పాకిస్తాన్ కు షాక్ ఇచ్చిన ఐసీసీ: ఆసియా కప్ నుంచి సడన్ గా విత్ డ్రా?
ఆసియా కప్ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను టోర్నమెంట్ ప్యానల్ నుండి తొలగించకపోతే మిగిలిన మ్యాచ్‌ల నుండి పాకిస్థాన్ వైదొలగే అవకాశం ఉందని పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వి హెచ్చరించారు. భారత్- పాకిస్థాన్ మధ్య జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడంపై జరిగిన వివాదం కారణంగానే నఖ్వి ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. కాగా.. రెఫరీని తొలగించాలంటూ పీసీబీ చేసిన డిమాండ్ ను ఐసీసీ తోసిపుచ్చింది.
మ్యాచ్ కు ముందు, ఆ తర్వాత అనంతరం భారత ఆటగాళ్లెవరూ కూడా పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వని విషయం తెలిసిందే. ఇది వివాదంగా మారింది. క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని పాకిస్తాన్ పేర్కొంది. ఐసీసీకీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎంసీసీ చట్టాల ఉల్లంఘనలను ప్రస్తావించింది. ఆసియా కప్ నుండి మ్యాచ్ రిఫరీని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ విషయాన్ని నఖ్వి సోమవారం ధృవీకరించారు.

ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్, స్పిరిట్ ఆఫ్ క్రికెట్‌కు సంబంధించిన ఎంసీసీ చట్టాలను మ్యాచ్ రిఫరీ ఉల్లంఘించారని ఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఆసియా కప్ నుండి మ్యాచ్ రిఫరీని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. తన దేశ గౌరవం, ప్రతిష్ట కంటే ముఖ్యమైనది ఏదీ లేదని నఖ్వి తేల్చి చెప్పారు. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో టాస్ సమయంలో పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సంప్రదాయ షేక్‌హ్యాండ్‌ను నివారించడంతో ఈ వివాదం మొదలైంది.
షేక్‌హ్యాండ్ ఇవ్వవద్దని తమ కేప్టెన్ సల్మాన్ ఆఘాకు పైక్రాఫ్ట్ ప్రత్యేకంగా ఆదేశించారని నఖ్వీ తెలిపారు. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని పాకిస్థాన్ జట్టు యాజమాన్యం నిరసన తెలిపిందని పేర్కొన్నారు. మ్యాచ్ తర్వాత కూడా సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబేకు మాత్రమే షేక్‌హ్యాండ్ ఇచ్చి, పాకిస్థాన్ ఆటగాళ్లను మర్యాదపూరకంగా కూడా పలకరించకుండా మైదానం నుండి వెళ్లిపోయాడని నఖ్వీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఈ విషయంపైస పాకిస్థాన్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్ కూడా స్పందించిన విషయం తెలిసిందే. మ్యాచ్ ముగిసిన తర్వాత షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి తమ ప్లేయర్లు సిద్ధంగా ఉన్నప్పటికీ టీమిండియా ప్లేయర్లు ముందుకు రానందుకు నిరాశ చెందామని హెస్సన్ వ్యాఖ్యానించారు. షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి వెళ్ళినా కూడా అప్పటికే వారు డ్రెస్సింగ్ రూమ్‌కి బయలుదేరారని చెప్పారు. మ్యాచ్ ఇలా ముగియడం నిరాశపరిచిందని వ్యాఖ్యానించారు. దీనికి నిరసనగా సల్మాన్ అలీ ఆఘా మ్యాచ్ అనంతరం ప్రెజెంటేషన్ వేడుకకు హాజరు కాలేదు.
కాగా.. రిఫరీని తొలగించాలంటూ పీసీబీ చేసిన డిమాండ్ ను ఐసీసీ తోసిపుచ్చింది. దీన్ని అంగీకరించలేమని తేల్చి చెప్పింది. ఓ భారీ టోర్నమెంట్ కు రిఫరీ ప్యానెల్ ను ఎంపిక చేసిన తర్వాత.. మధ్యలో అందులో మార్పులు చేర్పులు చేయడం సాధ్యం కాదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు తెలియజేసింది. అది ఐసీసీ నిబంధనలకు విరుద్దమనీ వ్యాఖ్యానించింది. దీంతో- పాకిస్తాన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠతను రేకెత్తిస్తోంది.












Click it and Unblock the Notifications