హార్దిక్ పాండ్యా మిడిల్ డ్రాప్- ఏకంగా గుడ్ బై
టీమిండియా ఆల్ రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టుకు గుడ్ బై చెప్పాడా? ఐపీఎల్ మిడ్ సీజన్ లోనే ఈ నిర్ణయం తీసుకున్నాడా? అనే ప్రశ్నలకు తాజాగా అవుననే సమాధానమే వినిపిస్తోంది. మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురి కావడం, పూర్తిగా అలసిపోవడం వంటి కారణాలతో జట్టును విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని సీజన్ మధ్యలోనే టీమ్ మేనేజ్‌మెంట్‌కు తెలియజేశారని పీటీఐకి వెల్లడించింది. ముంబై ఇండియన్స్ కు చెందిన టాప్ సోర్స్ ను తన కథనంలో ఉటంకించింది.
2024 ఐపీఎల్ సీజన్‌లో రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు హార్దిక్ పాండ్యా. అతని సారథ్యంలో ఏమాత్రం కూడా రాణించలేకపోయిందా టీమ్. ఆ సీజన్ లో పాయింట్ల పట్టికలో పదో స్థానంలో నిలిచింది. గత ఏడాది ఫర్వాలేదనిపించింది. ప్లేఆఫ్స్ కు చేరుకుంది. ఈ సీజన్ లో కూడా మళ్లీ పాతబాటే పట్టింది. 14 మ్యాచ్ లల్లో నాలుగింట్లో మాత్రమే నెగ్గింది. తొమ్మిది స్థానంతో సరిపెట్టుకుంది.
దీంతో జట్టును వీడాలని హార్దిక్ పాండ్యా నిర్ణయం తీసుకున్నాడని, ఈ విషయాన్ని సీజన్ మధ్యలోనే మేనేజ్‌మెంట్‌కు స్పష్టం చేసినట్లు పీటీఐ వెల్లడించింది. ప్లేఆఫ్ ఆశలు చేజారిన తర్వాత.. హార్దిక్, ముంబై ఇండియన్స్ యాజమాన్యం పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

హార్దిక్ మానసికంగా ఒత్తిడికి గురై పూర్తిగా అలసిపోయాడు. అతనికి వెన్నునొప్పి కూడా ఉంది. నిజానికి, ప్లేఆఫ్ ఆశలు సన్నగిల్లిన తర్వాత, హార్దిక్ తాను జట్టులో కొనసాగనని ముంబై ఇండియన్స్ కు తెలియజేశాడని పీటీఐ వివరించింది. 2024లో రోహిత్ శర్మ స్థానంలో కేప్టెన్సీ పగ్గాలను అందుకున్నప్పటి నుంచే అతను ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోన్నాడు.
పీటీఐ కథనం ప్రకారం.. మొదటి సీజన్‌లోనే అభిమానుల నుంచి ట్రోల్ ఎదుర్కొన్నాడు. ఈ సీజన్‌లో కూడా అతను వేసిన ప్లాన్లు ఏవీ కూడా వర్కౌట్ కాలేదని ఐపీఎల్ వర్గాలు గుర్తు చేశాయి. 2021లో వదిలిపెట్టిన ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్ 2024లో తిరిగి వచ్చినప్పుడు ఒకప్పటిలా లేదు. సీనియర్ ఆటగాళ్లందరూ ఏకాభిప్రాయంతో లేరని, అది జట్టు కేప్టెన్ కు సవాల్ గా మారింది.
భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ జట్టు విజయాలను సాధిస్తే నిరాశ చెందాల్సిన అవసరం లేదు. దానికి భిన్నంగా ఎటువంటి ఫలితం వచ్చినా అది జట్టు కేప్టెన్ పైనే పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో జట్టులో కొనసాగే మానసిక శక్తి ఆ ప్లేయర్ కు ఉండదు. అందుకే వచ్చే సీజన్‌లో తాను ముంబై ఇండియన్స్ తరపున ఆడకూడదని హార్దిక్ సీజన్ మధ్యలోనే నిర్ణయించుకున్నాడని ఐపీఎల్ వర్గాలు స్పష్టం చేశాయి.
హార్దిక్ పాండ్యా మరో జట్టుతో ట్రేడ్ డీల్ కోసం చూస్తున్నారా లేదా మెగా వేలంలో పాల్గొనాలనుకుంటున్నాడా అనేది ఇంకా స్పష్టం కాలేదు. "ఒక విషయం మాత్రం ఖాయం. అతను ముంబై ఇండియన్స్‌తో తన ప్రయాణాన్ని ముగించాడు. ఆగస్టు నాటికి అతని తదుపరి అడుగులు ఎటు పడతాయనే విషయంపై స్పష్టత రావొచ్చు.." అని ఆ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఈ విషయంలో అతను చెన్నై సూపర్ కింగ్స్ వైపు మొగ్గు చూపొచ్చని అంటున్నారు.












Click it and Unblock the Notifications