లోపలి బయలు

నిద్రించిన నెత్తురు దమ్మనగ్రోవి నుంచి పారినట్టు
ఓడిపోయిన దేహభాండం తిరిగి అతుక్కున్నట్టు
లేననుకున్న నేను
కనుగొన్న నేను
విసిరేసిన పాట లోపలికే చేరినట్టు
ఒంటికతుక్కున్న చర్మం పాప్ మ్యూజిక్కైనట్టు
అబార్షన్ అయిన కల ఊపిరి పోసుకున్నట్టు
నేలకొరిగిన నింగి నిటారుగా నిలబడ్డట్టు
మెరుపులనేకం
మబ్బులనేకం
గురైన కన్ను ఒక్కటే
పాడిన చెక్కిలులెన్నో
వాడిన పెదవులెన్నో
స్పర్శించే తంత్రి ఒక్కటే
ఇసుక తుఫాన్‌లో నేను
ఒక్క పలవరింత
ఒక్క చిలకరింత
శీతలత్వ చేరువలో నేను
మరొక్క పలవరింత
వంద పాదాల నృత్యం
వెయ్యి పతనాల దృశ్యం
దిల్ ఏక్ తారా
పులుల విరామంలో
కుందేలు పిల్ల నవ్వు
పదాల సవ్వడి లేని పెదాల హోరు
పెదాల ప్రమేయం లేని పద ప్రవాహం
ఒకే ఒక్క చెవి
శిశిర చిహ్నాలతో నేను
రాలిన చోటే రత్నాంకురం
వెయ్యి పుప్పొడులు కళ్లను కమ్మినట్టు
కాలం కలకండగా మారినట్టు
చిక్కు విప్పిన వేళ్లు లాలనగా గ్రీట్ చేసినట్టు
దేవులాడుతున్న కళ్లు ఉసిక కుప్పలో దొరికినట్టు
దాచి పోగొట్టుకున్నది దారి తప్పిన చోటే తగిలినట్టు
పోగొట్టుకుని దాచినది వారిన చోట మార్మికమైనట్టు
లోపలి బయలూ బయటి లోపలా
- సుంకిరెడ్డి నారాయణ రెడ్డి












Click it and Unblock the Notifications