నంద కిశోర్ కవిత: madness
దాచితే మోసం.
బతికితే హింస.
చస్తే పాపం.

1
అందమైన గూడే అల్లాను. ఆమెకోసం గిజిగాని గూడుకంటే అందమైన గూడే అల్లాను.
చీకటిలో పడుకోవడం అలవాటులేదని, కొంచెం మట్టిని అద్ది ఒకే ఒక్క మిణుగుర్ని అతికించిపొమ్మని బతిమాలింది.
నేను వినలేదు.
2
అందమైన కధే అల్లాను. ఆమెకోసం అమ్మచెప్పేవాటికంటే అందమైన కధే అల్లాను.
చీకటిలో పడుకోవడం అలవాటులేదని, కొంచెం సాయంకోసం ఒకే ఒక్క రాత్రి తనతో ఉండిపొమ్మని బతిమాలింది.
నేను వినలేదు.
3
కోసిన పువ్వులన్నీ, రాసిన కవితలన్నీ, ఎన్నాళ్ళుగానో ఆమెకోసం దాచిన పదునైన మాటలన్నీ పేర్చి- చివరకు..
ఆమెకోసమో, నాకోసమో- నేను పరుచుకునేదానికంటే తేలికైన దుప్పటే ఇచ్చాను.
చీకటిలో పడుకోవడం అలవాటులేదని, కొంచెం ధైర్యం చేసి ఒకే ఒక్క వేటుతో చంపిపొమ్మని బతిమాలింది.
నేను వినలేదు.












Click it and Unblock the Notifications