అన్నవరం దేవేందర్ కవిత కట్ట మైసమ్మ

సరికొత్త ప్రహరీ నిర్మించుడే వాస్తవికత
పుచ్చిపోయిన దంతాలను
పట్కారుతో పెకలించి తీస్తేన స్వస్థత
పైకప్పు పలిగి పోయి ఉరిసందనుకో
కొత్త గూన పెంక తెచ్చి ఇల్లంతా సదిరిస్తం
గ్రహణం పట్టిన విగ్రహాలు అంతే
ఆగ్రహం ముందు ఏ నిగ్రహమూ నిలవదు
సమైక్యాంధ్ర ఎంత మంచి సమాసము
నేతి బీరకాయ తీరు అంతా మోసం
ఈ కొస నుంచి ఆ కొస దాకా
ఆవలి వైతాళికులవే తళుకు బెలుకులు
మన వైతాళికులు మాత్రం వైతరణి పాలు
హుస్సేన్ సాగర్ నీకొక సలాం
భాగ్యనగరానికి నీవు కంఠాభరణం
ఇది మా షోయబుల్లా నడిచిన ఆనకట్ట
ఇది మా తుర్రెబాజ్ ఖాన్ తానమాడిన చెరువు
ఇది కొమురం భీం కొట్లాడిన నేల
యాడ బోయినయి మా ఆనవాలు
అగో ఆ అలల మీంచి వచ్చేది
కట్టమైసమ్మ దీవెనార్తుల గుగ్గిలం పొగ
తల్వార్ తలాబ్‌ల దాచుకున్నట్టున్నది
ఆనవాలు కోసం ఆదుర్ద పడ్డది
ఓపిక సాంద్రత దాటితే
పచ్చెలు పచ్చెలు ఇచ్చుక పోవుడే












Click it and Unblock the Notifications