స్తబ్ద మౌనముద్ర

అనువాదం: కాసుల లింగారెడ్డి
నేను కూర్చొని
ప్రపంచపు అనేక బాధల్ని
అణచివేతల్ని, అవమానాల్ని
చూస్తున్నాను
గుక్కపట్టి రహస్యంగా ఏడుస్తున్న గొంతుల్ని
దుర్భర సామూహిక దుఖ్కాల్ని
చర్యానంతర నిరంతర ఆరోపణల్ని
నేను వింటున్నాను
ధనస్వామ్యం చేత నిరాకరించబడినవాళ్లు
జీవితాకాశం మీద దట్టమైన నల్లని నిరాశల మబ్బులా పరిచినవాళ్లు
ఆకలి కొలముల్లో ఎముకలగూళ్లుగా మిగిలినవాళ్లు
కన్నపిల్లల చేత నిరాదరింపబడినవాళ్లు
ఆ జీవచ్ఛవాల్ని
నేను చూస్తున్నాను
భర్తల చేత తిరస్కరింపబడుతున్న భార్యల్ని
వలపుల వలలో చిక్కి దగాపడుతున్న యువతుల్ని
నేను చూస్తున్నాను
ఎగిసి పడుతున్న క్రోధాగ్నుల్ని, ఈర్ష్య ఆసూయల్ని
అమానవత్వాన్ని, ప్రేమరాహిత్యాన్ని
నటనల యవనికల మాటున దాచుకుంటున్న దృశ్యాన్ని
నేను చూస్తున్నాను
ఎడతెగని యుద్ధాల్ని
భయానక వ్యాధుల్ని
నిస్సహాయంగా బంధింపబడ్డ ఖైదీల్ని
అకుంఠిత దీక్షాపరులైన అమరవీరుల్ని
నేను చూస్తున్నాను
నట్టనడి సంద్రంలో
ఒక అనంత కరువు నా కంటపడింది
ఇక్కడ
ఎవరి జీవిక కోసం
ఎవర్ని బలిపెట్టాలో
లాటరీల్లో తేల్చుకుంటున్న విషాద బీభత్స దృశ్యాన్ని
నేను చూస్తున్నాను
నిరుపేద నిర్భాగ్యుల మీద
సకల సంపదల సృష్టికర్తల మీద
నీగ్రోల మీద, నిస్సహాయుల మీద
దురహంకార ధనాంధులు ప్రయోగిస్తున్న
అవమానాల్ని, అణచివేతల్ని
నేను చూస్తున్నాను
వీటన్నింటినీ
అవును, నాకర్థమవుతున్న వీటన్నింటినీ
కనుచూపు మేరలో పరిష్కారం కనిపించని ఈ బాధలన్నింటినీ
పడక కుర్చీలో కూర్చొని
నేను నింపాదిగా చూస్తున్నాను
మీరు కళ్లు చించుకుని చూడండి
చెవులొగ్గి వినండి
నేనెంత స్తబ్ద మౌనముద్రలో ఉన్నానో -












Click it and Unblock the Notifications