వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గద్దర్: ఈ పూవు పేరేందో..

By Pratap
|
Google Oneindia TeluguNews

కాలం పురుడు పోసుకుని కన్న బిడ్డ గద్దర్‌. కాలం తనకు కావాల్సిన యోధులను వెతుక్కుంటుందనేది కూడా గద్దర్‌ విషయంలో స్పష్టమవుతుంది. గుండె గుండెకూ పాకిన గద్దర్‌ పాట ఉత్తుంగ తరంగాల సంకక్షుభిన సాగరం. విఠల్‌ రావు అనే అ మాల కుర్రాడిని పాటల అస్త్రాలను నేరుగా జనం హృదయాల్లో నాటే యోధుడిగా తయారు చేసింది కాలమే.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఓ కార్యక్రమానికి వచ్చిన గద్దర్‌ అంతరంగాల్లో అలజడి సృష్టించాడు. భయంతో కూడిన ఉద్రేకాన్ని రెచ్చగొట్టిన అప్పటి జ్ఞాపకాలు ఇప్పటికీ గుండెల్లో పచ్చిగా ఇంకా ఉన్నాయి. గోచీ పెట్టి, గొంగడి భుజాన వేసుకుని ఎర్రజెండా చేతబూని గద్దర్‌ పాటలు పాడుతూ నృత్యం చేస్తుంటే శివుడి విశ్వరూపంలా అనిపించేది. అది 1980 థకం ప్రారంభం. అంత నిర్భయంగా, నిక్కచ్చిగా రాజ్యం దుమ్ము దులిపిన కళాకారుడు సమకాలీనంలో ఎవరూ లేరు, ఇప్పుడైతే అసలు లేరు.
'సిరిమల్లె సెట్టు కింద లచ్చుమమ్మో
లచ్చుమమ్మా
సినబోయి కూర్చున్నవెందుకమ్మో
ఎందుకమ్మా' అని పాడుతుంటే ఊళ్లో మా అమ్మ పడుతున్న దుఃఖం, శోకం గుర్తుకు వచ్చి కళ్లు చెమ్మగిల్లేవి, గుక్క పట్టి ఏడ్వాలనిపించేది. ఆధునిక సమాజం సంకెళ్ల కారణంగా ఆ శోకాన్ని నిభాయించుకున్న సందర్భాలు అనేకం. 'పాలపిట్టలై వస్తారా' అనే పాట నా కోసం దసరా పండుగకు, సంక్రాంతి పండుగకు కంట్లో వత్తులు వేసుకుని చూసే మా అమ్మ గుర్తుకు వచ్చేది. ఇదే ఇలా వుంటే, తలకిందుల సమాజాన్ని నిటారుగా నిలబెట్టాలని అడవి దారి పట్టిన బిడ్డల కోసం వారి తల్లులు ఎంతగా అంగలార్చేవారో చెప్పడానికి మాటలు దొరుకతాయా... లేదు. గద్దర్‌ గొంతులో ఆ తల్లుల అంగలార్పు, యాతన, ఎదురుచూపులు అత్యంత ఆర్ద్రతతో పలికేవి. ఆ బిడ్డలను అడవిదారి పట్టించిన వ్యవస్థ మీద కసితో కూడిన ఆగ్రహం పెల్లుబికేది. అది ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని తొవ్వలను అరుణారుణం చేసేది. అలాంటి పాటకు పేరు ఏం పెట్టాలి. 'పువ్వుల్లో మెరిసేటి ఆ పూవు పేరేందో' అనే దేవులాటను నేను అనంతర కాలంలో సాగించాను.

