కాసుల లింగారెడ్డి కవిత తహ్రీర్ స్క్వేర్

తిరుగుతున్న చరిత్ర చక్రం
స్థలాల రాతల్ని మారుస్తున్న
భూగోళం బంతి
నాగరికత పురుడు పోసుకున్న
నైలు నది ఒడ్డున
జయించిన పిరమిడ్ల
మొక్కవోని ఉక్కు విశ్వాసం
ఒక ేడారి నదై నవ్వితే
పువ్వై పులకరించిన తడారిన గుండెలు
ఛాందస బురఖాల మీద వీచిన
తూర్పు పవనం
వేసవి ఇసుక తుఫానులో
వెల్లి విరిసిన ఒయాసిస్సు
నిరంకుశ రాజ్యపు బారికేడ్ల మీద
ఎడారి ఓడల కవాతు
ఆర్థిక అణచివేతల్ని నిలువరించి
విముక్తి కూడళ్లని సృష్టించిన
వసంత మేఘ గర్జన
మట్టికాళ్ల రాకాసి మర్రి
ఊడలు పెరికి
విమోచన దారుల్ని కనుగొన్న
జనసంద్రపు జలపాతం
ఫత్వాలు ప్రదర్శనల్ని సైతం నిలువరించిన చోట
జుమ్మా జన ప్రజాస్వామ్య ప్రతీక
జల్ హజర్ అందుకో ఆదాబ్
కైరో నగరమా, కరాలు మోడ్చి
కూలిపోయిన కేంద్రాల నీడలో
ఫోన్స్, జీన్స్ ధరించి
కళ్లని కంప్యూటర్‌కు అతికించి
కులాసాల్లో తేలియాడిండ్రని
పోరాటాల దారి మరిచిండ్రని
మిమ్మల్ని నిందించినందుకు
మమ్మల్ని మన్నించండి
చీకటి లోకపు
తూర్పు సూర్యుళ్లు మీరు
దోపిడీ నియంతల మీద మోగిన
ధిక్కార నగారాలు మీరు
గమ్యం స్పష్టమైంది
గమనం సాగించండి
ప్రజలు తొణికిన స్వప్నాన్ని కల గంటున్నరు
ప్రపంచ పోలీసుని పడగొడుతున్నరు
- డా. కాసుల లింగారెడ్డి












Click it and Unblock the Notifications