ఏమైనా..

రేగు కంప గుండెన చీరుతనే ఉంటది
బొంగరం గిర్రున తిరుగుతూ బుర్రను తొలుస్తనే ఉంటది
మంది మందలకు దూరంగా
చీకటి గుహలూ మారు మూలలూ
మహానుభావులు, మహా పురుషులు లేని చోట్లు
దేవులాడుతుంటా
ఉద్యమాలు, పోరాటాలు
పసిపోరగాల్లై కాళ్లకు చుట్టుకుంటూ ఉంటయి
రోడ్డు మీదికి రావడం తప్పదు
సమూహంగానే కనిపిస్తుంటం
మనిషికీ మనిషికీ మధ్య గుండెలు అతుక్కోవు
ఎవరి ఎజెండాలు వారికుంటయి
మనసు లోలోతుల్లో అహం బుసలు కొడుతూ ఉంటది
పండుగలూ పబ్బాలు వస్తుంటయి, పోతుంటయి
దేహం మీది నుంచి రుతువులు జారి పోతుంటయి
అత్మ వికసిస్తనే ఉంటది
కాలం తెర మీద నా పాద ముద్రలు పడుతయి












Click it and Unblock the Notifications