కవిస్వరం: రవికుమార్ 'అదే కల'
రవి కుమార్ నల్లి చాలా చిన్న కవిత చెప్పారు. అయితే, సాంద్రత విషయంలో అతి దీర్ఘమైంది. రాత్రి అదే కల వచ్చిందంటూ ఆయన కలవరించారు. బాల్యపు అనుభూతిని ఆయన ఈ చిన్ని కవితలో బలంగా వ్యక్తీకరించారు. ఈ కవితలో పసిహృదయం కాంక్షలను వెల్లడిస్తూనే మానవ జీవితంలో ఓ చలసస్వభావం లక్షణం ఉండాలనే కోరికను ప్రతిఫలించారు.
వాన వచ్చినప్పుడు పారే నీటిలో కాగితప్పడవలా ఈదాలనుకోవడం, పల్చని పెంకు ముక్కయి కుప్పిగంతులు వేయాలని అనుకోవడం ఆ చలనశీలతకు సంబంధించిన అంశాలే. అయితే, నిర్జీవాల చలనశీలతకు ఆలవాలం వర్షం వల్ల పారే నీరు అయితే ప్రాణం ఉన్న జీవులకు స్వయం చలనశీలత ఉంటుంది. ఆ చలనశీలతకు చెందిన కోరికలు ఎలా ఉంటాయో కవి చెప్పాడు.
తాడు తెంపిన తర్వాత ఆవు పాలపొదుగు వద్దకు ఎంతటి ఆతురతతో, కోరికతో లేగదూడ పరుగులు తీస్తుందో అంతగా మనిషి చలనశీల కాంక్షను కలిగి ఉండాలని కూడా అతను కోరుకుంటున్నాడు. అలాగే, అలాగే తాత భుజాల మీద కూర్చుని తీర్థమెళ్తున్నట్లు కూడా ఉండాలని అంటాడు. ఇలా ఓ చలనశీల లక్షణాన్ని చాటుతూనే జీవితం అంత ఉల్లాసంగా, ఉత్సాహంగానే కాకుండా కాంక్షాపూరితంగా కూడా ఉండాలని కవి కోరుకుంటున్నాడు. ఆ కాంక్షలు ఆనందాలను వెదజల్లేవై స్వాభావికమైన ఉండాలని కూడా కవి ఆకాంక్ష.
- కాసుల ప్రతాపరెడ్డి

రాతిరి అదే కల !
నేను కాగితపు పడవనై
వాన నీట్లో ఈదుతున్నట్లు
పల్చని పెంకు ముక్కనై
కాల్వలో కప్పగంతులేస్తున్నట్లు
తాడు తెంపిన లేగదూడనై
పొదుగులో పాలు తాగుతున్నట్లు
తాత భుజాలమీద బుజ్జిగాడినై
తీర్ధమెలుతున్నట్లు....
ఈ రాత్రి కూడా
తప్పించుకోలేనేమో !!
- రవికుమార్ నల్లి
26 ఫిబ్రవరి 2015












Click it and Unblock the Notifications