లేపన సుఖం

నేను ముసుగును కప్పుకుంటాను
నేనే కన్నం వేసుకుంటాను
తెలియని చర్మపు దారుల గుండా
కళ్లు మూసుకోక తప్పటం లేదు
నమ్మకమైన చీకటి చేయి పట్టుకుని నడిపిస్తుంది
కలలు సముద్రాలు
వంకలు తిరిగిన నడుము
విషాదం తాగిన కంఠం
రక్తసంబంధం ఏడుపు
వ్రణాల వలలో కొంత సౌఖ్యం కూడా లేకపోలేదు
చిగురించడమే నేర్చుకోవాలింక..
ఉండకూడదని చోటు నుండి పోలేనితనం
నరాలు భూమిలో నాటుకుపోయాయి
ఎవరుండకపోయినా లోపలి రాక్షసుడుంటాడు
తూలుతూ తూలుతూ
కూలిన శిథిలాల నుండి కొంచెం కొంచెం
తలెత్తతుంటాడు
ఆభరణాల్లా అతికిపోయిన
ఎగరలేని రెక్కలు, తిరగలేని కాళ్లతో
ఆత్మ వికలాంగుడు
సుఖాన్ని నిద్రపోనివ్వడు
ఒళ్లంతా అక్రమించుకున్న
ఓ స్త్రీ మమకారాన్ని
విడదీసుకోలేని అశక్తతలో
జీవితాన్ని కమ్ముకున్న దుమారం పట్ల ప్రేమ కల్గింది
దుఖానికిరువైపులా నేనే వేలాడుతూ
ఏమీ తేల్చుకోలేక
అగ్గి లోపలి ప్రశాంతతతో తలవాల్సితిని
రెండ్రోజుల తర్వాత
మూడో నాడు ప్రొద్దున్నే
నా శరీరం కన్పించడం లేదు
- పులిపాటి గురుస్వామి












Click it and Unblock the Notifications