చరిత్ర పుస్తకాల్లో లేని వింత ఆయుధం నిజ రూపం.. తేనెటీగల మైనంతో 163 కేజీల అస్త్రం
ప్రాచీన గ్రీక్, రోమన్ సామ్రాజ్యాల కాలంలో సముద్ర యుద్ధాల్లో శత్రువుల నావలను తుత్తునియలు చేయడానికి వాడే అత్యంత శక్తివంతమైన రాగి, తగరాల మిశ్రమ ఆయుధాన్ని (బ్రాంజ్ నావల్ రామ్) శాస్త్రవేత్తలు విజయవంతంగా పునఃసృష్టి చేశారు. దాదాపు 1500 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, పురాతన కాలపు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రయోగపూర్వకంగా ఈ ఆయుధాన్ని తయారు చేయడం గమనార్హం. క్రీ.శ. 500 వరకు అంటే దాదాపు వెయ్యేళ్ల పాటు మధ్యధరా సముద్ర పోరాటాల్లో శత్రు నౌకలను ముంచేయడానికి ఈ తరహా ఆయుధాలను యుద్ధనౌకల ముందు భాగంలో అమర్చేవారు.
ప్రయోగపూర్వక పరిశోధన.. ప్రాచీన పద్ధతుల వెలికితీత
'జర్నల్ ఆఫ్ ఆర్కియాలజికల్ సైన్స్' పత్రికలో ప్రచురితమైన కథనం ప్రకారం.. శతాబ్దాలుగా చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తల మధ్య ఈ ఆయుధం తయారీపై జరుగుతున్న సుదీర్ఘ చర్చకు ఈ పరిశోధన ద్వారా తెరపడింది. ప్రాచీన గ్రీకు, రోమన్ లోహ నిపుణులు, నౌకా నిర్మాణ కళాకారులు అనుసరించిన పద్ధతుల ఆధారంగా శాస్త్రవేత్తలు ఒక పూర్తి స్థాయి 'మూడు అంచుల' (త్రీ-బ్లేడెడ్) రామ్ మోడల్‌ను రూపొందించారు. నావ ముందు భాగాన్ని చెక్కతో డిజైన్ చేసి, దానిపై తేనెటీగల మైనంతో (బీస్‌వాక్స్) రూపాన్ని మలచి, ఆపై కరిగించిన రాగి మిశ్రమాన్ని పోసే లోహ పద్ధతిని వీరు అనుసరించారు.

తేనెటీగల మైనం.. రాగితో అద్భుత నిర్మాణం
ఈ ఆయుధాన్ని తయారు చేయడానికి శాస్త్రవేత్తలు 'డైరెక్ట్ లాస్ట్-వాక్స్ కాస్టింగ్' (Direct Lost-Wax Casting) విధానాన్ని ఎంచుకున్నారు. పూర్వకాలంలో విగ్రహాలు, బరువైన లోహ ఆయుధాల తయారీకి ఈ పద్ధతినే వాడేవారని నిర్ధారణ అయింది. ఈ ప్రయోగంలో రూపుదిద్దుకున్న ఆయుధం పొడవు 75 సెంటీమీటర్లు, ఎత్తు 67 సెంటీమీటర్లు, వెడల్పు 41.5 సెంటీమీటర్లు కాగా.. దీని మొత్తం బరువు ఏకంగా 163.52 కిలోగ్రాములుగా నమోదైంది. కేవలం మోడలింగ్ కోసమే సుమారు 20.41 కిలోల తేనెటీగల మైనాన్ని ఉపయోగించగా, ఆయుధం తయారీకి 90 శాతం రాగి, 10 శాతం తగరం మిశ్రమాన్ని వాడారు.
చారిత్రక ఆధారాలు.. ఆర్కియాలజీ మైలురాయి
గతంలో 1980లో ఇజ్రాయెల్ తీరంలో లభించిన 'అత్లిత్ రామ్' ఆధారంగా వీటి తయారీపై అధ్యయనాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా వివిధ తీర ప్రాంతాల్లో దాదాపు 32 మూడు అంచుల నావల్ రామ్‌లను గుర్తించారు. ఇందులో సిసిలీలోని గాడీ దీవుల వద్ద జరిగిన యుద్ధ ప్రాంగణంలోనే ఏకంగా 27 ఆయుధాల అవశేషాలు బయటపడగా, జర్మనీ, గ్రీస్, ఇటలీ తీరాల్లో మరికొన్ని లభించాయి. నాటి కాలంలో సాంకేతిక పరిజ్ఞానం, వాడిన ఇంధనం, పట్టిన శ్రమ, పట్టిన సమయాన్ని అర్థం చేసుకోవడానికి ఈ ప్రయోగం పరిశోధకులకు ఎంతగానో ఉపయోగపడింది.














Click it and Unblock the Notifications
