తెలుగు కవిత: వృద్దాప్యం

వృద్దాప్యం కళ్ళకు -
మత్తగజాలై పరుగులెత్తే చోట
నత్తగుల్లలై, నత్తి నత్తి మాటలై
అఖాతం అట్టడుగులో
సడీ చప్పుడు లేని
కదలికలేని నీటిమూట
తేలిపోయిన తెల్లమబ్బులు
మూడు కాళ్ల తాబేలు
వంగిపోయిన బాణం
విరిగిపోయిన పట్టెమంచం
వర్తమానమిప్పుడు పండుటాకై పరవశిస్తుంది
మరగిన రక్తం ఆవిరై
మంచు ముద్దగా మారుతున్నక్రియ
ఉరకలెత్తిన విహంగం రెక్కలు
తడిసి జారిగిలపడిన సందర్భం
పొద్దుపొడుపుతో మొదలెట్టిన ప్రదర్శన
ముగింపు సాయం సంధ్యాసమయం
జలపాతం గొంతు మూగబోయి
వణుకుతున్న వీణ తీగల మీద విషాద గీతాలాపన
తావెక్కడో కానరాదు
గమ్యమెక్కడో దొరకదు
ఊబిలో దిగబడ్డ
చేతులు చాచిన దేహానికి
నేలమీద దిగ్గొట్టిన మేకుకు కట్టిన తాడు
కొన్నాళ్ళ కోసమైనా
తాడు దొరకాలి తాడు
- కందుకూరి శ్రీరాములు












Click it and Unblock the Notifications