మబ్బుతున్క (కవిత)

లోతైన కనులలో
భవిష్యత్ ఆశల బావులు తోడుకుంటూ
గాయపడ్డ మబ్బుతున్క
కత్తుల చెలగాటంలో
ఉనికై జారుతున్నది
పేగు చుట్టూ కమ్మని పొరల
బంధాల పట్టుకొమ్మలు తెగి
దైన్యగీతాల సముద్రాలవుతున్నాయి
అణువణువూ ఆకలి ఆరాటం
అచ్ఛాదిత జ్ఝాపకాలై వెంటాడుతుంటే
దారి పాదాలకడ్డంగా
కాకులు, కుక్కలు పోటీ పడుతున్న బాల్యం
దెబ్బ తిన్న సలపరింపు బాధ
పాలరాతి అద్దాల మేడలకు
హైటెక్ కంప్యూటర్లకు
సంక్షేమ పథకాల కాగితప్పడవలకు
తేళ్లూ జెర్లూ పాకుతున్నట్గుగానే ఉంటుంది
ఎండకు ఎండి వానకు తడిసి
నీరసం ఆవరించుకున్న ముఖాన్ని
మోచేతిలో ముడుచుకుని
మోడు దేహంలో చిగురంత శ్వాస వూదుతూ
అర్థ నిమీలిత నేత్రాలతో
రేపటి రోజును కలవరిస్తుంటే
ఆ దోసిట్లో పంచ ప్రాణాలు పెట్టుకొని
దేశం -
కాంక్షిత ప్రభాతాల్ని నిరీక్షిస్తూ ఉంటుంది
- బెల్లంకొండ సంపత్ కుమార్












Click it and Unblock the Notifications