కవిస్వరం: ఒక రాయి ఆత్మకథ
అన్వేషి అనే కవి రాసిన కవిత చదవగానే నాకు బోయ జంగయ్య రాసిన బొమ్మలు కథ గుర్తుకు వచ్చింది. రాళ్లు కొట్టుకు బతికే ఓ వ్యక్తి చేతుల మీదుగా ఓ రాయి ఎలా దైవంగా మారి, వ్యాపార చట్రంలోకి వెళ్లిపోయిందో ఆ కథ వివరిస్తుంది. ఆ కథ వస్తుపరంగానే కాకుండా శిల్పపరంగా కూడా అత్యున్నత ప్రమాణాలను సంతరించుకుంది.
ఒక రాయి ఆత్మకథ అంటూ అన్వేషి రాసిన కవిత కథనాత్మకంగానే ఉంటూ కవితాత్మకతను వ్యక్తీకరించింది. ఓ రాయి ఎలా దైవంగా రూపాంతరం చెందుతుందో ఇందులో అతను చక్కగా వివరించాడు. ఈ కవిత చదువుతుంటే - తెలుగునాట భక్తిరసం ఏరులై పారుతోంది, డ్రైనేజీ స్కీమ్ లేక డేంజర్‌గా మారుతోంది అని రాసిన గజ్జెల మల్లారెడ్డి కవిత కూడా రావడం యాదృచ్ఛికమేమీ కాదు. ఒక రాయి దైవంగా మారడమనేది ప్రజల మూఢవిశ్వాసాల స్థాయికి ప్రతీక. ఆ క్రమాన్నే అన్వేషి తన కవితలో చెప్పాడు.
ఆ క్రమాన్ని చెబుతూ వెళ్లే పనిలో భాగంగా వివిధ స్థాయిలకు చెందిన మనుషుల మనస్తత్వాలను, ఆర్థిక స్థాయిని బట్టి వారు వ్యవహరించే తీరును కూడా కవితలో చిత్రిక కట్టాడు. అయితే, దానికి ఓ చక్కని ముగింపు కూడా ఇచ్చాడు. భక్తి అనే మూఢవిశ్వాసం కారణంగా తాను ఊపిరాడకుండా వేసారుతున్నానని రాయి చెప్పుకోవడం ద్వారా హేతువాదాన్ని ముందుకు తీసుకుని వచ్చాడు. ఆ విధంగా దానికి ప్రగతిశీల దృక్పథాన్ని కల్పించాడు. మతం మత్తు మందు అని కారల్ మార్క్స్ ఎందుకున్నాడో ఈ కవిత చదివితే తప్పకుండా అర్థమైపోతుంది. అతి సరళంగా, కవితాత్మకంగా, మనసుకు తాకే విధంగా చెప్పడం కవి సాధించిన ప్రయోజనం.

- కాసుల ప్రతాపరెడ్డి
కొన్నిరోజుల క్రితంవరకు
నేనూ ఓ మామూలూ రాయినే...
నాగురించి ఎవరూ పట్టించుకోకుండా
నేనేవరినీ పట్టించుకోకుండా...
రాయిలా హాయిగా బ్రతికేసినోన్నే...
కొవ్వు కరిగించుకోవాలనుకునే
ఆశతో మార్నింగ్‌వాక్‌కి వచ్చేవాడో...
లేదంటే వాడి శరీరాన్ని లాక్కొస్తున్న
వాడి బొచ్చుకుక్కపిల్లో..
తనివితీరా నాకు స్నానం చేయించాక
తీరికగా ఎండతో తుడిచేసుకునేవాడిని...
ఒకరోజు ఒకడోచ్చాడు
ప్రపంచాన్ని మోస్తున్న హెర్క్యులస్ లా ఫోజిస్తూ
తాగుతూ...వాడితో వాడే వాగుతూ ..
వాడిదారికి అడ్డుతగిలానని నిందలేస్తున్నాడు
ఎవడు దారితప్పి నాపైకోచ్చాడని అడగాలనిపించినా
ఊరుకున్నాను...మనసుని రాయి చేసుకుని..
ఎవరిమీదో తెలియని అసహనాన్ని
నా మీద చూపించాడు..గట్టిగా తంతూ]
నేనూ అంతే వేగంగా సమాధానం చెప్పాను వాడికి
నాకేం కాలేదు...వాడికే
మెదడు చిట్లి ఒక ఎర్రటి ఆలోచన బైటకోచ్చింది
తిట్టుకుంటూ వాడెళ్ళిపోయినా..నాపై
తిలకమై మిగిలిపోయింది వాడి అసహనం కొద్దిగా
అదిచూసిన ఓ అమాయకురాలు ...అమ్మోరంటూ
నా మొహానింత పసుపుకుంకుమలు కొట్టి
నా నోట్లో ఒక అగరొత్తెట్టి వెలిగించింది ..
అంతే..
అమాయకత్వం నాదో వారిదో తెలిసేలోగా
అశేష జనవాహిని..అమ్మోరువెలిసిందంటూ
నా ముందు బారులు తీరడం మొదలెట్టేశారు
ఇపుడు నేను చైన్ స్మోకర్‌ని
విత్ 247 మేకప్పుతో..
సర్లే పర్లేదు అనుకునేలోగా
ఓ బడా నాయకుడి తేడా ఆలోచనతో
వాడి చోటా చెంచాలు
చందాలు వసూలు చేసి
గుడి కట్టేసారు
ఇపుడు నా పరిస్థితి మరీ ధుర్భరం
గాలి ఆడని గర్భగుడిలో ఉక్కపోసి చస్తుంటే
ఎవడో వాడి పాపాన్ని బంగారు తొడుగు చేసి
నన్ను పూర్తిగా కప్పేశాడు
అసలే పూజారి నిశ్వాసలతో
వేడెక్కిన్న గాలిని
పీల్చలేక సతమతమౌతుంటే
మధ్యమధ్యలో ప్రత్యేక అతిధుల
పరిమళాల కంపొకటి
ఒక మనిషి అసహనానికి
మరో మనిషి అమాయకత్వం తోడై
నన్ను నిజంగానే రాయిగా మార్చేశారు
ఈ ఆత్మఘోష ఇంకెన్నాళ్ళులే
వీళ్ళ కోరికలు వినీవినీ
చెవులు చచ్చిపోయినట్టే
వీళ్ళ పాపాలు తినీ తినీ
ఏదో ఒకరోజు మనసూ చచ్చిపోతుందిలే..
అన్వేషి.
10 ఆగస్టు 2014












Click it and Unblock the Notifications