Gaddar

భద్రలోక జీవితంలోకి వచ్చిన తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నేర్పిన సంస్కృతి ప్రస్తుత సామాజిక చట్రంలో మనిషిగా జీవించడానికి పాటించాల్సిన విలువలను నాలాంటి చాలా మందికే నేర్పి ఉంటుంది. అటువంటి సందర్భంలోనే ఆ పూవు పేరేందో, ఆ పూవు పుట్టుపూర్వోత్తరా లేమిటో, ఈ సమాజ వృక్షం ఎర్రటి మోదుగుపూలనే ఎందుకు పూసిందో కునుక్కుందామనే కోరిక పుట్టింది. అప్పుడే, గద్దర్‌తో ఓ రోజంతా ఉండి, మాట్లాడే అవకాశాన్ని తీసుకున్నా. గద్దర్‌ అనే కష్టజీవి తన కన్నీళ్లను సమాజంలోని కష్టజీవుల తరఫున వెలువడే సామూహిక గీతంగా, పోటెత్తే పాటగా ఎలా రూపుదిద్దాడో అర్థమైంది. ఆ కన్నీళ్ల వెనక ఉన్న సాహస గాథనే ఆసిస్టెంట్‌ ఎడిటర్‌గా సంపాదక బాధ్యతలు నిర్వహిస్తున్న నేను 'సుప్రభాతం' సామాజిక వార పత్రికలో కవర్‌ పేజీ కథనంగా అచ్చేశాను. ప్రజా కళాకారుడిని మరో వైపు చూపించడమే కాకుండా నడుస్తున్న కాలం మీద పొడిచిన పొద్దు పరిణామ థను వివరించడానికి కూడా ప్రయత్నించాను.

గద్దర్‌ పుట్టుక, శ్రామిక జీవన తాత్త్వికత కారణంగా విప్లవ సాహిత్యానికి అప్పట్లోనే 'యాలరో యీ మాదిగ బతుకులు' అనే దళితవాద చేర్పును అందించాడు. వచన కవిత్వానికి సలంద్ర కూడా ఇటువంటి చేర్పునే అందించాడు. తన పోరాటానికి తెలంగాణను కార్యరంగం చేసుకున్న శివసాగర్‌ ఆ చేర్పును ఆ సంకక్షుభిత కాలంలో తన పాటలో పలకలేకపోయాడు. గద్దర్‌ తన వ్యక్తిగత అభివ్యక్తిని, వ్యక్తిగత అనుభవాలను సామూహికం చేయడం వల్లనే అలా జరిగి వుండవచ్చు. పైగా, గద్దర్‌ పుట్టుక తెలంగాణ కావడం వల్ల కూడా అలా జరిగి వుండవచ్చు. సామాజిక అసమానతల తీవ్రత అప్పటికీ తెలంగాణలో కొనసాగుతూ ఉండడం అందుకు కారణంగా చెప్పవచ్చు. పైగా, బ్రిటిషాంధ్రలో దళితులు అప్పటికే విద్యను అంది పుచ్చుకున్నారు. తద్వారా కాస్తాకూస్తో సామాజిక గౌరవాన్ని పొందసాగారు. అందువల్ల కులానికి సంబంధించిన అసమానతల తీవ్రత శివసాగర్‌ను కదలించలేకపోయింది. తెలంగాణ ప్రాంతంలో దాని తీవ్రత కారణంగానే శివసాగర్‌ కన్నా ముందుగా గద్దర్‌ ఆ చేర్పును అందించగలిగాడు.

గద్దర్‌ వ్యక్తిగత అనుభవాలు చిన్నవేమీ కావు. కాలం గద్దర్‌ను కనడానికి పడిన పురుటి నొప్పులు చెప్పనలవి కానివే. ఇంజనీరింగ్‌ విద్యను మధ్యలోనే వదిలేయాల్సిన ఆర్థిక పరిస్థితుల్లోకి గద్దర్‌ వెళ్లిపోయాడు. పైగా, చదువు వల్ల అబ్బే డాంబికాలు కూడా ఆయన దరి చేరలేదు. చెప్పాలంటే, గద్దర్‌ తన వ్యక్తిగత జీవితంలో కత్తి విడిచి సాము చేయలేదు. సామూహిక జీవితంలో పాటను కత్తిగా చేసుకుని పోరాడాడు. తన వద్ద ఉన్న కత్తిని మరింత పదును పెట్టి సమాజానికి అందించే పని చేశాడు. అయితే, గద్దర్‌కు తొలి థలోనే తాత్త్విక జ్ఞానం అలవడే వ్యక్తిగత పరిస్థితులు కూడా వున్నాయి.

