AK 203: ఆర్మీని శాసించబోతున్న షేర్ గన్, నిమిషానికి 700 రౌండ్ల ఫైరింగ్
భారత రక్షణ రంగం ఆత్మనిర్భర్ భారత్ దిశగా మరో చారిత్రాత్మక మైలురాయిని దాటింది. మన దేశంలోనే నూటికి నూరు శాతం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన 'ఎకే-203 షేర్' అస్సాల్ట్ రైఫిల్ తొలి ప్రయోగం అత్యంత విజయవంతమైంది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ఉన్న కోర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఆగస్టు 23న నిర్వహించిన ఈ పరీక్షల్లో భారత్‌లో తయారైన భాగాలతో కూడిన తుపాకీ సత్తా చాటింది.
ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూపొందిన ఈ రైఫిల్, బరస్ట్ ఫైరింగ్‌తో సహా అన్ని రకాల ప్రయోగాల్లో అత్యుత్తమ పనితీరును కనబరిచింది. రష్యా సాంకేతికతతో ప్రారంభమైనా, ఇప్పుడు ప్రతీ చిన్న విడిభాగాన్ని మన దేశీ పరిశ్రమల నుంచే సేకరించి తయారు చేయడం గమనార్హం.

సెప్టెంబర్‌లో ఆర్మీ ట్రయల్స్.. 6 లక్షల తుపాకుల తయారీకి ప్లాన్!
ఈ విజయవంతమైన పరీక్షల అనంతరం, ఆర్మీ ట్రయల్స్ కోసం అవసరమైన నమూనాలను సిద్దం చేసే పనిలో సంస్థ నిమగ్నమైంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఈ పూర్తి స్వదేశీ తుపాకులను భారత సైన్యానికి పరీక్షల నిమిత్తం అప్పగించనున్నారు. సైన్యం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే భారీ స్థాయిలో వీటి ఉత్పత్తి ప్రారంభమవుతుంది.
#ShadowsAndSteel
— ADG PI - INDIAN ARMY (@adgpi) November 23, 2025
In the Shadows, only Steel tells the Truth
Hear The Sher (AK-203) Roar - India’s new signature sound
Atmanirbhar Steel, Crafted in India
Tactical #ASMR pic.twitter.com/HZZA1lK0jv
2032 నాటికి దాదాపు 6 లక్షలకు పైగా ఈ అధునాతన రైఫిళ్లను భారత సైన్యానికి అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకప్పుడు విదేశాల నుంచి విడిభాగాలను తెప్పించుకుని అసెంబుల్ చేసే స్థాయి నుంచి, ఈరోజు వంద శాతం మన సొంత వనరులతోనే రైఫిల్‌ను తయారు చేసే స్థాయికి భారత్ ఎదగడం విశేషం.
పాత ఇన్సాస్‌కు గుడ్ బై.. సైనికుల చేతికి తిరుగులేని ఆయుధం!
గత కొన్ని దశాబ్దాలుగా మన ఆర్మీ ఉపయోగిస్తున్న 'ఇన్సాస్' రైఫిళ్ల స్థానంలో ఈ ఎకే-203 షేర్ కొలువుతీరనుంది. ఇన్సాస్ తుపాకీ బరువు 4.15 కేజీలు ఉండగా, ఎకే-203 కేవలం 3.6 కేజీల బరువుతో చాలా తేలికగా ఉంటుంది. ఇన్సాస్ 5.56 ఎంఎం క్యాట్రిడ్జ్‌లను వాడితే, ఎకే-203 ఏకంగా 7.62×39 ఎంఎం బులెట్స్ ను వాడుతుంది. దీనివల్ల శత్రువుపై దెబ్బ చాలా తీవ్రంగా ఉంటుంది. నిమిషానికి 700 రౌండ్ల కాల్పులు జరపగలగడం, 800 మీటర్ల సుదూర లక్ష్యాలను కూడా సులువుగా ఛేదించగలగడం దీని ప్రత్యేకత. అత్యంత మంచు కురిసే చలి వాతావరణంలో కూడా ఇది ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా పనిచేస్తుంది.
సైన్యానికి తిరుగులేని బలం.. దేశీయ పరిశ్రమలకు ఊతం!
ఈ ప్రాజెక్టు కేవలం సైన్యానికి ఆధునిక ఆయుధాన్ని అందించడమే కాకుండా, దేశీయంగా ఒక బలమైన రక్షణ తయారీ వ్యవస్థను నిలబెట్టింది. భారతీయ పరిశ్రమలు రక్షణ రంగానికి కావలసిన అత్యున్నత ప్రమాణాలు కలిగిన లోహాలు, పరికరాలను తయారు చేయగలవని ఈ విజయం నిరూపించింది. రాబోయే రోజుల్లో సెప్టెంబర్ ఆర్మీ ట్రయల్స్ గనుక విజయవంతంగా పూర్తయితే, భారత్ ఇకపై చిన్న తరహా ఆయుధాల కోసం ఏ ఇతర దేశం వైపూ చూడాల్సిన అవసరం ఉండదు. స్వదేశీ సత్తాతో సరిహద్దుల్లో శత్రువుల గుండెల్లో నిద్రపోవడానికి 'షేర్' పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది.














Click it and Unblock the Notifications