బైరెడ్డి కృష్ణా రెడ్డి కవిత పాసంగం

ఇసుక గూళ్ల ఆనవాల్లల్ల
నిక్షిప్తమైన
పసివాడిని చిన్నప్పటి జ్ఞాపకాలు
నా కవితాక్షరాలు
పున్నమి కురిసిన వెన్నెలల్ల
తానమాడి
సందెమాపు రెక్కలపైన విహరించే
మిణుగురుపూల మిలమిలలు
నా కవితాక్షరాలు
నీరెండ నింగిన సింగారించిన
వరదగూడు వన్నెలతో
జతకట్టిన పైరగాలి చిరుజల్లుల
సరిగమలకు
గంతులేసే లేగదూడల పులకింతలు
నా కవితాక్షరాలు
చిగురు కొమ్మల తేనే తెట్టెలల్ల
వూట చెలిమల నీటి ధారలల్ల
రింగన్న రెక్కల భేరి నాదాలల్ల
కోకిల గాత్రాల కూనిరాగాలల్ల
అమ్మ చనుబాల తీపిని నింపిన
కన్న వూరి వూసులు
నా కవితాక్షరాలు
సెలకలల్ల గట్టెమ్మటి
వాగులల్ల వరదలెమ్మటి
ఒంటిపొంటెల అరకలెమ్మటి
జామురాత్రుల మోటలెమ్మటి
చెట్లెమ్మటి పుట్టలెమ్మటి
నాయిన నేర్పిన బతుకు పాటలు
నా కవితాక్షరాలు
అలకల ముసుగుల్ని గోరుముద్దల
బుజ్జగించిన అవ్వ చెప్పిన
సందమామల సెట్టు కింద
దిగాలుపడి కూసున్న
పేదరాశి పెద్దమ్మల కతలు
నా కవితాక్షరాలు
గెలీలియో నేత్రానికి చిక్కని
వేల సౌర కుటుంబాల
నిగూఢ కాంతి రేఖలు
నా కవితాక్షరాలు
నూరు మణుగుల తులాభారాల
గురుత్వ శక్తిని ఎక్కిరించిన
తులసి దళాల తూనికలు
నా కవితాక్షరాలు












Click it and Unblock the Notifications