బాత్ రూమ్ లో కోహ్లీ ఏడవటం చూశా
Yuzvendra Chahal: భారత క్రికెట్ జట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్.. గతాన్ని గుర్తు చేసుకున్నారు. టీమిండియా సీనియర్ ప్లేయర్ల వ్యవహారాల గురించి వివరించారు. వారితో తనకు ఉన్న సాన్నహిత్యం గురించి ప్రస్తావించారు. జట్టులో ఎప్పుడూ స్నేహపూరక వాతావరణం ఉండేదని చెప్పుకొచ్చారు.
ఫిగరింగ్ అవుట్ విత్ రాజ్ షమాని పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు చాహల్. అనేక విషయాలను వెల్లడించారు. స్పోర్ట్స్ అనలిస్ట్ రాజ్ షమానీకి ఇచ్చిన ఇంటర్వ్యూ అది. ప్రత్యేకించి- ఇంగ్లాండ్ వేదికగా జరిగిన 2019 ఐసీసీ వరల్డ్ కప్ అనుభవాలను ప్రస్తావించాడు. మాంఛెస్టర్ స్టేడియంలో న్యూజిలాండ్ తో జరిగిన సెమీ ఫైనల్స్ లో ఓడిపోవడాన్ని అత్యంత బాధాకరమైన సందర్భంగా అభివర్ణించాడు.

న్యూజిలాండ్ చేతిలో ఓటమి తర్వాత ఇండియాన్ క్యాంప్, డ్రెస్సింగ్ రూమ్ లో విషాదకర వాతావరణం నెలకొందని, ప్లేయర్లతో పాటు హెడ్ కోచ్, అసిస్టెంట్ కోచ్ లు, ఇతర సపోర్టింగ్ స్టాఫ్ అంతా విషాదంలో కనిపించారని యుజ్వేంద్ర చాహల్ చెప్పాడు. గెలుస్తుందనుకున్న మ్యాచ్ ఓడిపోవడం షాక్ కు గురి చేసిందని పేర్కొన్నాడు.
ఓటమి తర్వాత.. విరాట్ కోహ్లీ.. బాత్ రూమ్ లో ఏడ్చాడని యుజ్వేంద్ర చాహల్ చెప్పాడు. ఒక్క కోహ్లీ మాత్రమే కాకుండా.. రోహిత్ శర్మ, ఇతర ప్లేయర్లందరూ కన్నీరు పెట్టుకున్నారని అన్నాడు. విరాట్ కోహ్లీతో పాటు చాలా మంది భారత ఆటగాళ్లు బాత్ రూమ్ లలో ఏడ్చిన సంఘటన తనకు బాగా గుర్తుందని చెప్పాడు.
మాంచెస్టర్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో.. రిజర్వ్ డే రోజున భారత్ 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. 240 పరుగులు చేయాల్సిన దశలో టీమిండియా బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. ఈ ఓటమి జట్టు సభ్యులను తీవ్రంగా కలచివేసింది. వర్షం వల్ల అంతరాయం కలిగిన మ్యాచ్ ఇది.
తొలుత బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నస్టానికి 239 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్.. దాన్ని అందుకోలేకపోయింది. 49.3 ఓవర్లల్లో 221 పరుగులకు ఆలౌట్ అయింది. మహేంద్ర సింగ్ ధోనీ 50 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. మార్టిన్ గప్టిల్ అద్భుతమైన త్రోకు అతను పెవిలియన్ దారి పట్టాడు. రవీంద్ర జడేజా 77 పరుగులు కొట్టాడు.
ఈ మ్యాచ్ ఆడిన జట్టులో చాహల్ సభ్యుడు. 2019 ప్రపంచ కప్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్ ఓటమి విరాట్ కోహ్లీని ఆవేదనకు గురి చేసింది. బాత్ రూమ్ లో అతను ఏడవటం చూశాను. చివరి బ్యాటర్ గా నేను క్రాస్ చేస్తున్నప్పుడు అతని కళ్ళలో నీళ్లు కనిపించాయి. ఆ సమయంలో అందరూ బాత్ రూమ్ లల్లో ఏడిచారు.. అని చాహల్ ఆవేదన వ్యక్తం చేశాడు.
కోహ్లీ ఆ టోర్నమెంట్‌లో అద్భుతంగా రాణించినప్పటికీ.. సెమీ ఫైనల్ లో విఫలం అయ్యాడు. ఒక పరుగే కొట్టాడు. న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ వేసిన బంతికి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఇది అతనికి తీవ్ర నిరాశ కలిగించిందని చాహల్ పేర్కొన్నాడు. ఆ మ్యాచ్ లో చాహల్ 10 ఓవర్లలో 63 పరుగులు ఇచ్చి.. కేన్ విలియమ్సన్ వికెట్ మాత్రమే తీయగలిగాడు.












Click it and Unblock the Notifications