గద్దర్‌ మెదక్‌ జిల్లా తూప్రాన్‌ గ్రామంలో శేషయ్య, ఆయన రెండో భార్య లచ్చుమమ్మ (ఈ లచ్చుమమ్మే గద్దర్‌ పాటల్లో తెలంగాణ బిడ్డల తల్లి అయింది)లకు జన్మించాడు. ఉప్పరి పనిచేసే శేషయ్యను అప్పటికే అంబేడ్కర్‌ భావజాలం తాకింది. తల్లిదండ్రులకు చివరి సంతానంగా పుట్టిన విఠల్‌ రావే ఇప్పటి గద్దర్‌. అంబేడ్కర్‌ భావజాలం శేషయ్యకు ఆత్మగౌరవాన్ని అందిస్తే, దాన్ని ఆయన బిడ్డలకు అందించాడు. ఆ ఆత్మగౌరవం కారణంగానే ఆయన తన ఆడపిల్లలకు సరస్వతీబాయి, శాంతాబాయి, బాలమణిబాయి అని, మగ పిల్లలకు నర్సింగరావు, విఠల్‌ రావు అనే పేర్లు పెట్టుకున్నాడు.

ఆ తర్వాత బడి వాతావరణం, విద్య నేర్పి గురవుల ప్రభావం విఠల్‌ రావుపై పడింది. విఠల్‌ రావు చదువుకునే బడికి అనుబంధంగా శేషారెడ్డి అంటరానివారి కోసం వసతిగృహాన్ని ఏర్పాటు చేశాడు. ఆ శేషారెడ్డి ప్రభావం ఆయనపై తీవ్ర ప్రభావమే చూపింది. అంటరానితనం కూడదని కేవలం మాటల్లోనే చెప్పకుండా చేతల్లో కూడా చూపించిన ఆర్యసమాజిస్టు శేషారెడ్డి. (తెలంగాణలో ఆర్యసమాజం చేసిన కృషిని విశ్లేంచాల్సిన పని మిగిలే వుంది). వ్యక్తిని దృఢచిత్తులుగానూ, స్థిరసంకల్పులుగానూ రూపుదిద్దుకోవడానికి బాల్యంలోనే పునాదులు వేయడానికి ఆసనాలు వేయించేవారు, వ్యాయామం చేయించేవారు, శ్లోకాలను కంఠతా పట్టించేవారు.

ప్రతిభవల్ల రాణింతురు అని వ్యక్తిగత అభివృద్ధిని శ్లాఘించేవాళ్లు అంటుంటారు. కానీ, విఠల్‌ రావుకు అటువంటి ప్రతిభకు కొదవేమీ లేదు. పరిస్థితులు ఆయనను ఎటు నడిపించాయో అర్థం చేసుకుంటే చోదకశక్తులు ఏమిటో అర్థమవుతాయి. చదువులో విఠల్‌ రావు చాలా చురుగ్గా వుండేవాడు. దీంతో బడిలోని శంకరయ్య మాష్టారు విఠల్‌ రావును చేరదీసి, పాటలు పాడే, నాటకాలు వేసే, బుర్రకథలు చెప్పే సాంస్కృతిక బృందంలో చేర్చుకున్నాడు. ఈ బృందంలో విఠల్‌ రావుది ప్రత్యేక స్థానం. ఆయనది బుడ్డర్‌ఖాన్‌ వేషం. ఇదే ఆయనను తర్వాతి కాలంలో మాస్‌ హీరోగా నిలబెట్టి ఉంటుంది. 'అప్పనా తనా మనా' అంటూ ప్రేక్షకుల చేత గొల్లున నవ్వించే పాత్ర అది. ఆ పాత్రను సమర్థంగా పోషించడం అంత సులభమైన పనేం కాదు. కొంచెం తలకిందులైతే హాస్యం వెగటు పుట్టించే ప్రమాదం ఉంటుంది. తమను గిలిగింతలు పెట్టి, నవ్వించే పాత్రను ప్రజలు మరిపోవడం అంటూ వుండదు. పైగా, హాస్యాన్ని ఓ నెపంగా పెట్టుకుని సమాజాన్ని ఉతికిపారేసే అవకాశం ఆ పాత్రకు ఉంటుంది. తమకు నచ్చని వ్యక్తులకు, వాస్తవ జీవితంలో ఎంత కసి ఉన్నా తీర్చుకోలేని వ్యక్తులకు ఆ వాగ్బాణాలను అన్వయించుకుని కాస్తా ఊరట పొందుతారు. పేడ తట్టలను మోసేటప్పుడు తాను చుట్టూ ఉన్న మనుషుల నుంచి నేర్చుకున్నవాటినే బుడ్దర్‌ఖాణ్‌ వేషంలో విఠల్‌ రావు పలికేవాడు.

