2024 YR4: ఆ రోజు ఆకాశం మారిపోతుందా? చంద్రుడిని ఢీ కొట్టనున్న గ్రహ శకలం!
రాత్రి ఆకాశంలో ప్రశాంతంగా మెరిసే చంద్రుడు... ఒక్కసారిగా సూర్యుడిలా ప్రకాశిస్తే? ఆ వెలుగు చూసి భూమిపై కోట్ల మంది ఉలిక్కిపడితే? ఇది సైన్స్ ఫిక్షన్ కాదు... శాస్త్రవేత్తలే హెచ్చరిస్తున్న అసాధారణ ఖగోళ ఘటన!
చంద్రుడిని ఢీకొట్టే ప్రమాదం ఉన్న '2024 YR4' అనే గ్రహశకలంపై ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు నిశితంగా దృష్టి సారించారు. భూమికి నేరుగా ఎలాంటి ముప్పు లేదని నాసా స్పష్టం చేసినప్పటికీ, 2032లో చంద్రుడిపై ఈ గ్రహశకలం పడితే.. భూమిపై తీవ్ర ప్రభావాలు కనిపించే అవకాశముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటన ఖగోళ విజ్ఞాన చరిత్రలో అరుదైన శాస్త్రీయ అవకాశాన్ని అందించడమే కాకుండా, భూమి-చంద్ర వ్యవస్థపై విలువైన సమాచారం అందించనుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ఈ గ్రహశకలాన్ని 2024 డిసెంబర్ 27న గుర్తించారు. తొలుత ఇది భూమిని ఢీకొట్టే రికార్డు స్థాయి సంభావ్యతను కలిగి ఉందన్న అంచనాలతో శాస్త్రవేత్తల్లో ఆందోళన నెలకొంది. అయితే, తరువాతి పరిశీలనలతో 2032 డిసెంబర్ 22న భూమిని ఢీ కొట్టే ప్రమాదం లేదని స్పష్టమైంది. ప్రస్తుతం నాసా అంచనాల ప్రకారం, ఈ గ్రహశకలం చంద్రుడిని ఢీకొట్టే అవకాశం 4.3 శాతంగా ఉంది.
ప్రీ ప్రింట్ సర్వర్ లో 2024 YR4..
ఈ అంశంపై 2025లో arXiv ప్రీ ప్రింట్ సర్వర్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం, చంద్రుడిపై ఈ గ్రహశకలం పడితే జరిగే పరిణామాలను విశ్లేషించింది. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం (శాంటా క్రూజ్)కు చెందిన శాస్త్రవేత్త యిఫే జియావో నేతృత్వంలోని బృందం, దీనిని "అంచనా వేయగల అంతరిక్ష ఘర్షణను అధ్యయనం చేయడానికి లభించిన అరుదైన అవకాశం"గా పేర్కొంది.
పరిశోధకులు సూర్యుడు, గ్రహాలు, భూమి, చంద్రుడి గురుత్వాకర్షణ ప్రభావాలను పరిగణనలోకి తీసుకుంటూ దాదాపు 10 వేల కంప్యూటర్ సిమ్యులేషన్‌లు నిర్వహించారు. వాటి ఆధారంగా, ఈ గ్రహశకలం చంద్రుడి ఉపరితలంపై సుమారు 3,000 కిలోమీటర్ల విస్తీర్ణంలో, టైకో క్రేటర్‌కు ఉత్తరంగా పడే అవకాశం ఉందని అంచనా వేశారు.
6.5 మిలియన్ టన్నుల బరువు..
ఈ ఢీ సుమారు 6.5 మిలియన్ టన్నుల TNTకి సమానమైన శక్తిని విడుదల చేయగలదని పరిశోధకులు తెలిపారు. ప్రభావ సమయంలో శుక్రగ్రహం వలె ప్రకాశవంతమైన కాంతి ఉత్పత్తి అవుతుందని, అది 200 నుంచి 300 సెకన్ల వరకు కనిపించవచ్చని అంచనా. ఈ ఘటన తూర్పు ఆసియా, ఓషియానియా, హవాయి, పశ్చిమ ఉత్తర అమెరికా ప్రాంతాల నుంచి స్పష్టంగా దర్శనమివ్వవచ్చని చెప్పారు.
అయితే, ఆ రోజు చంద్రుడు సుమారు 70 శాతం కాంతివంతంగా ఉండటం వల్ల ప్రభావం చంద్రుడి చీకటి వైపున జరిగే అవకాశం కేవలం 2.85 శాతం మాత్రమేనని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయినప్పటికీ, ఎక్కడ జరిగినా ఈ ప్రకాశాన్ని సాధారణ టెలిస్కోపుల సహాయంతో సైతం గమనించవచ్చని తెలిపారు.
భూమి దిశగా కదిలి...
చంద్రుడిపై జరిగే ఈ ఘర్షణ వల్ల వేలాది ద్వితీయ కణాలు ఏర్పడి, వాటిలో కొంత భాగం భూమి వైపు ప్రయాణించే అవకాశం ఉందని అధ్యయనం పేర్కొంది. దాదాపు 100 మిలియన్ కిలోగ్రాముల చంద్ర పదార్థం భూమి దిశగా కదిలి, ప్రభావం జరిగిన రోజుల నుంచి వారాల మధ్య కాలంలో తీవ్రమైన ఉల్కాపాతాలకు కారణమవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వీటిని వారు "సూపర్ ఉల్కాపాతాలు"గా అభివర్ణించారు.
ఈ సంఘటన ఖచ్చితంగా జరుగుతుందో లేదో ఇప్పుడే చెప్పలేమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ, ఇలాంటి ఘటన ఖగోళ ప్రభావ సిద్ధాంతాలను పరీక్షించడానికి, భవిష్యత్తులో భూమికి ఎదురయ్యే ప్రమాదాలను అంచనా వేయడానికి కీలకంగా ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు. అందుకే, 2024 YR4 కదలికలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని నాసా సహా అంతర్జాతీయ అంతరిక్ష సంస్థలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications