కాలం ఒక జలపాతం

సందేహమే
కాలాన్ని తొక్కుతూ
దూరాన్ని దాటుతున్నామా?
మనిషి గుండె చెరుపుని ఒరుసుకుంటూ
కాల రుధిరం ప్రవహిస్తోందా?
ఒకే ఒక్క సందిగ్ధానికి
అనేకానేక సమాధానాలు
కాలం కరిగి
అంచుల వెంట గడ్డకడుతున్నప్పుడు
కొవ్వొత్తుల వెలుగుల జిగజిగలు-
నిట్టనిలువునా పట్టపగలే
రక్తతర్పణాలు జరుగుతున్నప్పుడు
అర్థరాత్రి హిప్పీ కేక్ కట్టింగులు-
గత వైఫల్యాల కురుపుల సలుపులు
దాచేందుకు
మత్తు మందు చీకట్లో లోకం-
నాలుగు పదుల
కాల చక్రభ్రమణాల్లో
వికసించని కలల పూలు.
కాలం నీ పెంపుడు కుక్క కాదు
నిద్ర పుచ్చడానికి -
కాలం నువ్వేసినన రహదారి కాదు
ఘటనల బారికేడ్లతో కొలవడానికి -
కాలం సగం కొరికి
ఆకాశవీధిలో నువ్వు పారేసిన రొట్టె ముక్క కాదు
ఆకారం రూపు దిద్దుకోవడానికి -
కాలం నీ ఆక్వేరియంలో చేప పిల్ల కాదు
గాలానికి గుచ్చి ఎగరేయడానికి-
కాలం ఒక జలపాతం
ఎగిసిపడే ఒక వాల్కెనో
అభావాన్ని
అభావం చేసే తీరుతుంది
అస్తిత్వం
ఆకారం పొందే తీరుతుంది
- డాక్టర్ కాసుల లింగారెడ్డి












Click it and Unblock the Notifications