"ఆన్ ఎ మదర్స్ డే" అను వొక వచనము
వేడుకుంటాను కదా....
ఒక్క రొమ్ముకోసమూ, గుక్కెడు పాలకోసమూ
నేనొకన్నీ కాలచర్మధారినై
దెసలెల్లా ద్వేషించబడ్డవాడను...
అక్రిలిక్ రంగుల ఆత్మల చేత వెలివేయబడ్డవాడనూ అయి...
భుజాలపై నా అభేతాళ భౌతిక కాయాన్ని మోసుకొంటూ
తిరుగుతున్న వాన్నై
ఒకనాటికి అలసిపోయి..,ఆగిపోయీ
నిన్నొకనాడు అడిగి తీరుతాను.....
అమ్మీ...! అస్సల్ సమజైతలే
నేనవ్వరి సంజాతుడనో...
మరెవ్వరి సమ జాతీయుడనో
ఇంతకూ నువ్వు కన్నావా..., లేక నేను పుట్టానా.!?
ఎనీ బడీ దేర్...?
ఇట ఒక సమాధాన స్థాన ఖాళీ ని పూరించు వారెవరైననూ కలరా..??
కలడు కలడను వాడికోసమో మృత కలని కనీ

డూ యూ లవ్మీ మాం...!? నిజ్జంగా... పక్కా...
ఒక విశాస తీర్మానం పెట్టు... ఆమోదముద్రారాక్షసమొకటి కావలెనిప్పుడు
ఇపుడు కంటి రెటీనా మీది నాగలి చారికల్నిండా నిండిన
ఒకే ఒక దృశ్యం
జిగట జిగటగా మాయపేగు, శరీరమంతా కప్పుకుపోయిన రక్తపు పొర....
దీపప్పురుగు రెక్కల గర్భంలో
కదులుతున్న శిశువు....
ననుగన్న నాతల్లి... చెప్పు ఆ పిండమే దేశవాసి కానున్నది
ఏ మతాభిమతాన్ని బోడనెత్తి మీద మోయనున్నదీ...
పంచెకట్టునా... పంచముడౌనా??
ఆఫరాల్దిస్ షిట్టీ క్వషన్స్... చివరగా....
వాడిదేలోకం.... భూలోకమేనా..?
అక్కడా సరిహద్దుల గీతల తల్లులున్నారే తల్లి...
దేశమాతా, రాష్ట్రమాతా, ప్రాంతమాతా... మరి నువ్వెవరివి మాతా..!?
మా తాత కూతురివేనా...!?
సర్వ శోకాలనూ గర్భ కోశాన దాచి
ఏడ్పుల నిట్టూర్పులని మోసే మై డియర్ మదర్
తల్లీ...! అమ్మా...! ఓ స్త్రీ...!!
పలుకమ్మ పలుకు
అమ్మంటే కేవలం ఒక్క మనిషా.... ఒకే ఒక మహిళా....
సమస్త పురుషులనీ కన్న ఓ పవిత్ర యోనీ....! విశ్వమాతా....
ఇంతకీ నేనెవరి బిడ్డనీ...?
----- నరేష్కుమార్ సూఫీ












Click it and Unblock the Notifications