పరిమళం: మానవుడి హత్య

నువ్వు స్త్రీ దేహాల పరిమళం సేకరిస్తావు
కళంకితుడవు
నేర చరితుడవు
ఒక చీకటి తప్పిదవు స్వీయ రక్షణలో స్త్రీని కోల్పోయిన వాడివి
నిత్య దు:ఖితుడవు
స్త్రీ దు:ఖపు కన్నీటి పొరల్లోంచి లోకాన్ని దర్శించిన వాడివి
యువకుడా! మన్నిం-
స్రీల గాయాల అత్తరులో నీకు
తల మనకలూ, తల వంపులూ తప్పవు
నువ్వు విసిరిన మానవ పరిమళపు తెమ్మెరలో
లోకం వివస్త్రించి, ప్రేమించి, కామించి
మూర్చిల్లి సిగ్గుతో మేలుకొంటుంది
దేహపు అత్తరు
ఒక చుక్క చాలు
కసితో విసురు
కరుణతో చల్లు
మేము మా బొందల్లోంచి మేల్కొంటాం
కుటుంబాల్లోంచీ,
అందమైన గృహ కారాగాల్లోంచీ, కారాగృహాల్లోంచీ
జుగుప్సాకరపు వావి వరసల్లోంచీ
నిస్సహాయ ఆధిపత్యాల్లోంచీ
మత్తులో కళ్లు తెరుస్తాం-
చెరలు తప్పవు
మానవ పరిమళం తయారీలో
రహస్యాలూ, నిర్బంధాలూ, దు:ఖాలూ
లోకం మీద యేవగింపూ తప్పదు
ఆమె పాలిపోతున్న కాయంపై వంగి
కంపిస్తున్న చేతి వేళ్ళతో,
అదురుతున్న నాసికా పుటాల్తో
నెత్తురు యిగిరిపోతున్న
దేహాగ్రాల నుంచి చీకటి లోయల్లోకీ
చర్మపు వంపుల్లోకీ
నీ చూపులు తారాడుతున్నపుడు
ఏం గ్రహించావురా పశ్చాత్తాపపు
భయపు, దు:ఖపు దాహంతో-
రహస్యాన్వేషణ నిజం
చీకటి సౌందర్యం నిజం-
నిర్మల, కౌమార ప్రాణ తాపత్రయంలో యేం కనుగొన్నావ్-
శవాల్ని పూడ్చి, మనుషుల కోసం తల నరుక్కొంటున్నావ్-
నువ్ బహిరంగంగా విసిరిన ఆ
రహస్యపు అత్తరు చినుకుల్లో
తడిసిన వాళ్లూ
యింకా నీలాంటి వాళ్లూ
యెక్కడున్నారీ లోకంలో-
(‘పర్‌ఫ్యూమ్' సినిమా చూసి)
- అయిల సైదాచారి












Click it and Unblock the Notifications