గాయాలు నిజం చెబుతాయి

ట్రంకు పెట్టెలు కానరావు
తరగతి పుస్తకాల బరువుతో
కాలం దాటిన దినపత్రికల నడుమ
మడత చెరగని గుడ్డల్ని
వాడి కళ్లు పదే పదే దర్శిస్తుంటాయి
తపేలాకు చుట్టిన గోనెసంచి ముడి తొలగిస్తే
మోసానికి అందని చెదల నూక
అన్నం డేక్షా మూత జరిపితే దగాకోరుతనాన్ని చాటే నీళ్లరసం
వాడికి పంచభక్ష్య పరమాన్నమై సజీవ సాక్ష్యాలవుతాయి
వందల మంది ఇరుకు గదిలో చలిపులి కౌగిళ్ల మధ్య
భయానక స్వప్నాల్ని అహ్వానిస్తూ
కలత నిదుర నడుమ
భవిష్యత్తు లక్ష్యాన్ని ఛేదించే వెలుగు కోసం
వెంపర్లాడుతుంటారు
చినుకు కోసం వీక్షించే చకోరంలా
స్కాలర్షిప్ ను తలుచుకుంటూ
బతుకీడుస్తున్నవాడికి
అధికారుల అలసత్వం దర్సనమిస్తుంటుంది
తనలాంటివారి కోసం మూకుమ్మడిగా జరిపే పోరాటంలో
ఎన్ని లాఠీలు లేస్తాయో
రుధిరధార శరీరాలపై కాలువలా ప్రవహిస్తుందో
ఎంతకూ తగ్గని గాయాలు
ఎప్పుడూ నిజం చెబుతూనే ఉంటాయి












Click it and Unblock the Notifications