ఒద్దిరాజు కవిత దు:ఖ భాష

నెత్తుటి మరకలను మోసుకొచ్చిన
అక్షరం సాక్షిగా
అదెప్పుడూ గుర్తు తెలియని శవమే
ప్రేమ సంకేతాలు మోసిన
తెలంగాణ గుండె నిండా భయం బుగులు
విషాదం దు:ఖం విస్తరించి విస్తరించీ
నెగళ్లై కమ్ముకుంటున్నంతలోనే
గుండె మీదికి విసురుతున్న
వలసవాదపు నెత్తుటి పంజా
సమయం ఏదైనా కావొచ్చు
సందర్భం, సంక్లిష్టత పునరావృతం -
తలాపున నదులున్నా
పొలాల నవ్వులు నగుబాటైన వైనం
సమూహం కలల పంటకు
మసి పూసి ఇంటి దొంగలు
ఉడుకెత్తిన నెత్తుటి పొంగుకు
నెర్రెలు బారిన నేల ఇచ్చిన కౌగిలింత
నడిచిన అడుగులను విప్పి చూస్తే
ప్రాణం వదిలిన పచ్చి జ్ఞాపకం
కదలని స్తన్యం శరీరమో, శవమో
భయం గొలిపే చావు దు:ఖం
పిట్టకు పెట్టిన పిండాలను మోస్తున్న
తెలంగాణ పుండు మీద
ఆయుధ కౌగిలి పురిటి వాసన
- ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్












Click it and Unblock the Notifications