ఒకే ఇంటిలో, ఒకే తల్లికీతండ్రికీ పుట్టిన ఇద్దరు బిడ్డలు ఒకే తీరుగా ఎదిగే అవకాశం ఉండదు. అందుకు కూడా పరిస్థితులే కారణమవుతాయి. తల్లికి దగ్గరగా ఉండే పిల్లలే కళాకారులుగా ముందుకు వస్తారని చెప్పడానికి గద్దర్‌ కూడా ఓ ఉదాహరణ. నిజానికి, ప్రజల నిజమైన జీవితమంతా పెరట్లోనే వ్యక్తమవుతూ ఉంటుంది. అంటే, ఇంటి వెనక ఉండే ఖాళీ జాగాలో, మహిళలు పనిచేసే స్థలాల్లో. జీవితాలకు సంబంధించిన తడి మహిళల్లోనే కనిపిస్తుంది, వారి ద్వారానే వ్యక్తమవుతూ ఉంటుంది. అనేక విప్లవాత్మక భావాలకు వారు పురుడు పోస్తారు. మానవ సంబంధాల మర్మాల గుట్టు విప్పేది కూడా వారే. అందువల్ల తల్లుల వద్ద పిల్లలకు తెలిసే విషయాలు జీవితాన్ని నడిపించే శక్తుల మర్మాలను విప్పుతాయి. తల్లిచాటు బిడ్డ అయిన విఠల్‌ రావు కళాకారుడిగా, సాహిత్యవేత్తగా, ఉద్యమ కారుడిగా ఎదగడానికి దోహదం చేసిన మూలాలు కూడా అక్కడే ఉన్నాయి.

పైగా, ఒంటరితనంతో వేగిపోయే మహిళల స్థితి చెప్పనలవి కాదు. విఠల్‌రావు తండ్రి శేషయ్య ఉప్పరిపని చేస్తూ మొదటి భార్యతో దేశాటనం చేస్తూ వుంటే తల్లి లచ్చుమమ్మ ఒంటరితనంతో గూడు కట్టుకునిపోయేది. అటువంటి సమయంలోనే విఠల్‌రావు లచ్చుమమ్మకు ఓ ఆలంబనగా మారాడు. అందుకే, మహిళల తరఫున గద్దర్‌ నిరంతరం వకాల్తా పుచ్చుకుంటాడు. తల్లితో పాటు విఠల్‌ రావు పొలంలో మునుం వేసేవాడు. తల్లి పాటల్లోని శోకాన్నీ, ఆనందాన్నీ అనుభవించి, పలవరించాడు. 'సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో', 'పాలపిట్టలై వస్తారా నా బిడ్డలు' పాటలు అంత అర్ద్రంగా గద్దర్‌ నుంచి రావడంలోనే రహస్యం అదే.

1949లో పుట్టిన విఠల్‌ రావు 1966 - 67లో హెచ్‌ఎస్‌సి రాశాడు. హైస్కూల్లో చదువుతున్నప్పుడే పంచాయతీరాజ్‌ బుర్రకథ ప్రదర్శించి కింది స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రథమ బహుమతిని కొట్టేశాడు. ఆ తర్వాత పైచదువు కోసం ఊరు విడిచాడు. గ్రామంలోని సామాజిక అసమానతల అణచివేత హైదరాబాద్‌లో మరో రూపంలో ఎదురైంది. మొజంజాహి మార్కెట్‌లోని హాస్టల్లో వుంటూ సైఫాబాద్‌ కళాశాలకు రోజూ నడిచి పోయేవాడు. చిన్న ప్రపంచం పెద్ద ప్రపంచమైంది. చిన్ననాటి కలలు చిట్లిపోతుంటే పెద్ద పెద్ద బంగ్లల్ల పెద్ద పాములుండు అనే లోకజ్ఞానం అలవడింది. దేవుడి గుడిని వేదిక చేసిన పెద్దలు మాలవాడైనందున విఠల్‌ రావును వేదిక మీదినుంచి కాకుండా కింద ప్రదర్శన ఇవ్వాలనే షరతు పెట్టారు. అలా ఈ అసమానతల ప్రపంచంలో కళాకారుడిగా తన సామాజిక గుర్తింపును, ఉనికిని చాటుకునే విఠల్‌ రావుకు అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయి.

