టీమిండియాకు కీలక ఆదేశాలు జారీ చేసిన కేంద్రం..!!
Champions Trophy 2025: ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, రాజకీయ ఘర్షణల నేపథ్యంలో ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ నిర్వహణపై సందేహాలు వ్యక్తమౌతోన్నాయి.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కావాల్సి ఉంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య దేశం పాకిస్తాన్‌తో న్యూజిలాండ్ ఢీ కొట్టాల్సి ఉంది. మార్చి 9వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. భారత్ సహా ఎనిమిది దేశాలు- పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ జట్లు ఇందులో తలపడనున్నాయి.

ఈ దఫా ఈ టోర్నమెంట్‌ను పాకిస్తాన్ నిర్వహించాల్సి ఉంది. కరాచీ, లాహోర్, రావల్పిండిల్లో ఆయా మ్యాచ్‌లన్నీ షెడ్యూల్ అయ్యాయి కూడా. పాకిస్తాన్‌తో దశాబ్దాల కాలంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆ దేశ పర్యటనకు వెళ్లడానికి భారత్ అంగీకరించట్లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడటానికి జట్టును పాకిస్తాన్ పంపించడానికి ససేమిరా అంటోంది.
ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడటానికి భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్లబోదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ వెల్లడించారు. దీనిపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) ఓ ప్రకటన విడుదల చేసిందని తెలిపారు.
పాకిస్తాన్ విషయంలో భారత్ అనుసరిస్తోన్న విదేశాంగ విధానంలో భాగంగా ఈ మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని రణ్‌ధీర్ జైస్వాల్ చెప్పారు. జట్టు ఆటగాళ్లు, హెడ్ కోచ్, కోచింగ్ స్టాఫ్ భద్రత కారణాలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదం, క్రీడలను సమ దృష్టితో చూడలేమని ఆయన తేల్చి చెప్పారు.
భారత్ వంటి బలమైన జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడకపోవడం వల్ల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ భారీగా నష్టపోతుందనడంలో సందేహాలు అక్కర్లేదు. స్పాన్సరర్స్ పెద్దగా ముందుకు రారు. క్రికెట్‌ను ఆరాధించే కోట్లాదిమంది భారత అభిమానులు ఛాంపియన్స్ ట్రోఫీ చూడ్డానికీ పెద్దగా ఆసక్తి చూపరు.
వీటన్నింటనీ దృష్టిలో పెట్టుకుని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించేలా ముందస్తు ప్రణాళికలను రూపొందించింది ఐసీసీ. కొన్ని మ్యాచ్‌లను పాకిస్తాన్‌లో, భారత్ తలపడబోయే గేమ్‌లన్నింటినీ కూడా శ్రీలంక లేదా తటస్థ వేదిక దుబాయ్‌లల్లో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది.












Click it and Unblock the Notifications