బోధనం కవిత 'భూకంపం'

భూమి కంపిస్తున్న శబ్దం
తొలకరి చినుకులకు నాని
నేలను తొలుస్తున్న గింజలా
పాతేసిన వాస్తవం పైకొస్తున్నట్టు
ఈ ఎగుడు దిగుడు వ్యవస్థ
నెర్రెలు నెర్రెలై పగిలి
సమూలంగా చదును కానున్నట్లు
ఇప్పుడు కనిపిస్తున్నది
శబ్దిస్తున్న భూమి సంచలనం
పిడికెడు ఒక్క జీవితాన్ని
కల్పవృక్షమై కాస్తున్న ఒక్కగానొక్క బక్కెద్దు
కాడి నేలకేస్తే కార్చే రైతు కన్నీళ్ల నుంచి
ఆకలి దహిస్తున్న గుడిసెల్ని
ఓదార్చే ఓపిక లేక
బావురుమంటున్న ఖాళీ నీళ్లకుండ కడుపులో నుంచి
చట్టాల పచ్చిమాసం తిని బలిసిన
అధికారపు పెద్ద పులి కండకావరపు కోర దిగి
అసహాయులు పెట్టే నిస్సహాయ కేకల నుంచి
అక్రమం పన్నిన కుట్రకు బలై
కోర్టు బోనులో నలుగుతున్న
ఖాళీ పిడికిళ్ల శూన్యం నుంచి
చిగురిస్తున్న నియంతృత్వ విషవృక్షం ముల్లు దిగి
చీకటి కటకటాల వెనుక
వెలుతురు పోగొట్టుకున్న కళ్ల విషాదం నుంచి
ఆకలి నుంచీ ఆవేదన నుంచీ
ఆయాసం నుంచీ ఆదేశం నుంచీ
అగ్గిలా రౌద్రంగా
మార్పులా వాస్తవంగా
పోరాటమై ఉధృతంగా
ఇప్పుడు వినిపిస్తున్నది
భూమి కంపిస్తునన శబ్దం
ఇప్పుడు కనిపిస్తున్నది
శబ్దిస్తున్న భూమి సంచలనం
- బోధనం నర్సిరెడ్డి












Click it and Unblock the Notifications