మోకాళ్ల మీద తిరుమలకు: మొక్కు తీర్చుకున్న టీమిండియా స్టార్ క్రికెటర్
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనం కోసం టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులు తిరుమలకు బారులు తీరుతున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఉత్తరద్వారం గుండా దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి వేలసంఖ్యలో తరలి వస్తోన్నారు.
ఆదివారం నాడు 70,966 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 15,681 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 2.95 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. భక్తులకు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

తాజాగా- వైకుంఠ ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకోవడానికి టీమిండియా స్టార్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన ఆయన తిరుమలకు వచ్చారు. మోకాళ్ల పర్వతం దగ్గర మోకాళ్లతో మెట్లను ఎక్కారాయన. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ను తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
ఇటీవలే ఆస్ట్రేలియాలో ముగిసిన బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో నితీష్ కుమార్ రెడ్డి అదరగొట్టిన విషయం తెలిసిందే. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్‌లో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో నిప్పులు చెరిగిన ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి ఎదురొడ్డి నిలిచాడు. టెస్టుల్లో మొట్టమొదటి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 10 ఫోర్లు, ఒక భారీ సిక్సర్‌తో పరుగుల వరద పారించాడు. వంద పరుగులను అందుకున్నాడు.
ఈ సెంచరీ చరిత్రలో నిలిచిపోయింది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు లోయర్ ఆర్డర్ బ్యాటర్ల సహకారంతో భారీ స్కోర్‌ను అందించాడీ విశాఖపట్నం యువ క్రికెటర్. ఆస్ట్రేలియాతో ఆ దేశ పిచ్‌లపై బౌలర్ల దుమ్ము దులిపాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు విఫలమైన చోట.. తన సత్తా చాటాడు.
ఇప్పుడు ఇంగ్లాండ్‌లో పర్యటించే భారత టీ20 జట్టుకు ఎంపికయ్యాడు. ఈ నెల 22వ తేదీన తొలి మ్యాచ్ జరగబోతోంది. మొత్తం అయిదు టీ20లు, మూడు వన్డే ఇంటర్నేషనల్స్‌లల్లో తలపడనున్న జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ సిరీస్ ఆరంభానికి ముందు శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు వచ్చాడు.












Click it and Unblock the Notifications