ఆఫ్ట్రాల్ నమీబియా బౌలర్ పైనే చేతులెత్తేశారు- పాక్ మిస్టరీ స్పిన్నర్ పై ఎలా: మాకు నమ్మకం లేదు దొర
టీ20 ప్రపంచకప్ గ్రూప్ ఏ లో భాగంగా గురువారం రాత్రి ఢిల్లీలో జరిగిన మ్యాచ్ టీమిండియా విజయం సాధించింది. పసికూన నమీబియాను 93 పరుగుల తేడాతో ఓడించింది. మొత్తం నాలుగు పాయింట్లను సాధించి.. ఈ గ్రూప్ లో అగ్రస్థానానికి చేరింది. పాకిస్తాన్ కూడా నాలుగు పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ.. నెట్ రన్ రేట్ ఆధారంగా టాప్ పొజీషన్ కు వెళ్లింది భారత్.
తొలుత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా.. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు సాధించింది. భారత టాప్ ఆర్డర్, లోయర్ మిడిలార్డర్ బ్యాటర్లు ధాటిగా ఆడారు. ఓపెనర్ ఇషాన్ కిషన్- 61, లోయర్ మిడిలార్డర్ లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా- 52 హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. పవర్ ప్లేలో దూకుడుగా 86 పరుగులు చేసినప్పటికీ, ఆ తర్వాత ఇన్నింగ్ నెమ్మదించింది. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు విఫలం కావడం వల్ల మరింత భారీ స్కోర్ సాధించలేకపోయింది.

అయిదు పరుగుల వ్యవధిలో చివరి అయిదు వికెట్లు కోల్పోవడం టీమిండియా నిలకడలేమికి అద్దం పట్టింది. 205 పరుగుల వద్ద నాలుగో వికెట్ గా హార్దిక్ పాండ్యా అవుట్ కాగా.. ఆ తర్వాత 209 పరుగులకు ఏకంగా తొమ్మిది వికెట్లు నేలకూలాయంటే.. దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో రెండు అనవసరపు రనౌట్లు ఉన్నాయి. టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ శివం దూబే రనౌట్ కావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. రన్ వస్తుందా? రాదా అనేది అంచనా వేయలేకపోయాడు.
ఎనిమిది నుంచి 12వ ఓవర్ల మధ్య 30 బంతుల్లో భారత్ కేవలం 20 పరుగులు మాత్రమే చేసింది భారత్. ఈ సమయంలోనే నమీబియా స్పిన్నర్లు, కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్, బెర్నార్డ్ స్కోల్ట్జ్ పట్టు బిగించారు. వీరిద్దరూ 8 ఓవర్లలో 5 వికెట్లు తీసి కేవలం 61 పరుగులే ఇచ్చారు. సైడ్-ఆర్మ్ డెలివరీలతో ఎరాస్మస్ 20 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో టీ20 మ్యాచ్ లో ఓ స్పిన్నర్ సాధించిన అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలివి.
ఎరాస్మస్ బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొనలేకపోవడం టీమిండియా బ్యాటర్ల టెక్నిక్ లోపాలను ఎత్తిచూపినట్టయింది. ఆదివారం పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడాల్సిన దశలో భారత్‌కు ఎదురైన సవాల్ ఇది. ముఖ్యంగా పాక్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ విషయంలో. ఉస్మాన్ తారిక్ తన అసాధారణ బౌలింగ్ శైలితో ఇటీవల వార్తల్లో నిలుస్తున్నాడు. ముత్తయ్య మురళీధరన్‌ను పోలి ఉండే డబుల్-జాయింటెడ్ మోచేయి కారణంగా అతను నేరుగా బంతిని సంధించలేడు.
విలక్షణమైన రనప్, క్రీజులో 2-3 సెకన్లు ఆగి బంతిని వేయడం బ్యాటర్ల టైమింగ్‌ను దెబ్బతీస్తాయి. ఈ ప్రత్యేకతతో అతనికి టీ20 క్రికెట్‌లో స్థిరంగా వికెట్లు తీస్తున్నాడు. 75-80 కిలో మీటర్ల వేగంతో వేసే డిసెప్టివ్ క్యారమ్, స్కిడ్డీ ఆర్మ్, మైక్రో అవుట్-డ్రిఫ్ట్ డెలివరీలు అతన్ని ప్రమాదకరమైన మిస్టరీ స్పిన్నర్‌గా మార్చాయి. సెట్ అయిన బ్యాటర్లను కూడా తప్పులు చేయడానికి, టైమింగ్ మిస్సయిన షాట్లు ఆడటానికి ప్రేరేపిస్తాడు. ఇప్పటివరకు టీమిండియా అతని బౌలింగ్ ను ఎదుర్కొనలేదు కూడా.
ఎరాస్మస్ బౌలింగ్ నే ఎదుర్కొనలేనప్పుడు తారిఖ్ తో ఎలా తలపడతారనేది చర్చనీయాంశమౌతోంది. పాకిస్తాన్ టోర్నమెంట్ ప్రారంభం నుండి కొలంబోలోనే బస చేస్తోంది. నెదర్లాండ్స్, అమెరికాపై తమ తొలి రెండు మ్యాచ్‌లను సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్‌లో ఆడినా, శ్రీలంక పరిస్థితులకు ఇప్పటికే అలవాటు పడ్డారు. బలమైన స్పిన్ దళం ఉంది. ఉస్మాన్ తారిక్‌తో పాటు అబ్రార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, సాయిమ్ ఆయుబ్ వంటి స్పిన్నర్లు ఆ జట్టులో ఉన్నారు. వీరిని టీమిండియా ఎలా ఎదుర్కొంటారనేది వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications