ఫ్లక్స్ కవిత 'మది'

రెక్కలున్న పక్షి స్వేచ్ఛను చూసి శాఖోపశాఖలతో వేళ్లూనుకున్న చెట్టు న్యూనతకు గురి అయింది. మొహం మాడ్చుకున్నది. కానీ ఆ పక్షి చెప్పింది, నీకూ రెక్కలున్నాయీ అని! గలగలమని సవ్వడి చేసే ఆకుల పదనిసలన్నీ ఏమిటనుకున్నావు? అంది. వాటితో నువ్వూ ఒక రోజు లేచిపోవచ్చు. నీ ప్రేమకు ప్రకృతి సహకరిస్తే గనుక వేళ్లూ నిన్ను గాలిపటంలా ఎగరేసే తాళ్లే అవుతాయి అంది. ఇదంతా నిజం. నమ్మండి. తర్వాత చూస్తే పక్షీ చెట్టూ రెండు లేవు.
సుదూరంగా పక్షి, దాని రెక్కలపై చెట్టు... అవి రెండూ చెట్టాపట్టాలేసుకుంటూ తుర్రుమని పోతున్నవి. ప్టటరాని ఆనందంతో గింగిరాలు కొడుతూ, గుట్టలుపుట్టలమ్మటి ఎగురుతూ ఉన్నయ్.
చెట్టు చెంత కాసేపు విశ్రమించాలని పోతే ఇదంతా జరిగింది.
ఇప్పుడక్కడ ప్రేమ చిహ్నంగా ఈ నాలుగు అక్షరాలురాసి ఆ కాగితాన్ని వదిలి వచ్చాను.
ఆ కాగితం ఇప్పుడు చెట్టైంది.
ఒక పక్షి ఎగురుతూ వచ్చి వాలింది.
- ఫ్లక్స్












Click it and Unblock the Notifications