అత్యంత తేజోమయంగా వెలిగిపోనున్న ఆ గ్రహం: నేరుగా చూసే అద్భుత అవకాశం
ఖగోళ ప్రేమికులకు ఈ నెల 18.. ఓ ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోనుంది. మన సౌర కుటుంబంలో అత్యంత ప్రకాశవంతమైన శుక్ర గ్రహం (వీనస్) ఆ రోజున ఆకాశంలో మరింత ధగధగలాడుతూ కనిపించనుంది. ఈ ఏడాది ఈ ప్లానెట్.. అత్యంత గరిష్ఠస్థాయిలో ప్రకాశించబోతోంది. దీన్ని పీక్ బ్రిలియన్స్ గా పిలుస్తారు. ఎటువంటి ప్రత్యేక పరికరాలు లేకుండా నేరుగా ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించే అపూర్వ అవకాశం స్కైగేజర్లకు కలగబోతోంది.
18న సూర్యాస్తమయం అయిన వెంటనే పడమటి దిశగా ఆకాశం వైపు చూస్తే ప్రకాశవంతంగా కనిపిస్తుందీ శుక్రగ్రహం. పడమటి దిగంతానికి హారిజన్ కొద్దిగా పైభాగంలో ఈ గ్రహం వెలిగిపోతుంటుంది. చుట్టుపక్కల ఉండే సాధారణ నక్షత్రాల కంటే ఇది ఎంతో భిన్నంగా, అత్యంత తేజోవంతంగా వెలుగుతూ ఆకట్టుకుంటుంది. పశ్చిమ దిశ స్పష్టంగా కనిపించే మైదాన ప్రాంతాలు లేదా టెర్రస్ పై నుంచి దీనిని మరింత స్పష్టంగా చూడొచ్చు.

భూమికి అత్యంత సమీపంలో ఉండటం, శుక్రుడి వాతావరణంలో ఉండే అతి దట్టమైన కార్బన్ డయాక్సైడ్ మేఘాలు సూర్యకాంతిని పరావర్తనం చెందిస్తాయి. అందుకే సాధారణంగానే వీనస్.. మిగిలిన అన్ని గ్రహాల కంటే కూడా ప్రకాశవంతంగా ఉంటుంది. చంద్రుడి తర్వాత అత్యంత కాంతివంతంగా కనిపించే ఏకైక ఆబ్జెక్ట్ కూడా ఇదే. గ్రహాలేవీ కూడా స్వయం ప్రకాశితులు కావు. సూర్యకాంతి ప్రతిబింబం వల్ల ఇదొ భారీ నక్షత్రంలా మెరుస్తూ కనిపిస్తుంది.
భూకక్ష్యకు లోపలి భాగంలో ఉండటం వల్ల ఇది అర్ధరాత్రి పూట ఆకాశంలో కనిపించదు. సూర్యాస్తమయం తర్వాత లేదా సూర్యోదయానికి ముందు మాత్రమే దర్శనం ఇస్తుంది. దీంతో పాటు ఖగోళ ప్రియులను అలరించడానికి మరికొన్ని అంతరిక్ష సంఘటనలు కూడా చోటు చేసుకోనున్నాయి ఈ నెలలో. 19న ఇంటర్నేషనల్ అబ్జర్వ్ ది మూన్ నైట్ నిర్వహిస్తారు. చంద్రుడి విశేషాలను క్షుణ్ణంగా తెలుసుకోవడానికి, భూమికి అత్యంత సమీపంలో ఉన్న మన పొరుగు ఉపగ్రహం గురించి అవగాహన పెంచుకోవడానికి నాసా ప్రతి ఏటా దీన్ని నిర్వహిస్తుంటుంది.
ఈ నెల 22న ఈక్వినాక్స్ సంభవిస్తుంది. భూమిపై పగలు, రాత్రి సమయాలు దాదాపు సమానంగా ఉంటాయి ఈ రోజున. ఈ మార్పుతో ఉత్తరార్ధగోళంలో శరదృతువు ప్రారంభం కాగా, దక్షిణార్ధగోళంలో వసంత కాలం అడుగుపెడుతుంది. 26న పున్నమి చంద్రుడు శని గ్రహానికి అత్యంత సమీపంగా రానున్నాడు. దీన్ని కూడా ఎటువంటి పరికరాలు లేకుండా నేరుగా చూడొచ్చు. శని గ్రహం ఒక చుక్కలా కనిపిస్తుందా సమయంలో. దానికి ఆనుకుని ఉండే నెప్ట్యూన్ గ్రహాన్ని కూడా వీక్షించాలనుకునే వారు మాత్రం బైనాక్యులర్స్, టెలిస్కోప్స్ వంటి పరికరాలు వాడాలి.













Click it and Unblock the Notifications
