ఆనవాళ్లు
కంటిరెప్పలపై కాల్చిన గుర్తులు
కనుబొమ్మలపై జీడివాతలు
కణతలపై కాల్చిన ఎరుకలు
నొసలుపై రూపాయి బిల్లంత బర్ర
చుక్కబొట్టు, ముక్కుపై కట్టు
మెడపై గుంజిన వాత
గొంతుపై జీడి గీత
బొత్తపై చురుకులు
నడుముపై అడ్డనామాలు
పచ్చకామెర్లకు మట్టలపై గుండ్రటి చక్రాలు
కమిలిన అరచేతిలో కాచిన కాయలు
చేతిపై సరస్వతి - చందమామ
ఆత్మీయుల పేర్లు
అక్కచెల్లెండ్ల బొమ్మలు
మోకాళ్లపై జీడి బర్రలు
పొట్రాళ్లకు పగిలిన వేళ్లు, ఊడిన గోళ్లు
జల్లెడ తూట్లు, కాళ్లకు గుచ్చిన ముండ్లు
అరికాళ్లకు ఆనెలు
పాలిపోయిన పెదవులు
వాలిపోయిన కనులు
ముప్పై ఏండ్లకే ముడుతల ముఖం
అమాయకత్వం
అలుపెరుగని బ్రతుకు పోరాటం
ఇవే నా ఆనవాళ్లు.....












Click it and Unblock the Notifications