ఆ తర్వాత విఠల్‌ రావు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్‌ కోర్సులో చేరాడు. ఊళ్లో మొదటి బెంచీ కుర్రాడు ఇక్కడ చివరి బెంచీ యువకుడయ్యాడు. గ్రామీణ, పట్టణ జీవితాల మధ్య వుండే వ్యత్యాసాలు ఇటువంటి సందర్భంలోనే కొట్టొచ్చినట్లు అనుభవంలోకి వస్తాయి. ఆధునికత వైపు పరుగులు పెడుతున్న పట్టణజీవితంలోకి అడుగుల పెట్టిన గ్రామీణ అయోమయానికి, గందరగోళానికి గురై, వెనకబడిపోవడం అనేది ఇప్పటికీ ఉంది. గుడ్లు మిటకరించి ఆశ్చర్యం నుంచి తేరుకునేలోగా జరగాల్సింది జరిగిపోతుంది. ఇంజనీరింగ్‌ విద్యను విఠల్‌రావు చివరి దాకా కొనసాగించలేక పోయాడు. రెండో సంవత్సరంలోనే దానికో నమస్కారం పెట్టేసి 'ఢిల్లీ దర్బార్‌' హోటల్లో సర్వర్‌గా చేరాడు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ సమాచార, పౌర సంబంధాల మంత్రిత్వ శాఖ తరఫున బుర్రకథ ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించాడు. ఆయన బుర్రకథ వంతలు అప్పుడు కృష్ణ, నరహరి. విఠల్‌ బృందం అంబేడ్కర్‌ బుర్రకథనే కాకుండా అల్లూరి సీతారామరాజు బుర్రకథను కూడా ప్రదర్శించేది. ఆత్మగౌరవ పోరాటం అవసరాన్ని విఠల్‌కు అంబేడ్కర్‌ నేర్పితే భూమి మీద హక్కు కోసం పోరాడాల్సిన అవసరాన్ని అల్లూరి సీతారామ రాజు నేర్పాడు. ఇంత చేస్తున్నా తృప్తి లేదు. ఏదో లోటు కనిపిస్తూనే ఉన్నది, ఏదో అశాంతి చెలరేగుతూనే ఉన్నది. కుతకుత ఉడుకుతున్న గుండెకు ఊరట లేదు. అశాంతి రొదలో ప్రశాంతి చచ్చిపోతూ వచ్చింది. సరిగ్గా ఇటువంటి సందర్భంలోనే ఆర్ట్‌ లవర్స్‌ అసోసియేషన్‌తో విఠల్‌కు పరిచయం ఏర్పడింది.

హైదరాబాద్‌లోని కాచిగుడాలో ఉండే సంఘసేవకుడు గుమ్మడి రామస్వామి ఆ దారి చూపించాడు. ఆయన ప్రోద్బలంతో ఆల్వాల్‌లో ఆర్ట్‌ లవర్స్‌ అసోయేషన్‌ నిర్వహించిన బుర్రకథల పోటీల్లో విఠల్‌ బృందం పాల్గొని ప్రథమ బహుమతి గెలుచుకుంది.

