204 ఏళ్ల తర్వాత ప్రకృతే అవాక్కయ్యే వింత.. సీఎం సంచలన పోస్ట్
మన భూమి పొరల్లో, విస్తారమైన అడవుల్లో ప్రకృతి దాచి ఉంచిన వింతలు, విశేషాలు ఎన్నో! తాజాగా అస్సాం భూభాగంలో వెలుగుచూసిన కొన్ని అరుదైన ఆవిష్కరణలు అంతర్జాతీయ శాస్త్రవేత్తలతో పాటు పర్యావరణ వేత్తలను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. సరిగ్గా రెండు శతాబ్దాల (204 సంవత్సరాలు) కిందట జాడ లేకుండా పోయిందనుకున్న ఒక అరుదైన మొక్క మళ్లీ అస్సాం దట్టమైన అడవుల్లో ప్రత్యక్షమైంది. మరోవైపు గోపాల్‌పారా జిల్లాలోని సాధారణ మంచినీటి బావుల్లో ఏకంగా కళ్లు లేని అరుదైన ఎర్రటి చేప, పామును పోలిన ఈల్ చేపల కొత్త జాతులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ అరుదైన జీవవైవిధ్య విశేషాలను రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ప్రకృతి సంరక్షణ ఆవశ్యకతను గుర్తుచేశారు.
'ఆర్డిసియా కలరేటా' అని పిలిచే ఈ చిన్న పొద జాతి మొక్కను మొదటగా 1821లో వృక్షశాస్త్రజ్ఞులు గుర్తించి నమోదు చేశారు. అస్సాం నుంచి మైన్మార్ వరకు ఉండే పర్యావరణ ప్రాంతాల్లో ఇది సహజంగా పెరిగేది. అయితే, 1821 తర్వాత ఈ మొక్క ఎక్కడా కనిపించకపోవడంతో ఇది అంతరించిపోయిందని భావించారు. కానీ, ఏకంగా 204 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇది తన మాతృభూమి అయిన అస్సాం నేలపై చిగురించడం విశేషం. దట్టమైన అడవుల లోపల మానవ కంటికి కనిపించకుండా దాగి ఉన్న ఈ మొక్క, ఇప్పటికీ మన పర్యావరణ వ్యవస్థ సురక్షితంగా ఉందనడానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.

బావి చీకట్లలో 'కళ్లు లేని' అరుదైన ఎర్రటి చేప!
గోపాల్‌పారా జిల్లాలోని ఒక గ్రామంలో దాదాపు 6.7 మీటర్ల లోతు ఉన్న ఒక సాధారణ తాగునీటి బావిలో ఈ అద్భుతం వెలుగుచూసింది. శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో కంటికి కనిపించని 'గిట్చాక్ నకానా' అనే కొత్త రకం చిన్న చేపను గుర్తించారు. కేవలం రెండు సెంటీమీటర్ల పొడవు మాత్రమే ఉండే ఈ చేపకు బయటకు కనిపించే కళ్లు ఉండవు. చర్మం కింద చిన్న నల్లటి చుక్క మాత్రమే ఉంటుంది. శరీరంపై ఎటువంటి రంగులు లేకపోవడంతో దీని శరీరం రక్తపు రంగులో మెరిసిపోతుంటుంది. చీకటి నీటిలో ఈదులాడటానికి దీనికి పొడవాటి మీసాల వంటి ఉపకరణాలు తోడ్పడతాయి. అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఈ చేప మెదడుపై పుర్రె ఎముక ఉండదు, కేవలం చర్మం మాత్రమే కప్పి ఉంటుంది. డిఎన్ఏ పరిశోధనల ప్రకారం ఈ చేపల వంశావళి దాదాపు 2.1 కోట్ల నుంచి 4.5 కోట్ల సంవత్సరాల క్రితమే ఇతర చేపల నుంచి వేరుపడిందని తేలింది. స్థానిక గారో భాషలో 'గిట్చాక్' అంటే ఎరుపు, 'నకానా' అంటే గుడ్డి చేప అని అర్థం.
Lost for 204 years. Rediscovered in Assam. And below ground, two species new to science.The return of the shrub , Ardisia colorata, and the discovery of subterranean fishes , Gitchak nakana and Rakthamichthys anchi , in Goalpara's wells show what Assam's forests and waters still hold.Protect the home, and the species come back. Stronger environmental governance and habitat conservation remain our commitment, for every species, for generations to come.
— Himanta Biswa Sarma (@himantabiswa) October 22, 2026
పామును పోలిన నీటి ఈల్.. భూగర్భ జలాల రహస్యం!
అదే గ్రామానికి చెందిన బావుల్లోనే శాస్త్రవేత్తలు మరో కొత్త రకం జీవిని కూడా కనుగొన్నారు. 'రక్తమిచ్థిస్ అంచి' అని పిలిచే ఈ జీవి పాము ఆకారంలో ఉండే ఒక రకమైన 'స్వాంప్ ఈల్' చేప. పశ్చిమ కనుమల్లో ఉండే దాని సంబంధిత జాతుల కంటే దీని వెన్నుపూసల నిర్మాణం , డిఎన్ఏ క్రమం పూర్తిగా భిన్నంగా ఉన్నట్లు శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. ఈ రెండు రకాల చేపలు భూగర్భంలో ఉండే నదులు, రాతి పొరల్లో మాత్రమే జీవించగలవు (యాక్విఫర్ జీవులు). ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన భూగర్భ చేపల్లో ఇలాంటి నదీతీర రాతి పొరల్లో జీవించేవి 10 శాతం కంటే తక్కువగా ఉండటం ఈ ఆవిష్కరణ ప్రాధాన్యతను పెంచుతోంది.
భూగర్భ జలాల రక్షణే ధ్యేయం!
ఈ అరుదైన జీవులను వేటగాళ్ల నుంచి, ప్రయోగాల ముప్పు నుంచి కాపాడేందుకు శాస్త్రవేత్తలు ఆ గ్రామం పేరును రహస్యంగా ఉంచారు. మన కాళ్ల కింద ఉండే భూగర్భ జలాలు ఎంత సున్నితమైనవో, అందులో ఎంత అద్భుతమైన జీవజాలం నివసిస్తుందో ఈ పరిశోధన నిరూపించింది. మనం బావుల్లోకి లేదా భూమిలోకి వదిలే వ్యర్థాలు ఈ అరుదైన జీవుల మనుగడను ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది. "ప్రకృతి ప్రసాదించిన నివాస ప్రాంతాలను మనం కాపాడుకుంటే, అంతరించిపోయాయనుకున్న అరుదైన జాతులు మళ్లీ మన ముందుకు వస్తాయి" అని అస్సాం ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. అటు దట్టమైన అడవులు, ఇటు చీకటి భూగర్భ జలాలు.. రెండూ మన జీవవైవిధ్యానికి అమూల్యమైన నిధులని ఈ ఆవిష్కరణలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి.














Click it and Unblock the Notifications
