Ind-SA test: అడిగింది వాళ్లే-ఓడిందీ..! ఈడెన్ పిచ్ పై తేల్చేసిన గంగూలీ..!
కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ చిత్తుగా ఓడింది. ముఖ్యంగా నాలుగో ఇన్నింగ్స్ లో 124 పరుగుల కనీస లక్ష్యాన్ని ఛేదించలేక 93 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఈడెన్ గార్డెన్స్ పిచ్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి చెత్త పిచ్ ఎలా తయారు చేస్తారంటూ స్టేడియం పిచ్ క్యూరేటర్ పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న సౌరభ్ గంగూలీ నేరుగా స్పందించారు.
మూడు రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టు మ్యాచ్ లో ఏ ఒక్క ఇన్నింగ్స్ లోనూ 200 పరుగుల్ని కూడా భారత్, దక్షిణాఫ్రికా చేయలేకపోయాయి. బౌలర్లకు స్వర్గధామంగా నిలిచిన ఈ పిచ్ పై అనూహ్య స్కోర్లు నమోదయ్యాయి. వికెట్లు టపటపా రాలాయి. దీంతో ఐసీసీ ఈ పిచ్ కు డీమెరిట్ పాయింట్లు కూడా ఇచ్చే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో అసలు జరిగిన విషయం ఏంటో క్యాబ్ అధ్యక్షుడిగా ఉన్న సౌరభ్ గంగూలీ వెల్లడించారు.

ఈడెన్ గార్డెన్స్ పిచ్ రూపకల్పనపై వస్తున్న విమర్శల్ని తప్పుబడుతూ సౌరభ్ గంగూలీ ఓ ప్రకటన చేశారు. ఇందులో ఆయన ఈడెన్ పిచ్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీకి అండగా నిలిచారు. భారత టీమ్ మేనేజ్ మెంట్ అడగడంతోనే తాము ఇలాంటి పిచ్ తయారు చేయాల్సి వచ్చిందని గంగూలీ తేల్చిచెప్పేశారు. భారత శిబిరం కోరుకున్న పిచ్ ను మాత్రమే తాము తయారు చేసి ఇచ్చినట్లు మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు కూడా అయిన గంగూలీ పేర్కొన్నారు.

అసలు ఈడెన్ గార్డెన్స్ పిచ్ పై బంతి ఇలా గింగిరాలు తిరుగుతూ బ్యాటర్లకు చుక్కలు చూపించడంపై స్పందిస్తూ.. దాని వెనుక ఉన్న కారణాన్ని కూడా గంగూలీ బయటపెట్టేశారు. మ్యాచ్ కు ముందు నాలుగు రోజులుగా ఈ పిచ్ పై వాటరింగ్ చేయలేదని, అందుకే ఇలా స్పందించిందని వెల్లడించారు. తద్వారా ఇలాంటి పిచ్ కు ముందుగానే సిద్దమై ఏదో ఊహించుకుని టీమ్ ఇండియా ప్లాన్ చేస్తే అది కాస్తా బెడిసి కొట్టిందని గంగూలీ చెప్పకనే చెప్పేశారు.












Click it and Unblock the Notifications