ఆర్ట్‌ లవర్స్‌ అసోయేషన్‌ వ్యవస్థాపకుడు బి. నర్సింగరావు విఠల్‌కు మార్గదర్శకత్వం నెరిపాడు. ఈ ఛత్రం కిందనే విఠల్‌రావు గద్దర్‌గా రూపాంతరం చెందాడు. దానివల్లనే గద్దర్‌ ప్రజల నుంచి నేర్చుకుని ప్రజలకు ఇవ్వాలనే ప్రజా మార్గం పట్టిన కళాకారుడిగా రూపుదిద్దుకున్నాడు. నిజానికి, గద్దర్‌ విప్లవోద్యమ పాఠశాలలో తొలి గురువు బి. నర్సింగరావు. నర్సింరావు మెదక్‌ జిల్లాలో పేరు మోసిన భూస్వామి భూపతిరావు కొడుకు. ఆ రోజుల్లో ఆయనకు వందలాది ఎకరాల భూమి ఉండేది. అయితే, నర్సింగరావు భూస్వామ్య జీవితాన్ని తోసిరాజని ప్రజా జీవితాన్ని ఎంచుకున్నాడు. జెఎన్‌టియు ఫైన్‌ ఆర్ట్స్‌ కాలేజీలో వామపక్ష విద్యార్థి సంఘం అధ్యకక్షుడిగా కూడా పనిచేశారు

విప్లవ సానుభూతిపరులైన రచయితలు, మేధావులు, కళాకారుల నిరంతర చర్చకు నర్సింగరావు ఏర్పాటు చేసిన ఆర్ట్‌ లవర్స్‌ అసోయేషన్‌ వేదిక. చాలా మంది ప్రజా కళాకారులు ఇక్కడే రూపుదిద్దుకున్నారు. ఇప్పటికీ నర్సింగరావు తన పని మానుకోలేదు. గద్దర్‌ వచ్చిన తర్వాత ఆర్ట్‌ లవర్స్‌ అసోయేషన్‌ జననాట్య మండలిగా రూపం మార్చుకుంది. నర్సింగరావు, గద్దర్‌లతో పాటు బీదలపాట్లు రచయిత శంరకన్‌ కుట్టి, ఎల్‌ఎస్‌ఎన్‌ మూర్తి జన నాట్య మండలి ఏర్పాటులో పాలు పంచుకున్నారు. అంబేడ్కర్‌ 'కుల నిర్మూలన' పుస్తకాన్ని గద్దర్‌ చేతుల్లో పెట్టింది నర్సింగరావే. అలా వారిద్దరి సాహచర్యం అనేక ఒడిదొడుకుల్లోనూ కొనసాగుతూ ఉంది. గద్దర్‌ ప్రతి కష్టంలోనూ నర్సింగరావు ఓదార్పు మంత్రం వుంది.

అగ్రకుల మేధావులకు వేదికగా ఉంటూ వచ్చిన గద్దర్‌ ప్రవేశంతో ఆర్ట్‌ లవర్స్‌ అసోయేషన్‌ స్వరూప స్వభావాలు మారి జననాట్య మండలిగా రూపుదిద్దుకుంది. అలా అది ప్రజల పాటకు వేదికగా మారిపోయింది.

విప్లవ సానుభూతిపరుడైన నర్సింగరావు ద్వారా గద్దర్‌కు ముక్కు సుబ్బారెడ్డి పరిచయం కలిగింది. దాంతో విప్లవ సానుభూతిపరులైన కళాకారులకు, అభిమానులకు ఆధ్యయన, శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ఇక్కడే గద్దర్‌ మొట్టమొదటిసారి కొండపల్లి సీతారామయ్యను చూశాడు. నక్సలైట్‌ పార్టీకి అనుబంధంగా సాంస్కృతిక సంఘాన్ని ఏర్పాటు చేయాలనే ఇక్కడి ఆలోచన నుంచే జననాట్యమండలి పుట్టింది. 'రైతుకూలీ విజయం' పేరుతో బుర్రకథ రాసి గ్రామాల్లో ప్రదర్శనలు ఇవ్వాలనే కెఎస్‌ సూచన మేరకు నర్సింగరావు బుర్రకథ రాస్తే గద్దర్‌ కంపోజ్‌ చేశాడు. ఈ క్రమంలోనే విఠల్‌ రావుకు గదార్‌ పార్టీ గురించి తెలిసింది. ఆ స్ఫూర్తితోనే విఠల్‌ రావు గద్దర్‌గా ప్రజల ముందుకు వచ్చాడు.

