పబ్ పద్యం

ఉడుపులెగిపోతాయ్ మెట్లపైకి
తోక మొలిచిన దేవుడివై
తలువు తెరుస్తావు మైకం రాత్రికి
ప్రొజెక్టర్ కన్ను గీటితే
కాంతులు చిట్లి
రంగులు పగిలి
తెర లేవకా, తెర పడకా
ఒకటే తూలుడు
నిర్విరామ సెల్యులాయిడ్ మాయలోకి
డిజె తంతాడు నీ చర్మ వాద్యాన్ని ఎలక్ట్రిక్ కాళ్లతో
మూలుగుతాయి కర్ణభేరులు
పుచ్చెలు పగులుతాయ్
తలపండు వూగివూగీ వాలి
రాలిపోతుంది కపాల మోక్షాన
వారే చూడరే బొమ్మలాట
వలువల్లేని తోలు బొమ్మలాట
లాంజరీలూ, హాట్ కోషర్ లూ డాన్సింగ్ చన్నుల్తో
తేలుతాయ్ డాన్సింగ్ రివర్ ఫ్లోర్ లో
పిచర్ లో నురగలు కక్కుతుంది దుర్గం చెరువులో ఒక కాళము
మర్దన చేస్తావా స్పార్క్ లు చిమ్మంగ నెత్తురోడుతూ గోపికల్తో గూడి
ఆకుపచ్చ తోటలో ఆకుపచ్చ కూరగాయల సలాడ్
కరుస్తుంది కసిగా పచ్చి మిరప సాస్ కోరల్తో
గోడల పడకలు, పడకల గోడలు
పెనవేసుకుంటున్న డిజిటల్ మాంసాలు
రసి కారుతుంది గ్రాఫిక్ రతుల్లో, చివరకు గ్లాసుల్లో
పొర గమ్ముతుంది శ్రమైక మృత్యు సౌందర్య ధూమం
ఈ రాత్రికి నీకు యిల్లు లేదు
ఈ కన్నుమూతలో నీకు లోకం లేదు
జేబులు తూట్లు బడి
కూలిపోతావొక మహోన్నత సాంకేతిక నరకాన
ఎవరికీ చెప్పక వచ్చావో
ఎవరూ లేరని వచ్చావో
ఇది పరమ పద సోపానము
పాములు మింగే వైకుంఠ పాళి












Click it and Unblock the Notifications