ప్రాణం
ఎల్లలు లేని ఆకాశం
దాని దేశం
ఏ గుంపులోదో
ఏ చెట్టుదో
ఎలా చెప్పగలం
హాయిగా పాడుకుంటూ
తన రెక్కల విన్యాసంతో
ఆకాశయానం చేస్తూ
ఆహారాన్ని ఆనందాన్ని పొందే పక్షి
నిర్జీవంగా నేల రాలింది
ఎందుకు ఎలా
ఆరాలు కారణాలు
వెదికే తీరిక లేని ప్రపంచం
తోటి పక్షులేవో చుట్టూ చేరి
కాస్సేపు సంతాప సంగీతాన్ని వినిపించాయి
తమని తాము ఓదార్చుకున్నాయో
తామూ ఇలానేనని భయపడ్డాయో
ఇదే అంతిమ సంస్కారమని చెప్పి వెళ్లాయో
తమంతటి స్వేచ్ఛైనా లేదని
తమలా కనీసం ఎగరలేమని
ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ
మనిషి అరచేతుల్లో ఇమిడిపోయే పక్షి
జీవం లేకుండా పడుంది
జీవంతో ఉన్నప్పుడు
అదొక పాటల పెట్టె
ముడుచుకుపోయే చిన్న రెక్కల విమానం
ఉపయోగపడలేనప్పుడు
చెత్తబుట్టలో చేరాల్సిన పదార్థం
అనుకోని ఆతిథ్యం గెద్దలకి
అనుకున్నట్టు
ఎగరేసుకుపోయిన ప్రాణం
ఏ చేతులదో
ఎక్కడదో












Click it and Unblock the Notifications