జననాట్య మండలి గద్దర్‌గా ఆయన రాసిన మొట్టమొదటి పాట 'అపుర బండోడా బండెనుక నేనొస్తా' అనేది. 1972లో జన నాట్యమండలి పుడితే, 1973లో వరంగల్‌లో జరిగిన విరసం సభల్లో గద్దర్‌ బుర్రకథ ప్రదర్శన ఇచ్చాడు, పాటలు పాడాడు. అప్పుడే విప్లవ కవిత్వంలో రూపం, సారం మారడం ప్రారంభమైంది. గద్దర్‌ సాహిత్యంపై సమగ్ర విశ్లేషణ, పరిశీలన లేదా విమర్శ చేయాల్సిన అవసరం ఉంది.

వరంగల్‌ సభ తర్వాత అత్యవసర పరిస్థితి కారణంగా నర్సింగరావు అజ్ఞాతంలోకి వెళ్తే మిగతా కళాకారులు చెల్లాచెదురయ్యారు. గద్దర్‌కు కూడా రహస్య జీవితం గడపాల్సిన స్థితి వచ్చింది. దాంతో గద్దర్‌ హైదరాబాద్‌లోని చుట్టాల ఇంట్లో ఉంటూ ఆ ప్రైవేట్‌ ఉద్యోగం చేశాడు. అలాంటి స్థితిలో ఎలక్ట్రిక్‌ ఎక్విప్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలోనే గద్దర్‌కు విమలతో పరిచయం ఏర్పడింది.

గద్దర్‌ 1973లో బ్యాంక్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్ష రాశాడు. ఆ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో 1976 అక్టోబర్‌ 25వ తేదీన ఆయనకు బ్యాంక్‌ ఉద్యోగం వచ్చింది. మొట్టమొదట సికింద్రాబాద్‌లోని ఈస్ట్‌ మారేడుపల్లి కెనరా బ్యాంకు శాఖలో ఆయన క్లర్క్‌గా చేరాడు. ఉద్యోగం ఉందనే దీమాతో గద్దర్‌ 1976 నవంబర్‌లో విమలను పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆమె గద్దర్‌కు తోడూ నీడగా ఉంటూ వస్తున్నది. ఉద్యమాల్లో కూడా ఆయన తిండీతిప్పలు చూస్తూ వుండేది. పెళ్లి తర్వాత కూడా గద్దర్‌ది రహస్య జీవితమే. పైగా, కులం కారణంగా అద్దెకు ఇల్లు దొరకడం కూడా కష్టంగా మారింది. మాలోల్లమని చెప్తే ఇల్లు అద్దెకు దొరికేది కాదు, దాంతో వేరే కులం పేరు చెబుతూ అద్దె ఇళ్లలో కాపురాలు చేస్తూ వచ్చారు. అయితే, గద్దర్‌ను 1977 జూన్‌లో అప్పటి డిఎస్‌పి ఆల్ఫ్రెడ్‌ అరెస్టు చేశాడు. 42 రోజుల పాటు జైలులో ఉండి, విడుదలైన తర్వాత గద్దర్‌ మళ్లీ ఉద్యోగంలో చేరాడు.

పెళ్లి చేసుకున్న తర్వాత ఉద్యోగం చేసుకుంటూ సాధారణ జీవితం గడపాలని ఓ వైపు అనుకుంటున్నప్పటికీ లోలోన రగులుతున్న అగ్నికణం నిలువనీయలేదు. ఎమర్జెన్సీ ఎత్తివేత తర్వాత 'సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో', 'లాల్‌ సలామ్‌ లాల్‌ సలామ్‌', 'ఎన్నియల్లో ఎన్నియల్లో గోపి నిర్మలమ్మ కథ వినవే' వంటి పాటలు రాశాడు.

