హైటెక్ సిటీ మామ్ కి స్వాగతం

టాంక్ బండ్ షార్ట్స్ తో
చార్ మినార్ చమ్కీ చుక్కబెట్టి
బంజారా క్రాఫ్ తో, జూబ్లీహిల్స్ శాండిల్స్ వేసి
హుందై, సాంత్రో, బెంజ్, ఇండికాలతో క్వాలిస్ వాక్ చేస్తూ
ఓజోను కిటికీ నుంచి చందమామకు
అపార్ట్ మెంట్ల సైటు కొడుతూ
అంగారకున్ని ఆలింగనం చేస్తూ
భూమిని బుగ్గి చేస్తున్న ఎన్నికల విషపు విత్తుల్తో
పంట పరిగెల గెలుపోటముల యుద్ధ తరుణంలో
సందట్లో సైలెంటుగా
మా మిస్టర్ హైటెక్కును పరామర్శించుటకు
ఫ్లైటు తెగిపడ్డట్టు తారణంతో ఉగాది
మా హైటెక్కు మర్యాదలకే డ్రైనేజీ కట్ట అడ్డు రాదు
మామిడి కాత, వేప పూత, మల్లెపూలు
ప్లాస్టిక్కు క్లోనింగులని అనుమానపడకు
పార్టీల బానర్లన్ని పంచరంగుల పచ్చని తోరణాలే
ప్రచార హోరులన్నీ కోకిల గానాల రెపరెపలే
బ్రీత్ లెస్ ఆల్బమ్ ల వెబ్ సైట్ సిడీల వేదిక మీద
పాప్ మ్యూజిక్ డిజెల అందాలు డిస్కోథెక్ లు
మసక మసకలు మల్లె చీకట్లూ
తాక్ థీమ్ తకబెకల డ్రీమ్ బీట్సు
చల్లని బార్లూ, వెచ్చని బీర్లూ
మా మిస్టర్ హైటెక్కు తార్రోడ్డు గొంతుతో కంకర గీతంతో
గతుకుల రాగం పాడుతూ ట్రాఫిక్ కచేరి చేస్తాడు
నీతో ఫాదర్ టంగ్ లో కంప్యూటర్ భాషిస్తాడు
నీళ్లు యివ్వడు కాలుష్యం తాగిస్తాడు పెప్సీలా
తాజ్ బంజారా, వైస్రాయ్, ఒబెరాయ్ ల టెంటులేసి
బేకర్స్ యీవెన్ విస్తరేసి కంట్రీ వోవెన్ పీటేసి
పర్యాటక పాత్రలో ఫాస్ట్ ఫుడ్ గా
పిజ్జా బర్గర్ల వాగ్దానాల్ని ఉగాది చాట్ గా
అదిగో ఉగాది నీకే వెల్ కం స్వాగతం












Click it and Unblock the Notifications