నెప్ట్యూన్ కు అవతల అద్భుత మంచు ప్రపంచం
అంతరిక్ష పరిశోధనల్లో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. విశ్వంలోని అత్యంత సుదూర పొరల్లో ఉండే రహస్యాలను శోధించడానికి నాసాకు చెందిన హబుల్, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ మొదటిసారిగా కలిసి పనిచేశాయి. సౌర కుటుంబం అంచున.. నెప్ట్యూన్ గ్రహానికి అవతల ఉన్న కటిక చీకటిని ఛేదించాయి. అక్కడి రహస్యాలను వెలుగులోకి తెచ్చాయి. ఈ ఉమ్మడి పరిశోధన సందర్భంగా.. గతంలో ఎన్నడూ గుర్తించని 27 నూతన ట్రాన్స్-నెప్ట్యూనియన్ ఆబ్జెక్ట్స్ అనే మంచు ప్రపంచాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ఈ సుదూర గ్రహశకలాల ఆవిష్కరణ.. మన సౌర కుటుంబం ఏర్పడిన ప్రారంభ రోజుల గురించి తెలుసుకోవడానికి ఓ సువర్ణావకాశాన్ని కల్పించినట్టయిందని నాసా తెలిపింది. నెప్ట్యూన్ అవతల ఉండే వాతావరణంలో చీకటి ఆవరించుకుని ఉండటం, సూర్యకిరణాలు ఏ మాత్రం ప్రసరించని కారణంగా ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీల్లో ఉండటం వంటి పరిణామాల వల్ల ఇక్కడ ఉండే గ్రహాలు అంత తేలిగ్గా టెలిస్కోప్ కంటికి చిక్కవు.

భూమి నుండి కనిపించే ఓ సాధారణ నక్షత్రం కంటే దాదాపు 100 మిలియన్ల రెట్లు తక్కువ కాంతితో ఉంటాయి. అందువల్ల అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్, దానికి తగ్గ టెక్నాలజీ ఉంటే తప్ప వీటి ఉనికిని పసిగట్టడం సాధ్యం కాదు. అందుకే.. నెప్ట్యూన్ కు అవతల ఉన్న ప్రపంచాన్ని గురించి పరిశోధించడానికి నాసా హాబుల్ టెలిస్కోప్ ను అటువైపు ట్యూన్ చేసింది. జేమ్స్ వెబ్ తో కలిసి జాయింట్ గా ఈ 27 ఫ్రొజెన్ ప్లానెట్స్ ఉనికి మొదటిసారిగా గుర్తించింది.
ఇందులో భాగంగా నాసా శాస్త్రవేత్తలు హబుల్ టెలిస్కోప్, జేమ్స్ వెబ్ అందించిన ఇన్‌ఫ్రారెడ్ కిరణాల డేటాను విశ్లేషించారు. వీటి ద్వారా ఆ సుదూర మంచు లోకాల రంగులు, వాటి ద్రవ్యరాశి, రసాయన కాంపోజిషన్, కక్ష్యల విధానాన్ని ఖచ్చితంగా లెక్కించారు. బిలియన్ల సంవత్సరాల క్రితం సూర్యుడి చుట్టూ ఉన్న చిన్న ధూళి కణాలు కలిసి గ్రహాలుగా పరిణామం చెందే క్రమంలో మిగిలిపోయిన పురాతన శిలాజాలుగా నిర్ధారించారు.
ఈ ప్లానెట్లను రెండు రకాలుగా వర్గీకరించారు. మొదటివి.. కోట్ల సంవత్సరాలుగా స్థిరమైన వృత్తాకార కక్ష్యలలో తిరుగుతున్న కోల్డ్ ట్రాన్స్-నెప్ట్యూనియన్ ఆబ్జెక్ట్స్, రెండోవి భారీ గ్రహాల మైగ్రేట్ కారణంగా కక్ష్య నుంచి బయటికి వచ్చిన హాట్ ట్రాన్స్-నెప్ట్యూనియన్ ఆబ్జెక్ట్స్ గా విభజించారు. విశ్వంలో జరిగే అంతర్గత మార్పుల వల్ల సాధారణంగా గ్రహశకలాల రూపురేఖలు మారిపోవడం సహజం.
ఈ చిన్న చిన్న శకలాలు కూడా పెద్ద వస్తువుల తరహాలోనే ఒకే విధమైన రంగులను కలిగి ఉండి, తమ ఆదిమ రూపాన్ని కోల్పోకుండా అలాగే ఉండిపోయినట్లు తేలింది. తాజాగా గుర్తించిన ఈ మంచు ఖండాల విస్తీర్ణం.. అయిదు కిలోమీటర్లు మాత్రమే. భూమిపై ఉండే శక్తిమంతమైన టెలిస్కోపుల పరిధికి కూడా ఇది అందదు.
వీటిని చిన్న మిణుగురు పురుగుల సమాహారంగా అభివర్ణించారు. విశ్వం ఆవిర్భావ సిద్ధాంతాల అంచనాలతో పోలిస్తే ఇక్కడ లభించిన గ్రహశకలాల సంఖ్య చాలా తక్కువగా ఉండడం పరిశోధకులను విస్మయానికి గురిచేసింది. సౌర కుటుంబం ఏర్పడే క్రమంలో విశ్వంలో గ్రహశకలాలు ఎలా రూపాంతరం చెందాయన్న సిద్ధాంతాలకు ఇది ఓ సవాల్ ను విసిరినట్టయింది. కాలానికి అతీతంగా మిగిలిపోయిన ఈ మంచు శకలాలు.. భూమి అలాగే ఇతర అనుకూల గ్రహాల ఆవిర్భావ చరిత్రను మార్చే నూతన రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయనున్నాయి.















Click it and Unblock the Notifications