ఉద్యోగంలో సంపాదించిన డబ్బుతో గద్దర్‌, విమల 150 గజాల స్థలం కొనుక్కున్నారు. ఆ తర్వాత దాన్ని అమ్మేసి వెంకటాపురంలో 1978 - 79లో ఓ ఇల్లు కొనుక్కున్నారు.వెంకటాపురంతో గద్దర్‌కు విడదీయరాని సంబంధమే ఉంది. ఇక్కడే గద్దర్‌ అక్క ఉంటుంది. విద్యార్థి థలో పప్పు, ఉప్పు, చింతపండు మూటలు వేసుకుని తూప్రాన్‌ నుంచి వెంకటాపురం వచ్చేవాడు. హైదరాబాద్‌లోని సైఫాబాద్‌ కళాశాలలో చేరడానికి ముందు కూడా కొంత కాలం ఇక్కడ ఉన్నాడు. ఇంజనీరింగ్‌ చదువుకు స్వస్తి చెప్పి బాలానగర్‌లో గద్దర్‌ కూలిపని చేశాడు. అదే సమయంలో బద్రుకా కాలేజీలో బికాం కోర్చులో చేరాడు. ఆ కాలంలో కూడా ఆయన వెంకటాపురంలోనే ఉన్నాడు. జన నాట్యమండలి కార్యకలాపాలకు కూడా వెంకటాపురంలోని గద్దర్‌ నివాసమే కేంద్రంగా మారింది. ప్రతి సంక్షోభసమయంలోనూ ఊరటనిచ్చింది ఆయనకు వెంకటాపురమే.

గద్దర్‌ జననాట్య మండలి గొడుగు కింద మొదటిసారి 1978లో శిక్షణా తరగతులు నిర్వహించాడు. జననాట్యమండలికి పూర్తి కాలం పనిచేసే వాళ్లు కావాలని 1980లో పీపుల్స్‌వార్‌ నిర్ణయించింది. కానీ, వెంటనే అది కార్యరూపం దాల్చలేదు. అయితే, ఆ తర్వాత కూడా గద్దర్‌ 1981 - 82 ప్రాంతంలో నల్లగొండ జిల్లా భువనగిరిలో ఉద్యోగం చేశారు. 1982లో జననాట్య మండలి ఇనిస్టిట్యూట్‌ ఏర్పడింది. పార్టీ నిర్ణయం మేరకు గద్దర్‌ 1983లో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి కాలం జన నాట్యమండలి కార్యకర్తగా చేరాడు. తీవ్ర నిర్బంధం కారణంగా 1983లో గద్దర్‌ అజ్ఞాతంలోకి వెళ్లాడు. అజ్ఞాతంలో ఆయన కార్యకలాపాలేమినేది వేరే విషయం. 1990 ఫిబ్రవరి 18వ తేదీన హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ద్వారా బహిరంగ జీవితంలోకి వచ్చాడు. బహిరంగ జీవితంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో, వరంగల్‌లో ఆయన ఇచ్చిన ప్రదర్శనలు హోరెత్తించాయి.

ఉద్యమ జీవితంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఆయన పలు ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఆయనపై సాయుధ దాడి జరిగింది. శరీరంలోకి తూటాల దిగినా అతను భయపడలేదు, వెనకడుగు వేయలేదు. ప్రస్తుతం ఆయన తెలంగాణ వాణి వినిపిస్తున్నారు. చెప్పాలంటే, గద్దర్‌ కాలం గర్భం నుంచి చీల్చుకుని వచ్చిన విష్ణ్వంశకు చెందిన నరసింహావతారం కాడు, శివాంశకు చెందిన నరసింహావతారం. ఈ కాలం వీరుడు గద్దర్‌. అందుకే, ఆయన ప్రతి కదలిక, ప్రతి చర్యా, ప్రతి మాటా సంచలనమే అవుతూ వచ్చింది. సమకాలీనంలో అ చారిత్రక కర్తవ్యాన్ని నిర్వహించిన యోధుడు గద్దర్‌. గద్దర్‌కు అభిమానులూ ఉన్నారు, భక్తులూ ఉన్నారు. ఆయన పాటకు ఉర్రూతలూగి ఆశయ సాధన కోసం అడవులు పట్టినవారూ ఉన్నారు. తాను నమ్మిన విశ్వాసం కోసం, అశేష పీడితుల కోసం ఆయన చివరంటా నిలబడ్డాడు. ఆయన చేసిన పొరపాట్లు ఆయన చేసిన త్యాగం ముందు లెక్కలోకి రాకపోవచ్చు. అయితే, ఇప్పటి కాలం తన పురుటి నొప్పుల నుంచి మరో వీరుడ్ని కంటుందా.. ఏమో....

- కాసుల ప్రతాపరెడ్డి

ఫొటో: కందుకూరి రమేష్ బాబు

English summary
As a revolutionary poet Gaddar has showed immense stramina. He changed the content and form of the revolutionary trend in Telugu literature.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X