టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో రచ్చ..? ఎట్టకేలకు నోరు విప్పిన గంభీర్..!
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ లో టీమిండియా పేలవ ప్రదర్శన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా మెల్ బోర్న్ టెస్టులో భారత్ ఓటమి ప్రభావం జట్టు మేనేజ్ మెంట్ తో పాటు డ్రెస్సింగ్ రూమ్ పైనా పడింది. దీంతో డ్రెస్సింగ్ రూమ్ లో జట్టు హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఆటగాళ్లకు క్లాస్ పీకారంటూ చర్చ జరుగుతోంది. దీనిపై రెండు రోజులుగా మౌనంగా ఉన్న గంభీర్.. ఎట్టకేలకు నోరు విప్పాడు.
ఆస్ట్రేలియాలో టీమ్ ఇండియా వ్యూహాత్మక తప్పిదాలకు కోచ్ గౌతం గంభీరే కారణమని స్వదేశంలో విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ డ్రెస్సింగ్ రూమ్ లో సైతం ఆటగాళ్లకూ, కోచ్ కూ చెడిందన్న ప్రచారం ఊపందుకుంది. అసలే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ను డ్రా చేసుకోవాలంటే తప్పక గెలవాల్సిన సిడ్నీ టెస్టుకు ముందు ఇదంతా టీమ్ లో అశాంతి రేపిందన్న చర్చ జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం గంభీరే అన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. దీంతో గంభీర్ స్వయంగా వివరణ ఇచ్చాడు. ఐదో టెస్టు ముందు జరిగే ప్రీమ్యాచ్ ప్రెస్ మీట్లో గంభీర్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు.

వాస్తవానికి జట్టు డ్రెస్సింగ్ రూమ్ లో చర్చలు బహిరంగం కాకూడదని కోచ్ గౌతం గంభీర్ తెలిపాడు. అయితే భారత ఆటగాళ్లతో తాను నిజాయితీగా కొన్ని చర్చలు జరిపినట్లు మాత్రం అంగీకరించాడు. ఎందుకంటే అంతిమంగా వారి ప్రదర్శన మాత్రమే ఆటగాళ్లను కాపాడుతుందన్నాడు. డ్రెస్సింగ్ రూమ్ లో ఏదో జరిగిపోతోందన్నది కేవలం ప్రచారం మాత్రమేనని, అందులో ఎలాంటి నిజం లేదని గంభీర్ తేల్చిచెప్పేశాడు.
నిజాయితీపరులు డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండే వరకు భారత క్రికెట్ సురక్షితంగా ఉంటుందంటూ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మిమ్మల్ని డ్రెస్సింగ్ రూమ్‌లో ఉంచే ఏకైక విషయం పనితీరే అంటూ క్రికెటర్లకు సూచించాడు. జట్టుకు భావజాలం అనేది ముఖ్యమని, జట్టు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆడాల్సిందేనని తేల్చిచెప్పేశాడు. ప్రస్తుతానికి సిడ్నీ టెస్టు గెలవడం మినహా మరో ఆలోచన లేదన్నాడు. మొత్తం మీద తాను సీనియర్లు రోహిత్, విరాట్ కోహ్లితో టెస్ట్ మ్యాచ్‌లను ఎలా గెలవాలనే వ్యూహాల గురించి తప్ప ఎలాంటి చర్చలు చేయలేదని గంభీర్ క్లారిటీ ఇచ్చాడు.












Click it and Unblock the Notifications