అందని ఎర్రని పొద్దు పొడ
తిత్తుల దాతి వృత్తుల ఇరుసు
గొంతు ఊగులాడే జట్టి తలకాయ
పునాది లొకారం పంతపడె పాదం
జొబ్బున ఈగల జబ్బన ఆకలి
గట్కల పిండి రొట్టె ముక్క...
పంచ గద్ద పలారం జీవితం
కార్జెం కత్తి తునక
కమిలిన డొక్కల కలిగంజి
ఊగులాడే తస్సల దండెం
ఉండ జుట్టిన ఆశ...
సాగె కరువు సాగ మట్టనార
ఎదురు నిల్చిన గాట్ల, ఎడమ చూపుడు వేలు
చెదరని సాక్ష్యం చెప్పచ్చు రాయి
తలవంచిన శతకిరీటం
మట్టి పాదాల శణార్థి
ఈత నార జీరే ఇగురం
దొబ్బల దొంతుల అమృత గోర్జెం
పగిలిన కుండంచుకు ... పర్ర పల్లవి నాదం
సరాల సప్తస్వరాలు, సూరుకు వేలాడే తాంబుర్రలు
జోగు జమిడికే ఒగ్గు డమరుకం
తోలు రక్త గల్జుల నొల్చిన రోకటి పోటు పట్టు
సున్నం తంగేడు, కవుసు వొలిచిన కాగితం అట్ట
పిడిశెల కుదురు సింతగింజ అంబలి
నా రాతాల్ల నడుమల ఇసుర్రాయి బరువు
సకల వాయిద్యాల సరస్వతి, లందలో దాగిన ఆదిశక్తి
జల్లెడ తూట్ల నీటి మూట, పలుగు రాళ్ల పరమాన్నం
అదిగో.. అరుందతి...
కుండల ఉడికిన కు ల మహారాణి
నీతినియమాల తీర్పు
సప్త సముద్రాలు, నా అందె బుర్రల నీల్లే...
అన్ని విద్దెలు..... నా జమ్మి ఇత్తార్లే...
భూమికి మొదలు పుట్టినోన్ని, భూదేవంత ఓపిక
మొగులంత ఇమరాస, సముద్రపు గంభీరం
పంచభూతాలు, నా పందిట్ల బందీలు
జాతీయ పక్షి అంశ, కొసముక్కు కొంగవాలు కత్తి
జంబురాజ్యలక్ష్మిని, మహా దిగంతాల పాలకుని












Click it and Unblock the Notifications