక్షణాలున్నాయి. నాలుగు పాదాలుంటాయి. పాదపాదానికి దైర్ఘ్య నియమం లేదు. వారి వారి మనస్సుల్లో అనుకుంటూ రాసే సమయంలో పాద విభజన జరుగుతుంది. నాలుగు పాదాల్లో మొత్తం అక్షర సంఖ్య 20 - 25ల మధ్య వుంటుంది. అంటే 20 అక్షరాలకు తగ్గరాదు. 25కు మించరాదు. అంటే ఐదక్షరాల వెసులుబాటు వుంటుంది. వెసులుబాటు వల్ల భావం బలి కాకుండా వుండే అవకాశముంది. నానీల్లో ముఖ్యమైన లక్షణమేమిటంటే నిర్మాణం. నాలుగు పాదాల్లో మొదటి రెండు పాదాలు ఒక యూనిట్‌, తర్వాతి రెండు పాదాలు రెండో యూనిట్‌. మొదటి యూనిట్‌లో ఒక భావాంశం ప్రతిపాదితమవుతుంది. రెండో యూనిట్‌లోని భావాంశం దానికి పూరకంగానో, కొనసాగింపుగానో, వ్యాఖ్యానంగానో మరేదో దానిగానో ఉంటుంది. అలా ఉండటంలో ఒక చరుపు (ఆతిదీబీనీ) ఉన్నప్పుడే ఆ నానీ 'ఆహా' అనిపిస్తుంది. ఆ చరుపు ఆ కవి కవితాశక్తి మీద ఆధారపడి వుంటుంది. నానీ అందమంతా నిర్మాణంపైనే ఆధారపడి వుంది. బహుశా నానీల్లోని అంతర్గత నిర్మితికి వేమన ఆటవెలది స్ఫూర్తి కావొచ్చునని గోపి భావన. కాలంతో దీనికి శ్రుతి కలిసినట్టుంది.

ఎంతో మంది కొత్త కవులు నానీల సింహద్వారం గుండా కవిత్వంలోకి ప్రవేశిస్తున్నారు. ఇదో శుభపరిణామం. మన పిల్లలు తెలుగుకు దూరమవుతున్న సన్నివేశంలో ఉన్నాం. నానీలు తెలుగుతో కొంతయినా లంకె తెగకుండా కాపాడతాయని నా ఆశ. మరో థాబ్దం దాకా నానీల బుడి బుడి అడుగులు పడుతూనే వుంటాయని ఆకాంక్ష.

వేయి పూవులు వికసించనీ అన్నట్లుగా అన్ని అస్తిత్వ వాదాలూ ముందుకు సాగాల్సిందే. భిన్నత్వాలను కాపాడుకుంటూనే ఏకత్వాన్ని సాధించే లక్ష్యం వాటికి ఉండాలి. సహజీవనం, మానవత్వం, అందరికీ సమానావకాశాల ప్రాతిపదికన నూతన సమాజ నిర్మాణం జరగాలి. దీనికి అన్ని సాహిత్య వాదాలూ దోహదపడతాయనే ఆశ నాకు ఉంది.

(ఆ మధ్య ఓ సాహిత్య సదస్సులో చేసిన కీలక ప్రసంగం పూర్తి పూఠం)

- డాక్టర్ ఎన్ గోపి

English summary
Dr N Gopi, former vice chancellor of Telugu university, reviewed the contemparory literary trends in Telugu. He presents key note address in a seminar on this subject.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X