మా వూరికి డాంబర్ రోడ్డు

ఆ మట్టిలోనే ఏదో మహిముండె
మనిషి నడచిన అడుగు జాడలుండె
అడ్డంగా పాక్కుంట పోయిన పాము వంకల గుర్తులుండె
అరవై మూడేండ్ల స్వతంత్రం తర్వాత
ఊరును అమాంతం మింగే అనకొండ వచ్చినట్టు
ఇప్పుడొచ్చింది డాంబర్ రోడ్డు
ఊరును వ్యాపారం జేద్దామని
మనుషులను ఆగం జేసి అంబుక్క వెడుదామని
ఎవనికెవడు ఆగకుంట జేద్దామని
మట్టి మీద జారి పడ్డవాడు
ఎప్పుడైనా బతికి తీరుతాడు
లోహపు దారెప్పుడూ నెత్తుటి దాహంతోనే పుంటది
పల్లెను పట్నం వలలోకి మలిపే మార్గమది
ఏ రూపంలో ఎపుడే శత్రువు వస్తడో ఎరుగని మాయదారి యిది
ఏ మృగాలు నడిచి వచ్చినా జాడదెలువనియ్యని దొంగ తొవ్వయింది
ఈ దారి నిండా కొత్త దోపిడీ దొంగలుంటరు
పైలమే నా తల్లి, పైలమే నా పల్లె












Click it and Unblock the Notifications