డర్టీ లేడీస్ అనబడే తల్లులు

ఆమె లేస్తుంది తప్పనిసరిగా పౌరబాధ్యతలను తలుచుకుంటూ
సూర్యుణ్ణి ఎవరుపిలుస్తున్నారని వస్తున్నాడు..అనుకుంటుంది
రెండుచేతులనూ విప్పి చాచి అరచేతులదిక్కు
ప్రేమగా, కృతజ్ఞతాపూర్వకంగా, గర్వంగా చూచుకుంటుంది
ఎందుకో ఆ క్షణం ఆమెలోకి
రాగితీగలోకి విద్యుత్తులా ఒక తృప్తి ప్రవహిస్తుంది
ఎర్రని ఫ్లోరసెంట్ రంగు పట్టీలున్న ఆప్రాన్ ను ధరించి
చేతిలో ఒక చీపురులో బయల్దేరుతుంది రోడ్లపైకి
ఇంకా లోకం నిద్రమత్తులో తూగుతూనేఉంటుంది బద్దకంగా..మత్తుగా
దట్టంగా మంచు కమ్మే శీతాకాలాల్లో
ఉషోదయపు చిరుజల్లుల వర్షాకాలాల్లో కూడా
రోడ్లు అలసి అలసి రాత్రంతా నిద్రలేక యాతనపడుతున్నపుడు
ఆమె తన చీపుళ్ళ చేతులతో వాటిని నిమురుతూ శుభ్రిస్తూంటుంది
ప్రక్కన మురుగుకాలువలు..చెత్త కుండీలు..గార్బేజ్ బిన్ లు
తల్లిపందిపైకి పిల్లకూనల్లా ఎగబడ్తూంటే
. . .శుభ్రం చేయాలి
ఈ చెత్తను,ఈ కంపును,ఈ చెదారాన్ని
వీధులను,మనుషులను,ఈ దేశాన్ని..శుభ్రంచేయాలి
ఆమెతోపాటే ఇంకొందరు అడుగులు అడుగులుగా కలిసి
సమూహమౌతారు..డర్టీ వర్కర్స్..దేవదూతల్లా
రోడ్లను పంచుకుని..వీధులను పంచుకుని
మనం నిస్సిగ్గుగా శేషించిన సకల వ్యర్థాలనూ శుభ్రిస్తూ
చేతులను బురదలోకి,ముక్కుమూసుకుని కంపులోకి,మురుగుకాలువల్లోకి చొప్పిస్తూ
భూమిని కాపాడే వరాహావతారాలో..కుష్టునుకూడా ముద్దాడే మథర్ థెరేసాలో ఔతూ
స్త్రీలుకదా..వాళ్ళు తల్లులు..పిల్లల ముడ్డికడిగినట్టు
సమాజాన్ని శుభ్రపరుస్తూ
ఏ తల్లిమాత్రం ఎక్కడ ఎప్పుడు గౌరవించబడ్డదని..అలాగే
వాళ్ళందరూ వేకువనే దైవదూతల్లా వచ్చి మనకొక ఆరోగ్య జీవితాన్ని దానంచేసి
సూర్యుడు ఇక వస్తూండగానే
యుద్ధానంతరం సైనికుల్లా నిశ్శబ్దంగా నిష్క్రమిస్తారు..పాపం డర్టీ లేడీస్
నాలుగో సింహంలా ఎవరికీ కనబడని అజ్ఞాతదేవతలు-
- రామా చంద్రమౌళి












Click it and Unblock the Notifications