కవిస్వరం: ఒరుగుతున్న ఆకాశం
నాకు కొంత అసంతృప్తిగా ఉంది. నేను కవిత్వాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నానేమో అని కూడా అనిపిస్తోంది. ఒరుగుతున్న ఆకాశం మృత్యువుకి దగ్గరవుతున్న వృద్ధులను ఉద్దేశించిందని గుర్తు పట్టడానికి నాకు సూచన కావాల్సి వచ్చింది. వృద్ధాశ్రమాలకు చేరుతున్న తల్లిదండ్రులను చూడడానికి వారంతాల్లో వచ్చే పిల్లల వద్ద జీవితంలో తడారిపోతున్నా గుండె లోపలి పొరల్లో ఇంకిపోని తండిని కవి తన ఊరుగుతున్న ఆకాశం కవితలో చిత్రిక కట్టాడు.
గతవారంలాగే ఈ వారం కవితను విశ్లేషించడంలో కొంత విఫలమయ్యాను. వారాంతాల్లో వచ్చే పొడిబారిన పలకరింపులు వృద్ధాశ్రమాల్లోని పెద్దల పిల్లలవే కావచ్చు. అందులో ప్రేమ పొడిబారిందని కవి ఉద్దేశించాడు. నది నెట్టేసిన చేపల్లా అని చెప్పడం ద్వారా సమాజమనే నది నుంచి వేరైనవారిగా వారిని ఉద్దేశించారు. జీవితం చరమాంకం కోసం ఎదురు చూస్తున్నవారు ఆ వృద్ధులు. ఏమైనా, మంచి కవిత. నా ఆలోచనకు అందనందకు కాస్తా చింతిస్తూ..
- కాసుల ప్రతాపరెడ్డి

- కాసుల ప్రతాపరెడ్డి
గుండె లోపలి పొరల్లో - ఇంకా
ఇంకిపోని - తడేదో అప్పుడప్పుడు
కంటి కొలకుల్లో - మంచు ముత్యమై
మెరుస్తుంది -
వారాంతాల్లో వచ్చే
పొడిబారిన పలరింపుల మధ్య
ఒడిలిన పెదాలపై - హరివిల్లొకటి
విరుగుతుంది -
నది నెట్టేసిన చేపల్లా
అమ్మ కనిపించని పాపల్లా
నిలువెల్లా మూర్తీభవించిన
స్తబ్ద చైతన్యాలు - వాళ్ళు
వెచ్చని వుదయాల్ని
నిర్వికారంగా చూస్తూ
ఒరుగుతున్న ఆకాశాన్ని
శ్రద్ధగా చదువుకుంటున్న
విద్యార్ధులు - వాళ్ళు -
చేరక తప్పని మజిలీ లో
గమ్యం జేర్చే రైలు కోసం
ఎదురు చూస్తున్న ప్రయాణీకులు - వాళ్ళు
నిజానికి
వాళ్ళని బ్రతికిస్తున్నది
గుప్పెడు మెతుకులు కాదు -
దాచుకున్న గతం లోంచి
తోడుకుని తాగుతున్న
గుక్కెడు జ్ఞాపకాలు మాత్రమే!!!
- శశిధర్ పింగళి












Click it and Unblock the Notifications